Monday, February 10, 2025

దావోస్ కు దూరంగా పవన్… తెర వెనుక ఏంటి కథ?

- Advertisement -

కూటమిలో జరుగుతున్న రాజకీయం జనసేన ను కలవరపెడుతోందా? వ్యూహాత్మకంగా ఆడుతున్న గేమ్ తో ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయా? లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్నది ఎవరు? ఆ ప్రయత్నం ఎవరు చేశారు? మళ్లీ ఇప్పుడు టిడిపి హై కమాండ్ ప్రకటన ఏంటి? ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడవద్దని చెప్పడానికి కారణాలేంటి? తెర వెనుక ఏం జరుగుతోంది? ఇప్పుడు ఇదే పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు బృందం దావోస్ పర్యటనలో ఉంది. మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ సైతం ఈ బృందంలో ఉన్నారు. అక్కడ ప్రవాస ఆంధ్రులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో భరత్ ఈ రాష్ట్రానికి సీఎంగా నారా లోకేష్ అర్హుడు అంటూ చెప్పుకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అది కూడా సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ వ్యాఖ్యానాలు చేయడంతో జనసేనలో కొత్త ఆందోళన ప్రారంభమైంది. పైగా అత్యున్నత స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారని.. రాష్ట్ర మంత్రివర్గంలో అంత విద్యాధికుడు లేడని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ ను దారుణంగా విమర్శించారు. అయితే దీనిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారని కూడా ప్రచారం నడుస్తోంది. అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు తెలియకుండా చిన్నపాటి పరిణామం జరగదు. అటువంటిది నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ శరవేగంగా విస్తరించింది. టిడిపి అనుకూల మీడియా సైతం దీనిని ప్రాజెక్ట్ చేసుకుంటూ వచ్చింది. అంటే పార్టీ నుంచి ఆదేశాలు రాకుండా ఇది జరిగే పని కాదు. పోనీ పవన్ కళ్యాణ్ తో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం ఏమైనా బయటకు వచ్చిందా? రాజకీయ వ్యూహంలో భాగంగా ఇలా ప్రకటన చేశారా? అన్నది కూడా ఒక రకమైన చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటివరకు డిప్యూటీ సీఎం వరకే లోకేష్ పేరు వినిపించింది. ఇప్పుడు ఏకంగా సీఎంగా కూడా లోకేష్ ను ప్రకటించాలన్న డిమాండ్ తెరపైకి రావడం మాత్రం ముమ్మాటికి రాజకీయ సంచలనంగా మారుతోంది.

ప్రపంచ పెట్టుబడుల సదస్సుగా దావోస్ ను పిలుస్తారు. ఈ రాష్ట్రానికి ఏకైక డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. కానీ ఆయనను తన వెంట తీసుకెళ్లకుండా.. లోకేష్ ను వెంటబెట్టుకుని చంద్రబాబు దావోస్ కు వెళ్లడం కొత్త చర్చకు దారితీస్తోంది. ఒక్క దావోస్ కే కాదు ప్రధాని మోదీ తో పాటు కేంద్ర పెద్దలను కలిసే సమయంలో కూడా తన వెంట పవన్ ను తీసుకెళ్లేందుకు చంద్రబాబు ఆసక్తి చూపడం లేదు. పొరుగున తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతి పర్యటనలో కనిపిస్తారు. కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా దావోస్ పర్యటనకు పవన్ కళ్యాణ్ ను పక్కన పెట్టడాన్ని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ గ్రాఫ్ తగ్గించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

డిప్యూటీ సీఎం గా లోకేష్ ఎంపిక చేయాలన్న ప్రకటనలు వద్దు అంటూ తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చేదాకా పరిస్థితి వచ్చిందంటే.. దీని వెనుక ఏ స్థాయిలో వ్యూహం ఉందో అర్థం అవుతోంది. అది కూడా టిడిపి అనుకూల మీడియా పతాక స్థాయిలో దీనిని ప్రచురించడం అనుమానాలకు తావిస్తోంది. పోనీ పార్టీ నుంచి ఏమైనా ప్రతిపాదన వెళ్లిందా? లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదన పార్టీ నుంచి రాలేదు కదా? మరి అటువంటిప్పుడు నేతల ప్రకటనలు వద్దు అని ప్రత్యేకంగా చెప్పడం దేనికి సంకేతం? ఇదంతా పవన్ కళ్యాణ్ గ్రాఫ్ తగ్గించేందుకేనని అనుమానాలు ఉన్నాయి. మొత్తానికి అయితే వరుసగా జరుగుతున్న పరిణామాలు జనసేనకు ఇబ్బందుల్లో నెడుతున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!