ఆంధ్రప్రదేశ్‌లో ఏడాది ముందే ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఒకవైపు యువగళం యాత్ర అంటూ నారా లోకేశ్, మరోవైపు వారాహి యాత్ర అంటూ పవన్ కళ్యాణ్ రోడ్లెక్కారు. వీరిద్దరిదీ ఒకే లక్ష్యం. అదే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం. ఇక, చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజల్లో ఉండటం కంటే ఎక్కువగా ఎన్నికల వ్యూహాలపైనే సమయం కేటాయిస్తున్నారు. ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు ఖరారు చేసుకున్న బాబు ఇక భారతీయ జనతా పార్టీపైన దృష్టి పెట్టారు. ఎలాగైనా బీజేపీని కలుపుకొని ఎన్నికలకు వెళ్లాలని బాబు స్కెచ్‌లు వేస్తున్నారు.
ఇటీవలి పరిణామాలు చూస్తుంటే ఈ విషయంలో బాబు సక్సెస్ అవుతున్నట్టే కనిపిస్తోంది. బీజేపీని జగన్‌కు వ్యతిరేకంగా మార్చడంలో బీజేపీలో ఉన్న చంద్రబాబు మనుషులు పావులు కదుపుతున్నారు. గత నాలుగేళ్లుగా ఎన్నిసార్లు అడిగినా దక్కని అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇప్పుడు చంద్రబాబుకు దక్కింది. ఇంతకాలం ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు ఉండదని గట్టిగా చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు మౌనం వహిస్తున్నారు. ఇటీవల ఏపీ పర్యటనకు వచ్చిన అమిత్ షా, జేపీ నడ్డా కూడా జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. మరోవైపు చంద్రబాబు మనిషిగా ముద్రపడిన ఏబీఎన్ రాధాకృష్ణను కలవడానికి ఏకంగా ఆయన ఇంటికే వెళ్లాలని అమిత్ షా నిర్ణయించుకున్నారు. మరోవైపు తనకు బీజేపీ అండగా ఉండకపోవచ్చు అని ముఖ్యమంత్రి జగన్ ఇటీవల స్వయంగా కామెంట్ చేశారు.
ఈ అన్ని పరిణామాలను గమనిస్తే టీడీపీ – జనసేన కూటమిలోకి బీజేపీ కూడా చేరే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇది పెద్ద ఆశ్చర్యం కూడా కాదు. చంద్రబాబు నాయుడు ఎవరితోనైనా పొత్తు పెట్టుకోగల సమర్థుడు. అయితే, బీజేపీతో పొత్తు వల్ల ఎన్నికల్లో కలిసి వస్తుందని అనుకుంటున్న చంద్రబాబు లెక్కలు పూర్తిగా రివర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ, చంద్రబాబు కలుస్తున్నారనే వాతావరణం రాష్ట్రంలో నెలకొంది. ప్రజలకు కూడా ఈ విషయంపై స్పష్టత వస్తోంది.
ఇది తెలుగుదేశం పార్టీకి భారీ డ్యామేజ్ చేయబోతోంది. ముఖ్యంగా రాయలసీమలో ఈసారి జగన్ హవాకు బ్రేకులు వేయాలని టీడీపీ భావిస్తోంది. ఇందుకు గానూ ముస్లింలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. సీమ జిల్లాల్లో దాదాపు 25 నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు చాలా కీలకం. ఇప్పుడు బీజేపీతో పొత్తు కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుకు ఓటు వేసేందుకు ముస్లింలు ఇష్టపడే అవకాశం ఉండదు. ఇది రాయలసీమ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇక, గోదావరి జిల్లాలపై కూడా చంద్రబాబు ఈసారి చాలా ఆశలు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్‌తో పొత్తు కారణంగా కాపులు ఈసారి టీడీపీకే ఓటేస్తారని, మరోవైపు దళితులను కూడా ఆకర్షించడం ద్వారా ఈ జిల్లాల్లోని 34 స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని చంద్రబాబు వ్యూహం పన్నారు. ఇటీవల వైసీపీకి గోదావరి జిల్లాల్లోని దళితులను దూరం చేసేందుకు భారీగా కుట్రలు జరుగుతున్నాయి. అయితే, బీజేపీ, జనసేనతో చంద్రబాబు పొత్తు వల్ల ఇప్పటివరకు టీడీపీకి ఓటేయాలనుకున్న దళిత సోదరులు కూడా ఇప్పుడు మనస్సు మార్చుకుంటున్నారు. వీరంతా పూర్తిస్థాయిలో వైసీపీకి మద్దతుగా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే గోదావరి జిల్లాల్లో వైసీపీ మెజారిటీ స్థానాలు దక్కించుకోవడం ఖాయం.