Monday, February 10, 2025

పార్టీ లైన్ దాటుతున్న కొలికపూడి

- Advertisement -

ఆ ఎమ్మెల్యే పార్టీ లైన్ దాటుతున్నారు. వరుస పెట్టి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు. పార్టీకి తలవొంపులు తెస్తూనే ఉన్నారు. అయినా సరే ఆయనపై చర్యలకు భయపడుతోంది తెలుగుదేశం. క్రమశిక్షణ కమిటీ అంటూ కాలయాపన చేస్తోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏంటా కథ? తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ.. అమరావతి ఉద్యమ నేపథ్యం ఉండడంతో కలిసి వచ్చింది. ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. కూటమి వేవ్ లో ఎమ్మెల్యే అయ్యారు కొలికపూడి శ్రీనివాసరావు. కానీ ఏడు నెలల్లోనే అత్యంత వివాదాస్పదుడిగా మారారు. రెండుసార్లు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. వివరణ ఇచ్చారు. పార్టీ లైన్లోనే ఉన్నానని.. తాను గాడి తప్ప లేదని తేల్చి చెప్పారు. దీంతో తెలుగుదేశంలో కొలిక పూడి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయన పార్టీపై తిరుగుబాటు చేసిన ఆశ్చర్య పడాల్సిన పనిలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గత ఐదేళ్ల వైసిపి పాలనలో అమరావతి రాజధాని నిర్మాణం కోసం చాలామంది రోడ్డు ఎక్కారు. ఆందోళన బాట పట్టారు. అందులో కొలికపూడి శ్రీనివాసరావు ఒకరు. నిత్యం టీవీ డిబేట్లో కనిపించేవారు. తన వాయిస్ను బలంగా వినిపించేవారు. ఈ క్రమంలో ఓ టీవీ ఛానల్ డిబేట్లో అమరావతి రాజధాని నిర్మాణానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించారని ఓ బిజెపి నేత చెంప పగలు కొట్టారు. అప్పట్లో కొలికపూడి పేరు మార్మోగిపోయింది. సరిగ్గా ఎన్నికల ముంగిట చంద్రబాబు పిలిచి మరి తిరువూరు టికెట్ ఇచ్చారు. రిజర్వుడు నియోజకవర్గం కావడంతో ఓ టీవీ ఛానల్ అధినేత సిఫారసుతో చంద్రబాబు టికెట్ ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది. కూటమి వేవ్ తో గెలిచేసరికి కొలికపూడి ఓ స్థాయిలో రెచ్చిపోయారు. వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతున్నారు. పార్టీకి చిక్కులు తెచ్చి పెడుతున్నారు.

ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే వైసీపీ నేత ఇంటిపై దండయాత్ర చేశారు. ఆక్రమణల పేరిట యంత్రాలతో అక్కడకు చేరుకొని తొలగించే ప్రయత్నం చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. దుందుడుకు చర్యలు వద్దని పార్టీ హై కమాండ్ ఆదేశించింది. అక్కడ కొద్ది రోజులకే ఎమ్మెల్యే వ్యవహార శైలితో సొంత పార్టీ నేత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. పార్టీ హై కమాండ్ కు బాధితుడు భార్య నేరుగా ఫిర్యాదు చేసింది. అది మరువకముందే కొంతమంది టిడిపి నేతలు కొలికపూడి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు ఫిర్యాదు చేశారు. మరికొందరు మహిళ అధికారులు, ఉద్యోగులు తమ విషయంలో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారు అంటూ కొలికపూడిపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయనపై వరుస ఫిర్యాదుల నేపథ్యంలో హైకమాండ్ స్పందించింది. క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అప్పట్లో పార్టీ పెద్దలకు అందరూ రంగంలోకి దిగి కొలికపూడికి కీలక సూచనలు చేశారు. మరోసారి ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానని ఆయనతో చెప్పించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

తాజాగా ఓ గ్రామంలో రహదారి ఏర్పాటు విషయంలో ఒకే కుటుంబంలో చెలరేగిన వివాదంలో ఎంటర్ అయ్యారు కొలికపూడి. ఏకంగా ఓ దంపతులపై చేయి చేసుకున్నారు. ఇది పెను దుమారానికి దారితీసింది. వాస్తవానికి రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకొని.. ప్రభుత్వ భూమిని ఆక్రమించింది వారే. పైగా వైసిపి సానుభూతిపరులు. దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు కొలికపూడి. అయితే దీనిపై విమర్శలు రావడంతో క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని పార్టీ సూచించింది. అయితే ఈ క్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి భిన్నంగా స్పందించినట్లు సమాచారం. మున్ముందు ఆయనతో తెలుగుదేశం పార్టీకి చికాకు తప్పేలా లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే రెండుసార్లు సీఎం చంద్రబాబు పిలిచి మరి మందలించినట్లు తెలుస్తోంది. కానీ పార్టీ కోసమే తాను పనిచేస్తున్నానని.. పార్టీ లైన్ దాటడం లేదని కొలికపూడి చెబుతున్నారు. మరి మున్ముందు ఆయన ఎలా ప్రవర్తిస్తారో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!