Monday, February 10, 2025

కూటమిలో ఏబీఎన్ రాధాకృష్ణ ఆరని చిచ్చు

- Advertisement -

తెలుగుదేశం పార్టీకి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాభమా? నష్టమా? టిడిపి గెలుపొందిన ప్రతిసారి అందులో తన భాగం ఉందన్నట్టు ఆయన వ్యవహరిస్తుంటారు. ఓడిపోతే మాత్రం నా మాట చంద్రబాబు వినలేదని సుత్తి సుత్తిగా చెబుతుంటారు. ఇప్పుడు ఏకంగా కూటమిలో నిప్పులు పోశారు. తెలుగుదేశంతో పాటు జనసేనలో ఒక రకమైన అపోహకు కారణమయ్యారు. కూటమిలో విభేదాలు ప్రారంభానికి ఆయన దోహదపడ్డారు. తన అభిప్రాయమే టిడిపి అభిప్రాయం అన్నట్టు వ్యవహరిస్తూ వచ్చారు రాధాకృష్ణ. గత రెండు వారాలుగా వారాంతపు కామెంట్స్ లో పవన్ కళ్యాణ్ డి గ్రేడ్ చేయాలని భావించారు. లోకేష్ ను అప్ గ్రేడ్ చేయాలని చూశారు. కానీ అంతకుమించి డామేజ్ చేసేసారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై జనసైనికులు అపనమ్మకం కలిగేలా వ్యవహరించారు. అదే సమయంలో లోకేష్ భవిష్యత్తుపై తెలుగుదేశంలో నీలి నీడలు కమ్మేలా చేయడానికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాతలే కారణమయ్యాయి.

వేమూరి రాధాకృష్ణకు కుల జాడ్యం అధికం. అనేక సందర్భాల్లో అది బయటపడింది. గతంలో ప్రజారాజ్యం పార్టీ సమయంలో చిరంజీవి పై అదే పనిగా నెగిటివ్ ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమని భావించి మరో ప్రాంతీయ పార్టీగా అవతరించిన ప్రజారాజ్యంపై కుట్రపూరిత కథనాలు ప్రచురించేవారు. చివరకు ప్రజారాజ్యం పార్టీ ఓటమి చవిచూసిన వదల్లేదు. ప్రజారాజ్యం పార్టీ ఉంటే తెలుగుదేశం ఉనికికే ప్రమాదం అని భావించారు ఆర్కే. అందుకే జెండా పీకేద్దాం అంటూ ముందుగానే కథనం రాశారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనానికి కుట్రపన్నారు. ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవిని వెంటాడి వేటాడారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఒకానొక దశలో మెగా కుటుంబం ఆంధ్రజ్యోతి రాతలతో చాలా ఇబ్బంది పడింది. చివరికి కుటుంబాలపై కూడా కథనాలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

వాస్తవానికి గత ఐదేళ్ల వైసిపి పాలనలో ప్రభుత్వ వ్యతిరేకత పెంచడానికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కారణం కావచ్చు. జగన్ సర్కార్ పై విషం చిమ్మి టిడిపికి లాభం చేకూర్చవచ్చు. కానీ రాధాకృష్ణ ఒక్కరే టిడిపి కూటమి గెలుపునకు కారణం అనుకుంటే అది పొరపాటే. ఆంధ్రజ్యోతి టిడిపి కరపత్రిక. నికార్సైన జర్నలిజం కనిపించదు కూడా. అయితే ఆంధ్రజ్యోతి చదివి, ఏబీఎన్ చూసి టిడిపి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారని రాధాకృష్ణ భ్రమిస్తున్నారు. ఇంతటి విజయానికి తాను ఒక కారణమని భావిస్తున్నారు. అయితే ఈసారి టిడిపి కూటమి గెలుపునకు ముమ్మాటికి కారణం పవన్ కళ్యాణ్. దానిని ఒక సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోతోంది. అందులో భాగంగానే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాతలు. ఆంధ్రజ్యోతి టిడిపి కరపత్రిక కావచ్చు కానీ.. టిడిపి శ్రేణుల అభిప్రాయం చెబుతుంది అనడం చాలా తప్పు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను వ్యతిరేకించిన టిడిపి సీనియర్లు కూడా ఉన్నారు. కానీ సామాజిక వర్గం, ఆపై బలమైన మీడియా అని చెప్పుకోవడంతో ఏం చేయలేని నిస్సహాయతలో ఉన్నారు.

నిజం చెప్పులేసుకుని బయలుదేరే ముందే.. అబద్ధం ఊరంతా ప్రచారం చేసి వస్తుందంటారు. ఆ మాదిరిగా ఉంటుంది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వ్యవహార శైలి. తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబు విషయంలో ఒక రకమైన ప్రచారాన్ని ప్రజల్లో వదులుతారు. దానికి అనుకూలమైన అంశాలు తోడైతే వెంటనే రంగంలోకి దిగుతారు. లేకుంటే సైలెంట్ అవుతారు. ఇప్పుడు లోకేష్ విషయంలో జరిగింది అదే. వాస్తవానికి లోకేష్ డిప్యూటీ సీఎం తో పాటు ముఖ్యమంత్రి పదవికి కూడా అర్హుడే. తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. 2014 నుంచి 2019 మధ్య మంత్రిగా వ్యవహరించాడు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. కానీ తనకు తాను పరిణితి సాధించుతూ ముందుకు సాగాడు. అదే మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. మంత్రిగా ఎంపికయ్యాడు. గత ఏడు నెలలుగా మంచి మార్కు చూపిస్తూ వచ్చాడు. అయితే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని రాధాకృష్ణ లాంటి వారు సలహా ఇవ్వడం మాత్రం మంచిది కాదు. అక్కడ ఉన్నది కూటమి. కూటమి పెద్దలు కలిసి నిర్ణయం తీసుకుంటే సరిపోయేది. కానీ పవన్ కళ్యాణ్ తక్కువ చేసి.. లోకేష్ ను ఎక్కువ చేసే ప్రయత్నం రాధాకృష్ణ లాంటి వ్యక్తులు చేయడం నిజంగా.. లోకేష్ కు ఇబ్బందికరమే.

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కథనాలు నష్టం చేయడంతో ఇప్పుడు అవి నిలిచిపోయాయి. అంత గుప్ చప్ అంటూ అంతా సైలెంట్ అయ్యారు కానీ.. కూటమి మధ్య ఒక మంచి వాతావరణాన్ని చెడగొట్టారు ఏబీఎన్ రాధాకృష్ణ. భవిష్యత్తులో ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాలేడన్న అనుమానం జనసైనికుల్లో వచ్చింది. లోకేష్ భవిష్యత్తుకు అనేక రకాల అడ్డంకులు ఉన్నాయని టిడిపి శ్రేణులు అనుమానిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కూటమిలో విభేదాల పర్వం ప్రారంభం కావడానికి ముమ్మాటికి రాధాకృష్ణ వైఖరి కారణం. చంద్రబాబు రాధాకృష్ణను కట్టడి చేయకపోతే మాత్రం మున్ముందు కూటమితో పాటు లోకేష్ భవిష్యత్తును కూడా పాడు చేస్తారని టిడిపి సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!