ఉత్తరాంధ్ర పై జగన్ ఫోకస్ పెట్టారా? ఉమ్మడి మూడు జిల్లాలను సెట్ చేయనున్నారా? అందులో భాగంగానే ఈ భారీ ప్రక్షాళన? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం జగన్ విదేశాల్లో ఉన్నారు. వచ్చిన వెంటనే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఈ టూర్లు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అంతకంటే ముందే నియోజకవర్గ ఇన్చార్జిల నియామకాలు పూర్తి చేయనున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఆముదాలవలసకు చింతాడ రవికుమార్, భీమిలికి మజ్జి శ్రీనివాసరావు, చోడవరానికి గుడివాడ అమర్నాథ్, మాడుగులకు బూడి ముత్యాల నాయుడు లను నియోజకవర్గ ఇన్చార్జిలుగా నియమించారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానం సమన్వయకర్తగా కరణం ధర్మశ్రీ కి బాధ్యతలు అప్పగించారు. ఇంకా మరికొన్ని నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలు రానున్నట్లు సమాచారం.
ఉత్తరాంధ్రలో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014లో తొలి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో తొమ్మిది అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది వైయస్సార్ కాంగ్రెస్. కానీ 2019 ఎన్నికలు వచ్చేసరికి సీన్ మారింది. దాదాపు స్వీప్ చేసినంత పని చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఏకంగా 28 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ కేవలం ఆరు సీట్లకే పరిమితం అయింది. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి తలకిందులైంది. తెలుగుదేశం కూటమి ఏకపక్షంగా ఉత్తరాంధ్రను కైవసం చేసుకుంది. శ్రీకాకుళం తో పాటు విజయనగరం జిల్లాలో వైట్ వాష్ చేసింది. విశాఖ జిల్లాలో మాత్రం రెండు స్థానాలతో వైసిపి బతికిపోయింది.
టిడిపి కూటమి ప్రభంజనంలో ఉత్తరాంధ్రలోని హేమా హేమీ నాయకులు ఓడిపోయారు. దీంతో పార్టీలో ఒక రకమైన నైరష్యం నెలకొంది. దాని నుంచి బయటపడేందుకు గాను జగన్ నేరుగా రంగంలోకి దిగారు. పార్టీలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చేందుకు నిర్ణయించారు. అందుకు ముహూర్తం సైతం ఫిక్స్ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే జగన్ పర్యటన ప్రారంభం కానుంది. అయితే దీని వెనుక భారీ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అదే సమయంలో సీనియర్ల స్థానంలో జూనియర్లకు అవకాశం ఇస్తున్నారు. పార్టీకి భవిష్యత్తు ఉందని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 2029 నాటికి వైసిపి బలమైన శక్తిగా ఎదుగుతుందని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
జగన్ విదేశాల నుంచి వచ్చిన వెంటనే జిల్లాల పర్యటన మొదలుకానుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుంచి తన జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ నియోజకవర్గంలో వారంలో రెండు రోజులపాటు జగన్ ఉండనున్నారు. ప్రతి నియోజకవర్గంలో కిందిస్థాయి నేతతో సైతం మాట్లాడనున్నారు. నియోజకవర్గంలో లోటుపాట్లను తెలుసుకొనున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్న అధిగమించే ప్రయత్నం చేయనున్నారు. 34 అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మొత్తానికి అయితే ఉత్తరాంధ్ర పై జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.