ఏడాదిలోపే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక రంగంలోకి దిగారు. దాదాపు ఎనిమిది నెలల క్రితం ప్రకటించిన వారాహి యాత్రను ఇప్పుడు ప్రారంభించారు. ఈ యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ యాదృశ్ఛికంగానో, పొరపాటుగానో రెండు విషయాలను స్పష్టంగా బయటపెట్టుకున్నారు. ఈ రెండు విషయాలు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కే వ్యతిరేకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
యాత్ర మొదటి రోజు జరిగిన మొదటి సభలో పవన్ కళ్యాణ్ పొరపాటును చేసిన వ్యాఖ్యలు జనసైనికులను కూడా షాక్‌కు గురి చేశాయి. జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్‌ను విపరీతంగా అభిమానిస్తారు. తమ కుటుంబం కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ అని భావిస్తారు. తమ చదువు, వృత్తి కంటే కూడా జనసేననే ఎక్కువ అనుకుంటారు. ఈసారి ఎలాగైనా పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని జనసైనికులు పట్టుదలగా ఉన్నారు. అందుకే, ప్రతి చోటా సీఎం, సీఎం అని అరుస్తుంటారు. పవన్ కళ్యాణ్ కచ్చితంగా 2024లో సీఎం అవుతారని భావిస్తున్నారు.
వీరికి షాకిచ్చేలా పవన్ కామెంట్స్ చేశారు. ఈసారి తనను అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా ఎవరు అడ్డుకుంటారో చూస్తానని పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. అంటే, తన టార్గెట్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడం మాత్రమేనని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పినట్లయ్యింది. ఒకవైపు జనసైనికులు పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటుంటే పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నట్టు కనిపిస్తోంది. తాను ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడితే చాలన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్లు అవుతున్నా పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఎమ్మెల్యే కాలేకపోయారు. 2009 ఎన్నికల్లో యువరాజ్యం అధ్యక్షుడిగా రాష్ట్రమంతా ప్రజారాజ్యం కోసం ప్రచారం చేయాల్సి ఉన్నందున ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. ఇక, 2014లో జనసేన పార్టీని స్థాపించినా కూడా టీడీపీని గెలిపించడానికి తాను ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ప్రచారం చేసి త్యాగం చేశారు. ఇక, 2019 ఎన్నికల్లో కచ్చితంగా ఏదో ఒక స్థానం నుంచి అయినా గెలవాలనుకొని రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఈసారి కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిస్తే చాలనే భావనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు ఆయన వ్యాఖ్యలు చెప్పకనే చెప్తున్నాయి.
అసెంబ్లీలో కూర్చోవాలని, అధ్యక్షా అనాలని ఆయన ఆశపడుతున్నట్టు కనిపిస్తోంది. ఇక, వారాహి యాత్ర రూట్‌మ్యాప్ ద్వారా కూడా పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన సంకేతాలు జనసైనికులు, ప్రజలకు పంపించారు. అన్నవరం నుంచి మొదలైన ఈ యాత్ర కేవలం తనకు పట్టున్న, తన సామాజకవర్గం ప్రజలు ఎక్కువగా ఉన్న గోదావరి జిల్లాల్లోనే సాగనుంది. ఇలానే రూట్‌మ్యాప్ తయారుచేశారు. ఈ రూట్‌మ్యాప్ ద్వారా తాను గోదావరి జిల్లాలకే పరిమితమవుతానని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు. పైగా తన సామాజకవర్గం ఓట్లపైన తాను ఆశలు పెట్టుకున్నట్టు కూడా ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు అయ్యింది. ఇలా రెండు జిల్లాలకు పరిమితమైన నాయకుడు ముఖ్యమంత్రి ఎలా కాలగలరనే అనుమానం సహజంగానే ప్రజల్లో వ్యక్తమవుతోంది.