టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీస్ రేసు మ్యాచ్ మ్యాచ్ కూ రసవత్తరంగా మారుతోంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ న్యూజిలాండ్ పై విజయం సాధించింది. తద్వారా సెమీఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఇంగ్లాండ్ 20 రన్స్ తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 179 పరుగుల స్కోరు సాధించింది.
ఓపెనర్లు బట్లర్, హేల్స్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో న్యూజిలాండ్ ముందు మంచి టార్గెట్ ఉంచింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన బట్లర్ 47 బంతుల్లో 73 రన్స్ చేయగా… అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. అటు అలెక్స్ హేల్స్ 40 బాల్స్‌లో 52 రన్స్ చేశాడు.
ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 10.2 ఓవర్లలోనే 81 పరుగుల పార్టనర్ షిప్ అందించారు. వీరిద్దరూ తప్ప మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. మిడిలార్డర్‌లో లియామ్ లివింగ్‌స్టోన్ మాత్రమే రాణించాడు.
180 పరుగుల లక్ష్య చేదనలో న్యూజిలాండ్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ , గ్లెన్ ఫిలిప్స్ పోరాడడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఇద్దరూ మూడో వికెట్‌కు 91 రన్స్ జోడించి విజయంపై ఆశలు రేపారు. అయితే కీలకమైన సమయంలో ఈ ఇద్దరూ ఔటవడంతో న్యూజిలాండ్‌కు ఓటమి తప్పలేదు. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లాండ్ విజయాన్ని అందుకుంది. విలియమ్సన్ 40 , గ్లెన్ ఫిలిప్స్ 62 రన్స్ చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2 , సామ్ కరన్ 2 వికెట్లు పడగొట్టారు.