ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన నాటి నుంచి ఆయన వెన్నంటే నడుస్తున్నారు. నిజానికి, రాజకీయ అనుభవం లేకపోయినా, రాజకీయాలతో సంబంధం లేకపోయినా ఈ రంగంలో విజయసాయిరెడ్డి అడుగుపెట్టి తక్కువకాలంలోనే తలపండిపోయారు. గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో ఆయనది కీలక పాత్ర. ప్రత్యర్థులపై దూకుడుగా విమర్శలు చేయడం, పార్టీలో అప్పగించిన పనులను సమర్థంగా నిర్వహించడం విజయసాయిరెడ్డి నైజం. అందుకే, జగన్ ఆయనకు కీలకమైన పార్టీ పార్లమెంటరీ నేతగా అవకాశం ఇచ్చారు. 31 మంది ఎంపీలకు నాయకుడిని చేశారు.
అయితే, ఇటీవలి కాలంలో విజయసాయిరెడ్డి కొన్ని కుటుంబపరమైన కారణాల వల్ల రాజకీయంగా యాక్టీవ్‌గా ఉండటం లేదు. ఆయన కొంతకాలం రెస్ట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. దీంతో అప్పటివరకు విజయసాయిరెడ్డి నిర్వర్తించిన బాధ్యతలను జగన్ వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి ఇతర ముఖ్య నేతలపై పెట్టారు. దీంతో ఇక విజయసాయిరెడ్డికి, జగన్‌కు దూరం పెరిగిందనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. తెలుగుదేశం పార్టీ, యెల్లో మీడియా అయితే సంతోషంలో మునిగిపోయింది. టీడీపీపై విమర్శలను కూడా ఆయన తగ్గించడంతో ఏం జరుగుతుందో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అయితే, ఈ అనుమానాలను, ప్రచారాలను పటాపంచలు చేస్తూ మళ్లీ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు విజయసాయిరెడ్డి ఇది వరకటి లానే యాక్టీవ్‌గా మారిపోయారు. తర్వాత తెలుగుదేశం పార్టీపై విమర్శల దాడి స్టార్ట్ చేశారు. విజయసాయిరెడ్డి యాక్టీవ్ కావడంతో పార్టీ ఆయనకు కీలకమైన అనుబంధ విభాగాల ఇంఛార్జ్ బాధ్యతలను అప్పగించింది. ఎన్నికల వేళ ఇది కీలకకమైన బాధ్యత. దీని నిర్వహణలో విజయసాయిరెడ్డికి మంచి అనుభవం కూడా ఉంది.
అందుకే, వస్తూ వస్తూనే విజయసాయిరెడ్డి దూకుడు పెంచేశారు. తాజాగా పార్టీ అనుబంధ విభాగాల ముఖ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించినందున ఎలా వ్యవహరించాలో దిశా నిర్దేశం చేశారు. ఏ సమస్యలు ఉన్నా తనకు చెప్పాలని వారిలో భరోసా నింపారు. 2024లో విజయం కోసం అనుబంధ విభాగాలు చేపట్టాల్సిన యాక్షన్ ప్లాన్‌ను వారికి వివరించారు. ఇంతకుముందు బీసీ మహాసభ నిర్వహించినట్టే త్వరలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సభలు నిర్వహించాలని నిర్ణయించారు.
విజయసాయిరెడ్డి మళ్లీ యాక్టీవ్ కావడం వైసీపీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల వేళ ఆయన కచ్చితంగా పార్టీకి బలమవుతారు. ముఖ్యంగా అనుబంధ విభాగాలను ముందుండి నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించగలరు. ఇక, జగన్‌కు విజయసాయిరెడ్డి దూరమైతే పండుగ చేసుకుందామనుకున్న తెలుగుదేశం పార్టీ, యెల్లో మీడియా ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. విజయసాయిరెడ్డి ఇక తమ పార్టీపై ఘాటు విమర్శలు చేయరనుకున్న టీడీపీ అంచనాలు తప్పాయి. విజయసాయిరెడ్డి మళ్లీ తన విమర్శలకు పదును పెట్టి టీడీపీని ఇరుకున పెడుతున్నారు.