Ys jagan:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో విజయం తర్వాత టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పరిణామాలు వేగంగా మారాయి. ఆ వెంటనే వైఎస్సార్సీపీని కూటమి నేతలు టార్గెట్ చేయడంతో వైసీపీ అధినేత జగన్ నోరు విప్పక తప్పలేదు. ఇదే క్రమంలో వైసీపీ క్యాడర్ మీద దాడులు కూడా జరిగాయి. ఏదైనా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిందంటే కనీసం ఆరు నెలల సమయం వేచి చూడాలి. ఆ గడువులో అప్పుడే వచ్చిన ప్రభుత్వం అన్నీ సర్దుకుని కుదురుకోవాలి. ఆ సమయంలో విపక్షాలు తప్పుని ఎత్తిచూపినా ప్రజల చెవికి ఏ మాత్రం ఎక్కవు. దాంతో కూడా విపక్షం సైలెంట్ గా ఉంటేనే బెటర్ అన్నది ఒక రాజకీయ నీతిగా అమలవుతూ వస్తోంది. ఇక్కడ జగన్ కూడా చేసింది ఇదే. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ కానీ, వైసీపీ ముఖ్య నేతలు కానీ ఎలాంటి చడీచప్పుడు లేకుండా ఉన్నారు. ప్రజలు కూడా కొత్త సర్కారు పనితనం మీద కోటి ఆశలతో వేచి చూస్తుంటారు. కానీ, ఇప్పటికే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు మూడు నెలలు అవుతున్నా ఎలాంటి కార్యాచరణ కనిపించడం లేదు.
అభివృద్ధి సంగతి అంటుంచి, వైసీపీపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం అలవాటు చేసుకుంది టీడీపీ కూటమి. అదే సమయంలో వరుసగా ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు ఏపీని అల్లకల్లోలం చేశాయి. విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లో జరిగిన భారీ ప్రమాదంలో 19 మంది మరణించడం, విజయవాడలో భారీ వరదలు.. ఇలాంటి ఘటనలతో జగన్ స్పందించాల్సి వచ్చింది. అధికారంలో లేకపోయినా జనం కోసం కదిలి వచ్చిన వైసీపీ అధినేతపై విమర్శలు చేయడం తప్పనిసరి పనిగా పెట్టుకుంది. దీంతో సహజంగానే వైసీపీ స్పందించాల్సి వస్తోంది. ‘మాకు పని చాలా ఉంది అందుకే ఇక్కడ ఉంటున్నాం, జగన్ కి పని లేదు కాబట్టే లండన్ టూర్ పోతున్నారు’ అని కొద్ది రోజుల క్రితం చంద్రబాబు మీడియాతో అన్నట్లుగా వార్తలు వచ్చాయి. మరి అదే సమయంలో విజయవాడ వరద విపత్తుని పక్కనపెట్టి నారా లోకేష్ కూడా హైదరాబాద్ వెళ్లిపోవడం గమనార్హం.
అయితే.. ఇదంతా ఇప్పుడు వైసీపీ ప్రశ్నిస్తుంటే.. అధికారం పోయిందన్న ఆక్రోశంతోనే వైసీపీ ఇలా చేస్తుందని కూటమి పెద్దలు వంత పాడడం మామూలైపోయింది. అంతేకాదు.. తనను ఓడించిన ప్రజల మీద జగన్ కి, వైసీపీకి అక్కసు ఉందని కూడా ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో జగన్ అండ్ టీం కొన్నాళ్ల పాటు స్పందించకుండానే ఉంటేనే మంచిదని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.