ఏపీలో బిజెపి పరిస్థితి ఏంటి? ఆ పార్టీ ఎదుగుతుందా? లేకుంటే ఒదుగుతూ కొనసాగుతుందా? తోక పార్టీగా మిగిలిపోతోందా? నిజమైన బిజెపి వాది బాధ అదేనా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదో ఆసక్తికర చర్చ నడుస్తోంది. పేరుకే బిజెపి కూటమిలో పార్టీ కానీ.. ఆ పార్టీ కంటూ ఏపీలో ఇండివిడ్యువాలిటీ లేదు. ఎంతోమంది బిజెపి కార్యకర్తల కృషి ఫలితంగా.. ఇప్పటి నేతలు పదవులు అనుభవిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు గెలిచారు. అందులో ఒకరు రాష్ట్ర మంత్రి అయ్యారు. ఇంకొకరు కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారు. అయితే వారు కూటమి పార్టీల ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారే కానీ.. బిజెపి నుంచి ఎన్నికయ్యామని కనీసం ఆలోచన చేయలేకపోతున్నారు.
ఏపీలో బీజేపీకి ఆప్షన్ అంటూ లేదు. వెళ్తే టిడిపి కూటమితోనే వెళ్లాలి. లేకుంటే పవన్ కళ్యాణ్ ముందు పెట్టి వెళ్లాలి. మరి కాకుంటే పవన్తో జత కట్టాలి. అంతేతప్ప తాము సొంతంగా ముందుకెళ్లి ఆలోచన చేయడం లేదు భారతీయ జనతా పార్టీ. పొరుగున తెలంగాణలో బిజెపి 50 అడుగులు ముందుకేసింది. అదే ఏపీ విషయానికి వచ్చేసరికి 50 అడుగులు వెనక్కి పడ్డాయి. అక్కడ బిజెపి ఒంటరి పోరు చేసి తాడోపేడో అన్నట్టు ఉంది. మరి ఏపీలో మాత్రం మరో పార్టీతో కలిస్తే కానీ ఓట్లు, సీట్లు రాని పరిస్థితి ఉంది.
1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఆ సమయానికి భారతీయ జనతా పార్టీ ఏపీలో ఎంట్రీ ఇచ్చింది. విశాఖ కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించింది. మేయర్ స్థానానికి జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి డివి సుబ్బారావు విజయం సాధించారు. ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కంటే బిజెపి పరిణితి కనబరచాలి. కానీ పరిస్థితి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. పక్కనే ఉన్న ఒడిస్సాలో అధికారంలోకి రాగలిగింది బిజెపి. దశాబ్దాలుగా బిజూ జనతాదళ్ బిజెడితో దోస్తీ కట్టిన బిజెపి.. ఈ ఎన్నికల్లో మాత్రం విడిపోయింది. స్వతంత్రంగా పోటీ చేసింది. మ్యాజిక్ మార్కుతో అధికారంలోకి రాగలిగింది.
ఏపీలో బిజెపికి సరైన నాయకత్వం లభించడం లేదు. అది జగమెరిగిన సత్యం. బిజెపి నాయకత్వం అంటే తమ ఇండివిడ్యువాలిటీ కోసం పాపులాడుతున్నారే తప్ప.. పార్టీ కోసం పనిచేయడం లేదన్న అభిప్రాయం బిజెపి వర్గాల్లో ఉంది. ప్రధానంగా తోకనాయకత్వాలు అధికమయ్యాయి అన్న కామెంట్స్ బిజెపి నుంచి వినిపిస్తున్నాయి. అయితే బిజెపికి ఉన్న ఏకైక మార్గం మాత్రం పవన్ కళ్యాణ్ అన్నట్టు ఉంది. ఇప్పటికే టిడిపి తో లాంగ్ ట్రావెల్ జరిగింది. ఇప్పుడు మాత్రం పవన్ లేనిదే తాము లేదన్నట్టు బిజెపి వ్యవహరిస్తోంది. ఇది సగటు బిజెపి కార్యకర్తకు నచ్చడం లేదు. అయితే ప్రస్తుతానికైతే బిజెపికి ఆప్షన్ లేనట్టే.https://youtu.be/7vwl5J1IO04?si=OffF1Vlt20uD5cwG