ఆ ఎమ్మెల్యే తెలుగుదేశం నాయకత్వం పై తిరుగుబాటుకు సిద్ధపడుతున్నారా? తన చుట్టూ కుట్ర జరుగుతోందని భావిస్తున్నారా? తరచూ పార్టీ నాయకత్వం తనను వివరణ కోరడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. అమరావతి ఉద్యమ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఆ నేత. తెలుగుదేశం పార్టీకి మంచి మైలేజ్ ఇచ్చారు. పార్టీ గుర్తించి టికెట్ ఇచ్చేసరికి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అయినదానికి కాని దానికి తనను బాధ్యుడిని చేస్తూ పార్టీ నాయకత్వం తరచు అవమానాలకు గురిచేస్తోందని ఆయన ఆవేదనతో ఉన్నారు. అందుకే తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఇంతకీ ఎవరు ఆ నేత? ఏంటా కథ? అంటే ఈ స్టోరీ చూసేయాల్సిందే.
కూటమి ఈ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. పోటీ చేసిన అభ్యర్థులంతా గెలిచారు. గతంలో టిడిపి గెలవని రిజర్వుడు నియోజకవర్గాల్లో సైతం ఆ పార్టీ ఘన విజయం సాధించింది. ఇలా గెలుపొందిన నేతల్లో తిరువూరు నుంచి కొలికపూడి శ్రీనివాసరావు కూడా ఉన్నారు. ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్ నడుపుకునే శ్రీనివాసరావు అమరావతి ఉద్యమంలో చాలా యాక్టివ్ గా పని చేశారు. ముక్కు సూటిగా మాట్లాడతారని.. మంచి వ్యక్తిగా కూడా ఆయనకు పేరు ఉంది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో టీవి డిబేట్లో ఎక్కువగా పాల్గొనేవారు. ప్రధానంగా టీవీ5 తో పాటు ఆంధ్రజ్యోతిలో ఎక్కువగా కనిపించేవారు. దీంతో ఆయనపై తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. వైసిపి సర్కార్కు వ్యతిరేకంగా మాట్లాడడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు చాలా దగ్గరయ్యారు కోలికపూడి శ్రీనివాసరావు.
ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా తిరువూరు నియోజకవర్గ నుంచి సరైన అభ్యర్థి కోసం అన్వేషించారు చంద్రబాబు. సరిగ్గా అటువంటి సమయంలోనే కొ లికపూడి శ్రీనివాసరావు చంద్రబాబు మదిలో మేలిగారు . ఓ టీవీ ఛానల్ అధినేత సిఫారసుతో చంద్రబాబు మెత్తబడ్డారు. సరైన నేతగా గుర్తింపు ఉండడంతో కోలికపూడికి తిరువూరు అసెంబ్లీ స్థానంలో ఛాన్స్ ఇచ్చారు. విజయవాడ పార్లమెంట్ స్థానం పరిధిలో తిరువూరు ఉండడంతో.. టిడిపి అభ్యర్థిగా బరిలో దిగిన కేసినేని శివనాథ్ అలియాస్ చిన్ని సైతం కూలిక పూడి అభ్యర్థిత్వాన్ని సమర్థించారు. దీంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది. ఎన్నికల్లో అనూహ్య విజయం పొందారు.
అయితే అప్పటివరకు నిజాయితీపరుడుగా గుర్తింపు సాధించిన కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి టిడిపిలో హాట్ టాపిక్ అయింది. టిడిపి నేతలు వ్యతిరేకించే పరిస్థితికి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు చాలా రకాల పరిణామాలు జరిగాయి. వైసిపి హయాంలో ఇబ్బంది పెట్టిన ఓ నేతను తొలుత టార్గెట్ చేసుకున్నారు. నేరుగా యంత్రాలతో ఆ వైసీపీ నేత ఇంటి మీదకు వెళ్లి దండయాత్ర చేశారు. దీంతో ఎమ్మెల్యే కూలికపూడి వ్యవహార శైలి అప్పట్లో విమర్శలకు దారి తీసింది. అంతటితో ఆగకుండా సొంత పార్టీ నేతపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేకాట శిబిరం నడుపుతున్నారని చెప్పి ఓ టిడిపి నేతపై తీవ్ర స్థాయిలో తిట్ల దండకం అందుకున్నారు. దీంతో సదరు టిడిపి నేత తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అందుకు కోలికపూడి వ్యవహార శైలి కారణమన్న విమర్శలు రావడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు మహిళా ఉద్యోగుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు అన్న విమర్శ కూడా ఎమ్మెల్యే పై వచ్చింది. దీనిపై మహిళా ఉద్యోగులు బహిరంగ నిరసనకు దిగే పరిస్థితి దాపురించింది.
ఇటీవల ఓ ఎస్ టి దంపతులపై దాడికి దిగారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఓ గ్రామములో రహదారి నిర్మాణం విషయంలో ఒకే కుటుంబంలో తలెత్తిన వివాదం ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. దీంతో రంగ ప్రవేశం చేసిన కూలికపూడి.. అభివృద్ధి పనులకు అడ్డుకోవద్దని సంబంధిత వ్యక్తులకు సూచించారు. అయితే ఒకే కుటుంబంలో వచ్చిన వివాదంతో రెండు వర్గాలుగా విడిపోయారు. రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంటున్న వారు వైసీపీ నేతలుగా గుర్తించి తీవ్రస్థాయిలో హెచ్చరించారు కూలికపూడి. అయితే వారిపై దాడి చేశారని ఆరోపణలు రావడంతో పార్టీ హై కమాండ్ వివరణ కోరింది. అయితే పార్టీ కోసం.. గ్రామాభివృద్ధి కోసం తాను ఆ నిర్ణయం తీసుకుంటే తనపై విమర్శలు చేయడాన్ని కొలికపూడి తట్టుకోలేకపోతున్నారు. అయితే ఈ విషయంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుట వివరణ ఇచ్చారు కూడా.
అయితే ప్రభుత్వంతో పాటు పార్టీ నేతల తీరుపై తీవ్ర ఆవేదనతో ఉన్నారు కొలికపూడి శ్రీనివాసరావు. ఓ మహిళకు సంబంధించిన వివాదంలో తిరువూరు ఎస్సై పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నది ఆరోపణ. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుంటే తాను బుధవారం రంగంలోకి దిగుతానని కొలికపూడి హెచ్చరించారు. అంటే ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అవసరం అయితే తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యేగా మారేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. మున్ముందు కూలికపూడి శ్రీనివాసరావు ఎపిసోడ్ పెను ప్రకంపనలకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి