నందమూరి బాలకృష్ణ కు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. నందమూరి అభిమానుల్లో ఈ వార్త ఎంతో ఆనందాన్ని పంచింది. అందరూ బాలకృష్ణను అభినందించారు. సరైన వ్యక్తికి గౌరవం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రముఖుల నుంచి సైతం బాలకృష్ణకు అభినందనలు వెల్లువెత్తాయి. జూనియర్ ఎన్టీఆర్ అయితే బాల బాబాయ్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో నెలకొన్న పరిణామాలను మరిచి బాబాయ్ కి ఆప్యాయతను పంచుతూ శుభాకాంక్షలు తెలపడం హాట్ టాపిక్ అయ్యింది. నందమూరి కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్ దగ్గరవుతున్నారన్న సంకేతాలతో అభిమానులు సైతం ఆనందించారు. గత కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ తో బాలకృష్ణ విభేదించినట్లు వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే వారిద్దరి మధ్య గ్యాప్ ఉండడం కనిపించింది. అయితే వాటన్నింటినీ మరిచి బాబాయికి పద్మభూషణ్ అవార్డు రావడం పై అబ్బాయి సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో వారిద్దరి మధ్య విభేదాలకు ఎండ్ కార్డు పడుతుందని భావించారు.
అయితే నందమూరి బాలకృష్ణ ఏ విషయంలోనైనా పట్టువిడుపులు ఎక్కువ. ఆయన ఏ విషయంలోనైనా పట్టుదలగా ఉంటారు అన్నది ఇండస్ట్రీలో టాక్. అలాగే తారక్ విషయంలో అదే మాదిరిగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఒక మెట్టు దిగి బాబాయితో రాజీకి వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. కానీ బాలకృష్ణ మాత్రం గతంలో జరిగిన పరిణామాలను గుర్తుపెట్టుకున్నారు. అందుకే తారక్ ను దగ్గర చేర్చుకునే ప్రయత్నాలు చేయడం లేదు. మొన్నటికి మొన్న పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు పత్రికలకు ఫుల్ పేజీ యాడ్లు ఇచ్చారు. అందులో నందమూరి కుటుంబ సభ్యులందరి పేర్లు చేర్చారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ ప్రస్తావన లేదు. కళ్యాణ్ రామ్ కు సైతం ప్రాధాన్యత ఇవ్వలేదు. అప్పట్లో అదో హాట్ టాపిక్ గా నిలిచింది.
తాజాగా తన అన్నయ్యకు పద్మ భూషణ్ అవార్డు రావడం పై సంతోషం వ్యక్తం చేస్తూ నారా భువనేశ్వరి భారీ కార్యక్రమానికి ప్లాన్ చేశారు. హైదరాబాదులోని తన సొంత ఫామ్ హౌస్ లో ట్రీట్ ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు బిజెపి చీఫ్ పురందేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నందమూరితో పాటు నారా కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. చాలా సంతోషంగా గడిపారు. కానీ హరికృష్ణ పిల్లలుగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు రాకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. వారికి అసలు ఆహ్వానం పంపారా? లేకుంటే ఆహ్వానం పంపిన వారు రాలేదా? అన్నది ఇప్పుడు చర్చకు దారితీసింది.
అయితే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది నారా భువనేశ్వరి. కచ్చితంగా ఆమె ఆహ్వానం పంపి ఉంటుందన్న ప్రచారం నడుస్తోంది. అయితే గతంలో నారా భువనేశ్వరిని టార్గెట్ చేసుకున్నారు వైసీపీ నేతలు. ప్రధానంగా కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిద్దరి వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారన్నది ఒక ప్రచారం. అప్పట్లో వివాదం తలెత్తడంతో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. కానీ ఎక్కడ తన మేనత్త ప్రస్తావన చేయకుండా.. మహిళలను గౌరవించాలని పొడిపొడిగా మాట్లాడుతూ ముగించారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు సమయంలో సైతం అదేవిధంగా స్పందించారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరు కాలేదు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో కూడా స్పందించలేదు. ఈ కారణాలతోనే ఎక్కువగా బాలకృష్ణ హర్ట్ అయ్యారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ను దూరం పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది.
అయితే బాబాయితో అబ్బాయి కలిసి పోవాలని నందమూరి అభిమానులు కోరుతూ వచ్చారు. అయితే ప్రస్తుతం లోకేష్ ను ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు చంద్రబాబు. అందులో భాగంగానే నందమూరి కుటుంబాన్ని మొత్తం తన గ్రిప్ లో తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురందేశ్వరి చంద్రబాబు పట్ల సానుకూలంగా ఉన్నారు. వచ్చే మహానాడులో టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ను ప్రమోట్ చేస్తారని తెలుస్తోంది. ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ ను మరికొన్ని రోజులపాటు దూరం పెడతారని ప్రచారం నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.