ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన గతంలో ఉన్నంతలా ఇప్పుడు ప్రజల్లో ఉండలేకపోతున్నారు. పాలనా బాధ్యతల్లో బిజీగా ఉండటం వల్ల గతంలో ఆయన ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు. ఇదే ప్రతిపక్ష పార్టీలకు అలుసైపోయింది. అవకాశంగా మారింది. అందుకే ఒక వైపు నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు కూడా ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ముగ్గురి లక్ష్యం జగన్‌ను విమర్శించడమే. ముగ్గురూ ఒకే విమర్శను, అబద్దాన్ని పదేపదే చెబితే అది ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇది ఎంతో కొంత జగన్‌కు నష్టం చేసే ప్రమాదం ఉంటుంది.
ఈ ముగ్గురికి సరైన కౌంటర్ ఇవ్వాలన్నా, నోర్లు మూతబడేలా చేయాలన్నా రంగంలోకి జగన్ దిగాల్సిందే. పైగా ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇక ప్రజల్లోనే ఉండాలని జగన్ నిర్ణయించారు. ఇందుకు గానూ పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఏప్రిల్ నుంచి ఆయన బస్సు యాత్ర చేపడతారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంచుకొని ప్రజలతో రచ్చబండ నిర్వహిస్తారు. వారికి ప్రభుత్వ పథకాలు ఎలా అందుతున్నాయో ప్రజలనే అడిగి తెలుసుకుంటారు. తర్వాత అదే గ్రామంలో నిద్ర చేస్తారు.
దాదాపు ఆరేడు నెలల పాటు ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఇందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. షెడ్యూల్ కూడా ఖరారు చేసే పనిలో కొందరు పార్టీ ముఖ్యులు నిమగ్నమయ్యారు. నేరుగా ప్రజల్లోకి వెళ్లి వారి ద్వారానే తన పాలనకు ఆమోదముద్ర వేయించడం, పథకాలు అన్నీ సక్రమంగా అమలవుతున్నాయని చెప్పించడం ద్వారా ప్రజల నుంచి ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇప్పించినట్టు అవుతుంది. అందుకే, పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమానికి జగన్ సిద్ధమవుతున్నారు.
పల్లెల్లోకి ముఖ్యమంత్రి రావడం, అక్కడే నిద్రపోవడం ప్రజలకు ఆయనను మరింత దగ్గర చేయనుంది. నిజానికి ప్రజల్లో ఉండటమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బలం. అదే ఆయనను ముఖ్యమంత్రిని చేసింది. మాస్ లీడర్‌గా ప్రజల్లో నిలబెట్టింది. జగన్‌ను తమవాడని ప్రజలు ఓన్ చేసుకునేందుకు కూడా ఆయన ప్రజల్లో ఉంటడటమే కారణం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. ఓదార్పు యాత్ర, దీక్షలతో ప్రజలకు చేరువయ్యారు.
ముఖ్యమంత్రిగా బిజీగా ఉంటున్నందున ఆయనను ప్రజలతో దూరం చేసేందుకు టీడీపీ, యెల్లో మీడియా చాలా ప్రయత్నాలు చేశాయి. జగన్ వస్తున్నప్పుడు ప్రజలను బయటకు రానివ్వడం లేదని ప్రచారం చేశాయి. పల్లెనిద్ర ద్వారా ఇవన్నీ పటాపంచలు కానున్నాయి. ఇటీవలి కాలంలో ఏ నాయకుడూ పల్లెనిద్రకు సాహసించడం లేదు. 20 – 30 ఏళ్ల క్రితం ఈ కార్యక్రమాన్ని కొందరు నాయకులు చేపట్టేవారు. ముఖ్యమంత్రి స్థాయి నేత చేయడం మరింత అరుదు. ఇలాంటి కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టడం కచ్చితంగా ఆయనకు, వైసీపీకి ప్లస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. జగన్ బయటకు రావడం లేదు కాబట్టి ఇదే అదునుగా కార్యక్రమాలు ఫిక్స్ చేసుకున్న లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడు గట్టి షాక్ తగలబోతోంది.