ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. తన తండ్రి నియోజకవర్గమైన కుప్పం నుంచి లోకేష్ అట్టహాసంగా పాదయాత్ర ప్రారంభించారు. లోకేష్ పాదయాత్ర రాష్ట్ర ప్రజల్లో పెద్దగా ఆసక్తిని కల్పించకపోయినా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం అమితాసక్తి ప్రదర్శించారు. ఈ పాదయాత్రతో మళ్లీ తమ పార్టీకి మంచి రోజులు వస్తాయని, లోకేష్ బాబు మాస్ లీడర్ అవుతారని ఆ పార్టీ నేతలు వెయ్యి ఆశలు పెట్టుకున్నారు. లోకేష్ కూడా వీరి అంచనాలను అందుకునేందుకు భారీగానే కష్టపడ్డారు. చాలా రోజులుగా ఆయన సీరియస్‌గా ఎలా మాట్లాడాలో, తప్పులు లేకుండా తెలుగులో ఎలా మాట్లాడాలో నేర్చుకుంటున్నారు.
దీంతో పాదయాత్ర మొదటి స్పీచ్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది. అయితే, ఈ స్పీచ్ చూసిన తర్వాత కొత్త విషయం అర్థమవుతున్నది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను బుట్టలో వేసుకునేందుకు లోకేష్ ఎంతగా ప్రయత్నిస్తున్నారనే విషయం స్పష్టంగా ఆయన మాటలే చెప్తున్నాయి. తన పాదయాత్ర అయిన యువగళంతో పాటు పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని కూడా ప్రభుత్వం ఆపలేదని, ఆపితే తొక్కుకుంటూ పోతామని లోకేష్ చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్‌ను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ శత్రువులను కూడా లోకేష్ తన శత్రువులుగా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల మంత్రి రోజాపై ఆగ్రహంతో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆమెను డైమండ్ రాణి అంటూ అవమానకరంగా విమర్శించారు. ఇప్పుడు లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ చేసిన విమర్శనే రోజాపై చేశారు. అంటే, పవన్ కళ్యాణ్, తాను ఇద్దరమూ ఒకటే అని లోకేష్ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు నీ శత్రువులు నాకు కూడా శత్రువులే అని పవన్ కళ్యాణ్‌కు ఇన్‌డైరెక్ట్‌గా సిగ్నళ్లు పంపే ప్రయత్నం లోకేష్ చేస్తున్నారు.
నిజానికి, పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు నాయుడుపైన మంచి అభిప్రాయం ఉన్నా లోకేష్‌పైన మాత్రం సదభిప్రాయం లేదనే ప్రచారం ఉంది. గతంలో 2014 ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డారు. ఈ కృతజ్ఞతను అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ చూపించలేదనే భావన పవన్ కళ్యాణ్‌లో ఉందంటారు. బహుశా ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ను మళ్లీ మచ్చిక చేసుకునేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నది.
పవన్ కళ్యాణ్ మద్దతు లేకుండా, జనసేన పొత్తు లేకుండా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశమే లేదనేది చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌కు స్పష్టంగా తెలుసు. జనసేనతో పొత్తు ఉంటేనే కనీస విజయావకాశాలైనా ఉంటాయని వారికి అర్థమైంది. అందుకే, ఎక్కడ సందు దొరికినా పవన్ కళ్యాణ్‌ను బుట్టలో వేసుకోవాలని, పొత్తుకు ఒప్పించాలని చంద్రబాబు నాయుడు ఇప్పటికే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు లోకేష్ కూడా ఈ ప్రయత్నాలను మొదలుపెట్టారు.
గతంలో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పవన్ వల్ల తాము అధికారంలోకి రాలేదనే పదే పదే చెప్పారు. అప్పుడు లోకేషే వీరితో ఇలా చెప్పించి పవన్ కళ్యాణ్‌ను పలుచన చేసే ప్రయత్నం చేశారనే ప్రచారం కూడా ఉంది. అందుకే, పాతవన్నీ పవన్ కళ్యాణ్ మర్చిపోయేలా చేయడం కోసం, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం ఆయనను ఉపయోగించుకునేందుకు లోకేష్ బాబు బాగానే దువ్వుతున్నారు. మరి, పవన్ కళ్యాణ్ వీరి బుట్టలో పడతారో లేదో చూడాలి.