Chandrababu: తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును ఎందుకు కలిశారు? దీని వెనుక ఉన్న కారణాలేంటి? విజయవాడ వెళ్లి మరీ కలవాల్సిన పరిస్థితి ఏంటి? వరదలతో పాటు ఇతరత్రా పనుల్లో బిజీగా ఉన్న చంద్రబాబు విలువైన సమయం కేటాయించడం ఏంటి? అసలు ఎవరు పంపితే ఉత్తమ్ చంద్రబాబు వద్దకు వెళ్లారు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం తెలంగాణాలో పాడె కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. రచ్చకు దారితీసింది. అయితే ఈ వివాదానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కారణమని బీజేపీ ట్విట్ చేసింది. పాడె కౌశిక్ రెడ్డి వెనుక ఉత్తమ్ ఉన్నారన్నది కమలనాథుల నుంచి వస్తున్న ఆరోపణ. సరిగ్గా ఇదే సమయంలో ఉత్తమ్ చంద్రబాబును కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తెలంగాణ కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. అయితే.. వీరి భేటీ వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అలాగే.. ప్రభుత్వపరంగానూ ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయనే అంశంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య పద్మావతి రెడ్డితో కలిసి భేటీ అయ్యారు. అయితే తన చిన్ననాటి స్నేహితుడిని పరామర్శించేందుకు ఉత్తమ్ విజయవాడ వెళ్లినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఆ కార్యక్రమం ముగిశాక చంద్రబాబుతో భేటీ అయ్యారని తెలిపారు. అయితే ఈ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం కానీ, ప్రభుత్వపరమైన కార్యాచరణ కానీ లేదని వారు వెల్లడిస్తున్నా.. దాని వెనుక పెద్ద రహస్యమే దాగి ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఉత్తమ్ దంపతులు చంద్రబాబుతో భేటీ కావడంపై కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పార్టీల మధ్య పొత్తు అంశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. దాంతో చంద్రబాబుతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ చాలా దూరదృష్టితోనే ఉత్తమ్‌ను చంద్రబాబు వద్దకు పంపినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధంతో ప్రాంతీయ వాదం తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో సెటిలర్స్ అన్న మాట వినిపిస్తోంది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతోంది. ఈ వాదన తెరపైకి రావడంతో..దానికి కట్టడి చేసేందుకే ఉత్తమ్ చంద్రబాబుని కలిశారా? అన్నది మరో అనుమానం. అయితే ఉత్తమ్ మాత్రం ప్రత్యేక వ్యూహంతోనే వెళ్లి ఉంటారని.. జాతీయస్థాయిలో కాంగ్రెస్ దూతగా వెళ్లారని ప్రచారం నడుస్తోంది.
కేంద్రంలో బీజేపీ కొలువుదీరడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బిహార్ సీఎం నితీష్ కుమార్ చాలా కీలకంగా మారింది. ఒకవిధంగా చెప్పాలంటే వీరిద్దరి మద్దతుతోనే కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వం కొలువుదీరిందనేది బహిరంగ వాస్తవం. అయితే.. నితీష్ కుమార్ బీజేపీపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ నితీష్ కుమార్ బీజేపీకి మద్దతు ఉపసంహరిస్తే ఆయన కచ్చితంగా కాంగ్రెస్ పక్షాన చేరుతారు. దాంతో కాంగ్రెస్‌కు మరింత బలం చేకూరినట్లు అవుతుంది. ఈ క్రమంలో కేంద్రంలో కీలకంగా ఉన్న చంద్రబాబు మద్దతు కూడా కూడగడితే కాంగ్రెస్‌కు మరింత బలం పెరుగుతుందని అధిష్టానం ఆలోచన అని తెలుస్తోంది. అందుకే.. కాంగ్రెస్ హైకమాండ్ ఉత్తమ్‌ను దూతగా పంపించిందని ప్రచారం జరుగుతోంది. భవిష్యత్ ప్రణాళిక కోసమే ఉత్తమ్ చంద్రబాబును కలిశారనే టాక్ నడుస్తోంది.