Saturday, October 5, 2024

Hydra : హైడ్రా దూకుడుకు కళ్లెం.. ఇలానే కొనసాగితే రేవంత్ ప్రభుత్వానికి ప్రమాదం

- Advertisement -

Hydra : తెలంగాణలో రేవంత్ సర్కారు తీసుకొచ్చిన హైడ్రా ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసిన హైడ్రా పేరే మార్మోగుతోంది. ముఖ్యంగా అవుటర్ రింగ్ రోడ్ లోపల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు కాపాడటం కోసం రేవంత్ రెడ్డి సర్కారు హైడ్రా తీసుకొచ్చింది. దీనికి సీనియర్ ఐపీఎస్ ఏవీ రంగనాథ్‌ను కమిషనర్‌గా నియమించి ఫుల్ పవర్స్ ఇచ్చింది ప్రభుత్వం.రూల్స్‌కు భిన్నంగా ఉన్న కట్టడాలను నిర్ధాక్ష్యిణంగా కూల్చేయమని ఆదేశాలిచ్చింది సర్కారు. దీంతో రోజుకొక చోట హైడ్రా బుల్డోజర్లు అక్రమ కట్టడాలపై విరుచుకుపడుతున్నాయి. ఇక చెరువుల్లో ఫుల్ ట్యాంక్ లెవల్ – ఎఫ్టీఎల్‌లో ఉన్న నిర్మాణాలు తొలగించుకోవాలని ఇప్పటికే వందల నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది.ఇంత వరకు అంతా బాగానే ఉన్నా… కొన్ని అంశాలు సర్కారుకు తలనొప్పిగా మారుతున్నాయి.

తెలంగాణలో అమలుచేస్తున్న హైడ్రా పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో హైడ్రాను విస్తరించడం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే హైడ్రా పేరుతో ప్రత్యేక చట్టాన్ని రూపొందించబోతున్నట్టు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. నిబంధనలపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే హైడ్రా పేరుతో కబ్జాదారులకు స్వయంగా నోటీసులు జారీ చేస్తామని ఏవి రంగనాథ్ వెల్లడించారు.అయితే ఎడాపెడా కూల్చివేతలతో అసలుకే ఎసరు వస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పతనమవుతోంది. ఇప్పటికే తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం అంతంతమాత్రంగానే ఉన్న విషయం విదితమే.

ఈ కూల్చివేతల ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్రంగా పడింది. అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుండడంతో సిటీ పరిధిలో రియల్ వ్యాపారం దెబ్బకు పడిపోయింది. అంతేకాదు.. పలుచోట్ల ధరలు సైతం భారీగా తగ్గినట్లుగా తెలుస్తోంది. దీంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు తీవ్ర స్థాయిలో నష్టాన్ని ఎదుర్కొంటోంది. అయితే.. జన్వాడలోని కేటీఆర్‌కు చెందినదని చెప్తున్న ఫామ్‌హౌస్ పరిధిలోని భూముల ధరలు కూడా ఊహించని స్థాయికి పడిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ ఫామ్‌హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దానిని కూడా హైడ్రా కూల్చివేస్తుందని ప్రచారం జరిగింది. చివరకు అది 111 జీవో పరిధిలో ఉందని హైడ్రా కమిషనర్ వెల్లడించారు. కానీ.. ఆ తీవ్రత మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఓ కుదుపు కుదిపేసింది. జన్వాడ ఫామ్‌హౌస్ పరిధిలోని భూముల రేట్లు పడిపోవడమే ఇందుకు నిదర్శనం.

తెలంగాణలో హైడ్రా ఎఫెక్ట్ రిజిస్ట్రేషన్ శాఖపై ప్రభావం చూపిస్తోంది. అక్రమాలపై దూకుడుగా వ్యవహరిస్తున్న హైడ్రా.. పెద్ద ఎత్తున కట్టాడాలను కూల్చివేస్తోంది. దీంతో రాష్ట్రంలో భూములు కొనడం, ​అమ్మడం తగ్గిపోయింది. ఈ మేరకు జులైతో పోలిస్తే ఆగస్టు నెలలో రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టగా.. దాదాపు రూ.320 కోట్ల ఆదాయం తగ్గిపోయినట్లు రెవెన్యూ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి, సంగారెడ్డిలో జులైలో 58 వేల రిజిస్ట్రేషన్లు అయితే ఆగస్టు నెలలో 41 వేల 200 మాత్రమే అయినట్లు అధికారులు తెలిపారు. జూలైలో రూ.11 వేల కోట్ల ఆదాయం రాగా ఆగస్టులో రూ.785 కోట్లు మాత్రమే వచ్చిందని, దీంతో రూ.320 కోట్లు తగ్గినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆదాయం లేక రాష్ట్ర పరిస్థితి తీసికట్టుగా మారింది. కనీసం జీతాలు, పింఛన్లు సకాలంలో అందే పరిస్థితి లేదు. ఈ సమయంలో చేజేతులా హైడ్రాతో ముందుకెళితే రేవంత్ సర్కారు ఇబ్బందుల్లో పడాల్సిందే. అందుకే హైడ్రా దూకుడుకు కళ్లెం వేయాల్సిన అవసరం అనివార్యంగా మారింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!