Monday, February 10, 2025

టిడిపి వర్సెస్ జనసేన..దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు పదవికి పోటా పోటీ!

- Advertisement -

దుర్గమ్మ కొండపై జనసేన దృష్టి పెట్టిందా? ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోస్ట్ ఆశిస్తోందా? అంటే అవుననే అంటున్నాయి పరిణామాలు. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని టిడిపి కైవసం చేసుకుంది. దీంతో టీటీడీ తరువాత అంత పెద్ద దేవస్థానంగా ఇంద్రకీలాద్రి ఉంది. అందుకే అక్కడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి తమకు ఇవ్వాలని జనసేన కోరుతోంది. ఇప్పటికే కర్చీఫ్ వేసినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే విజయవాడ నడిబొడ్డున ఉన్న ఈ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ టిడిపి వదులుకుంటుందా? అన్నది ఇప్పుడు అనుమానం. ఎందుకంటే బెజవాడ రాజకీయాల్లో ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డు ప్రధాన భూమిక వహిస్తుంది. పైగా ఇక్కడ కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ. అందుకే ఎట్టి పరిస్థితుల్లో టిడిపి ఆ పదవిని వదులుకోదని టాక్ నడుస్తోంది.

కృష్ణాజిల్లాలో జనసేనకు కనీస ప్రాతినిధ్యం లేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటును జనసేనకు కేటాయిస్తారని ఎన్నికలకు ముందు ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో బిజెపి ఆస్థానాన్ని తన్నుకు పోయింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత సుజనా చౌదరి అక్కడ పోటీ చేయడంతో.. అప్పటివరకు జనసేనకు సేవలందించిన పోతిన మహేష్ గుడ్ బై చెప్పారు. వైసీపీలో చేరిపోయారు. పోతిన మహేష్ పార్టీ నుంచి వెళ్లిపోయాక జనసేన వాయిస్ తగ్గింది. పైగా జిల్లాలో ఎక్కడ జనసేనకు ఒక ఎంపీ గాని, ఒక ఎమ్మెల్యే కానీ లేరు. దీంతో జనసేన కార్యకర్తలు ఏ చిన్న పని కావాలన్నా ఇతర పార్టీ ఎమ్మెల్యేల పై ఆధార పడాల్సి వస్తోంది. అక్కడ పెద్ద దిక్కు అంటూ ఎవరూ లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.

కనీసం ప్రోటోకాల్ గౌరవం దక్కాలంటే.. ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోస్ట్ కావాలని జనసేన పట్టుబడుతోంది. కానీ అది అంత ఈజీ కాదు. తెలుగుదేశం పార్టీ నేతలు సైతం ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోస్ట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ నగరంపై పట్టు కోల్పోవడానికి తెలుగుదేశం నేతలు ఇష్టపడడం లేదు. అవసరమైతే చిన్న చిన్న ఆలయాల పోస్టులు తీసుకోండి కానీ.. దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు పదవిని వదులుకునే ఛాన్స్ లేదని టిడిపి వర్గాలు తేల్చి చెబుతున్నాయి. అదే సమయంలో జనసేన సైతం వెనక్కి తగ్గడం లేదు. దీంతో రెండు పార్టీల మధ్య కొత్త ఆధిపత్యం ప్రారంభమైంది. అయితే ఈ విషయంలో జనసైనికులు పార్టీ అధినేత పవన్ పై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. ఇంకోవైపు సీఎం చంద్రబాబుపై స్థానిక టిడిపి నేతలు కూడా ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. దీంతో దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు ఎంపిక ప్రభుత్వానికి కత్తి మీద సాముల మారనుంది. ఎట్టి పరిస్థితుల్లో పదవిని వదులుకోలేమని ఇరు పార్టీల నేతలు తేల్చి చెబుతుండడంతో ఒక రకమైన విభేదాలపర్వం ప్రారంభమైనట్టు కనిపిస్తోంది. ఇది మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి టిడిపి దక్కించుకుంది. టీవీ5 అధినేత బిఆర్ నాయుడు చైర్మన్గా నియమితులయ్యారు. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అందుకే దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు పదవి కాపులకు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అయితే ఇందుకు జనసేన అంగీకరించే పరిస్థితి లేదు. సామాజిక సమీకరణల దృష్ట్యా కాపులకు అవకాశం ఇవ్వాల్సిందేనని జనసేన డిమాండ్ చేస్తోంది. అయితే కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న విజయవాడలో.. ఇతరులకు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వడం కుదరదని టిడిపి నుంచి వినిపిస్తున్న మాట. దీంతో ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎంపిక అనేది సామాజిక వర్గాల మధ్య విభేదాలకు కారణమయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ విషయంలో ప్రభుత్వం ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిణామాల నడుమ ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రకటన ఆలస్యమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!