ఏపీకి కొత్త డీజీపీ ఎవరు? సీనియారిటీకి ప్రాధాన్యం ఇస్తారా? అస్మదీయ అధికారులకు పెద్దపీట వేస్తారా? ఎవరిని ఎంపిక చేస్తారు? రేసులో ఉన్నది ఎవరు? పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. రాష్ట్ర పోలీస్ బాస్ ను ప్రభుత్వం నియమించడం ఆనవాయితీ. అయితే తమ చెప్పు చేతల్లో ఉండే అధికారిని నియమించుకోవడం కూడా సర్వసాధారణం. ప్రస్తుత డిజిపి ద్వారకా తిరుమల రావు ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించడం అనివార్యంగా మారింది. ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం డిజిపి తో పాటుగా ఆర్టీసీ ఎండిగా పూర్తి అదనపు బాధ్యతలో ఉన్నారు. అయితే ఈ నెల 31 తో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఆయనను ఆర్టీసీ ఎండీ గా కొనసాగించే పరిస్థితి మాత్రం కనిపిస్తోంది.
రాష్ట్ర డిజిపిగా ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా హరీష్ కుమార్ గుప్తా పేరు వినిపిస్తోంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా పనిచేస్తున్న ఆయన గతంలోనూ డీజీపీగా పనిచేశారు. మొన్నటి ఎన్నికల సమయంలో అప్పటి డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి ని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను నియమించింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత డిజిపి నియామకం పై దృష్టి పెట్టింది. ద్వారకా తిరుమలరావు ఎంపిక చేసింది. అయితే ఇప్పుడు ద్వారకాతిరుమలరావు పదవీ విరమణ చేయడంతో మళ్లీ హరీష్ కుమార్ గుప్తాను నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈయన 1992 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. సీఎం చంద్రబాబు దాదాపు ఈయన వైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం నడుస్తోంది.
అయితే సీనియారిటీ జాబితాలో సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నారు. 1991 బ్యాచ్ కు చెందిన ప్రతాప్ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ గా విధులు నిర్వహిస్తున్నారు. సీనియారిటీ జాబితాలో ప్రతాప్ మొదటి స్థానంలో ఉండగా.. తరువాత స్థానంలో హరీష్ కుమార్ గుప్తా ఉన్నారు. మాదిరెడ్డి ప్రతాప్ గతంలో జగన్ హయాంలో ఆర్టీసీ ఎండీ గా పని చేశారు. అప్పట్లో ఓ వివాదంలో విచారణను ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ విచారణను నిలిపివేసింది. అయితే అది డిజిపి నియామకం కోసమేనని అంతా ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు హరీష్ కుమార్ గుప్తా పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు సీనియర్ ఐపిఎస్ రవిశంకర్ అయ్యన్నార్ పేరు కూడా తెర మీదకు వచ్చింది.
వాస్తవానికి సీనియారిటీతో పాటు సుదీర్ఘ సేవలను పరిగణలోకి తీసుకొని డిజిపిని ఖరారు చేస్తుంటారు. అన్ని సమీకరణలను పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఇది గతంలో ఉండేది ఈ సంస్కృతి. కానీ ఇప్పుడు అస్మదీయ అధికారుల కి పెద్దపీట వేస్తున్నారు. తమకు, తమ పార్టీకి, తమ ప్రభుత్వానికి అడ్డుగా ఉండే అధికారులను కీలక పోస్టుల్లో నియమిస్తున్నారు. ఈ కోవలోకే చెందుతుంది రాష్ట్ర డిజిపి. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కానీ డిజిపి పోస్ట్ ముగ్గురు అధికారుల మధ్య దోబూచులాడుతోంది. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే డిజిపి ఎవరనేది ఒక ప్రత్యేక ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.