మునుగోడులో వైఎస్‌ను వదిలేసిన కాంగ్రెస్ ..క్యాష్ చేసుకున్న బీజేపీ
మునుగోడులో వైఎస్‌ఆర్ అస్త్రం వదిలిన కోమటిరెడ్డి .. గెలుపు ఆయనదేనా..?
ఎవరు అవునన్నా ఎవరు కాదన్న కూడా తెలంగాణలో ఇప్పటికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్‌ను అభిమానించే వారి సంఖ్య అధికంగా ఉంది. మరి ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ జిల్లాలలో వైఎస్ఆర్‌ను ఇప్పటికి అభిమానిస్తుంటారు. తాజాగా మునుగొడులో ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. మునుగొడులో కూడా వైఎస్ఆర్‌కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే .. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు కూడా వైఎస్ఆర్ అంటే ఎనలేని అభిమానం.అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాని… ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఇద్దరు కూడా రాజకీయంగా ఎదిగారంటే దానికి కారణం వైఎస్ఆరే. ఇదే విషయాన్ని వారు ప్రస్తావిస్తుంటారు. అవకాశం దొరికినప్పుడల్లా కూడా వైఎస్ఆర్ మీద తమ ప్రేమను కనబరుస్తుంటారు.
తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరడం జరిగింది. దీంతో మునుగొడులో ఉప ఎన్నిక అనివార్యం అయింది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా మునుగొడు ఉప ఎన్నికలో తీవ్ర ప్రచారం చేశాయి. అయితే ఎన్నికల ప్రచారంలో.. బీజేపీ సడన్‌గా వైఎస్ఆర్ పేరును వాడుకుని అందరికి షాకిచ్చింది. పార్టీలకు అతీతంగా వైఎస్ సెంటిమెంటు ఎక్కడ అవసరం ఉన్నా.. ఇప్పటికే వాడుకుంటున్నారు. తాజాగా మరోసారి వైఎస్ఆర్ పేరు తెర మీదకు వచ్చింది. వైఎస్ పాదయాత్రలో నల్లగొండలో పర్యటించిన సమయంలో ఇక్కడి ఫ్లోరోసిస్ బాధితుల సమస్యలు విన్నారు. ఇక్కడ ఏం చేస్తే బాగుంటుందనే విషయాన్ని పరిశీలించి.. సమస్య శ్రీకారం కూడా చూట్టారు. అయితే ఈలోపే ఆయన మరణించడంతో..ఈ సమస్య అక్కడితో ఆగిపోయింది.
మరి అలాంటి వైఎస్‌ను ప్రస్తుతం కాంగ్రెస్ ఎందుకో మరచిపోయిందనే టాక్ వినిపిస్తోంది. పార్టీలో ఎక్కడ కూడా వైఎస్ఆర్ పేరు వినిపించడం లేదు. మునుగోడు ఉప ఎన్నికల పోరాటంలో వైఎస్ బొమ్మను కానీ, ఆయన పేరును కానీ.. కాంగ్రెస్ నేతలు తలుచుకోవడం లేదు. కనీసం.. పట్టించుకోవడం కూడా లేదు. కాని ఇదే సమయంలో బీజేపీ వైఎస్ఆర్ పేరును క్యాష్ చేసుకుందనే చెప్పాలి. బీజేపీ నేతలు వైఎస్‌ను అందిపుచ్చుకున్నారు. ఆయన వేష ధారణలో ఉన్న ఒక వ్యక్తిని నియమించి.. ఇక్కడ ప్రచారం చేయించారు. ఈయన కూడా అచ్చు వైఎస్ మాదిరిగానే ఉండడం మరో విశేషంగా మారింది. అచ్చు గుద్దినట్లుగా ఆయన హావ భావాలే పలికిస్తుండడం అందరిని ఆకట్టుకుంది. నమస్తే.. నమస్తే.. ” అంటూ వైఎస్ వేషధారణలో ఉన్న వ్యక్తి ప్రచారం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా బీజేపీకి లాభం చేకుర్చే అంశమే అని రాజకీయ పండితులు అంటున్నారు. మరి కాంగ్రెస్ వదిలేసిన వైఎస్ఆర్‌ను బీజేపీ వినియోగించుకుని ఎలాంటి ఫలితాలను రాబడుతుందో చూడాలి.