గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ జగన్ హవా నడిచింది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ సీట్లలో 22 స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కానీ, గుంటూరు, కృష్ణ, శ్రీకాకుళం లోక్‌సభ స్థానాలు మాత్రం తెలుగుదేశం పార్టీ ఖాతాలో పడ్డాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీకి ఇంతవరకు పట్టు దొరకలేదు. గత రెండు ఎన్నికల్లోనూ ఈ మూడు సీట్లను తెలుగుదేశం పార్టీనే గెలుచుకుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఈ మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరేయాలని ముఖ్యమంత్రి జగన్ పట్టుదలగా ఉన్నారు. ఇందుకోసం ఒక్కో నియోజకవర్గంపైన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
నిజానికి గత రెండు ఎన్నికల్లోనూ గుంటూరు లోక్‌సభ సీటును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోకపోవడానికి ప్రధాన కారణం చివరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటించడమే. ఒకవైపు తెలుగుదేశం పార్టీ తరపున ఇక్కడి నుంచి గల్లా జయదేవ్ పోటీ చేస్తారని ఎన్నికలకు చాలా రోజుల క్రితం నుంచే క్లారిటీ ఉంది. ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకొని రెండు ఎన్నికల్లోనూ గెలిచారు. కానీ, వైసీపీ మాత్రం ఎన్నికల చివరి నిమిషం వరకు అభ్యర్థులను ఖరారు చేయలేకపోయింది. 2014లో చివరి నిమిషంలో వల్లభనేని బాలశౌరిని బరిలోకి దింపింది. ఆయన 70 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
2019లోనూ ఇలానే జరిగింది. చివరి నిమిషంలో టీడీపీ నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని వైసీపీలో చేర్చుకొని గుంటూరు ఎంపీగా పోటీ చేయించారు. నిజానికి ఆయనకు గుంటూరు నగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉండేది. కానీ, పార్టీ ఆదేశాల మేరకు ఎంపీగా పోటీ చేసి కేవలం నాలుగు వేల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈ ఇద్దరు అన్ని విధాలుగా బలమైన అభ్యర్థులే అయినా చివరి నిమిషంలో పోటీ చేయడం వల్ల ఓడిపోవాల్సి వచ్చింది. ఈ తప్పిదం ఈసారి జరగకుండా చూడాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం.
అందుకే, ఇప్పటికే గుంటూరు అభ్యర్థి విషయంలో ఆయన ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తున్నది. గత ఎన్నికల్లో నరసరావుపేట నుంచి ఎంపీగా భారీ విజయం సాధించిన లావు శ్రీకృష్ణదేవరాయలుని ఈసారి గుంటూరు ఎంపీగా పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. సామాజకవర్గ సమీకరణాలు, ఆర్థికంగా గల్లా జయదేవ్‌కు ఆయన ధీటైన అభ్యర్థి అని జగన్ అనుకుంటున్నట్లు సమాచారం. ఇక నరసరావుపేట ఎంపీ స్థానానికి ప్రస్తుత వైసీపీ మహిళా మంత్రిని పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారట.
సామాజకవర్గ సమీకరణాల దృష్ట్యా ఈ సీటు బీసీలకు ఇస్తే కచ్చితంగా మళ్లీ గెలుపు ఖాయమని జగన్ వద్ద లెక్కలు ఉన్నాయని అంటున్నారు. అందుకే, మహిళా మంత్రిగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించిన నాయకురాలిని ఈసారి నరసరావుపేట లోక్‌సభ బరిలో నిలిపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఆమె అయితే మళ్లీ నరసరావుపేట సీటు వైసీపీ ఖాతాలో పడుతుందని, ఇదే సమయంలో శ్రీకృష్ణదేవరాయలును గుంటూరు పంపించడం ద్వారా ఈ సీటు కూడా గెలుచుకోగలదని వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఎన్నికలకు కనీసం ఏడాది ముందే ఈ ఇద్దరి అభ్యర్తిత్వాల మీద స్పష్టత ఇస్తే గత రెండు ఎన్నికల్లో జరిగిన తప్పులు జరగకుండా ఉంటాయని వైసీపీ భావిస్తున్నదట. ఇక గత ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని ఈసారి గుంటూరు ఎమ్మెల్యేగా పోటీ చేయించే ఛాన్స్ ఉందని సమాచారం. మహిళా మంత్రి ఎంపీగా పోటీ చేస్తే ఆమె స్థానం నుంచి అక్కడ చాలా కాలంగా పార్టీ నేతగా ఉన్న సీనియర్‌ను ఎమ్మెల్యేగా పోటీ చేయించే అవకాశం ఉంది.