ఏపీ మాజీ సీఎం జగన్ విదేశీ పర్యటన ముగిసిందా? ఆయన తిరిగి ఇండియాకు వచ్చారా? బెంగళూరులో అడుగు పెట్టారా? కీలక నేతలతో సమాలోచనలు చేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొద్ది రోజులుగా జగన్ విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. లండన్ లో ఉంటున్న తన చిన్న కుమార్తె వర్షా రెడ్డి డిగ్రీ ప్రధానోత్సవానికి గాను కుటుంబ సమేతంగా లండన్ వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతితో ఈనెల 14న సతీ సమేతంగా ఆయన లండన్ వెళ్లారు. గత 15 రోజులుగా ఆయన లండన్ పర్యటనలో కొనసాగారు. అయితే ఈ రోజుతో ఆయన విదేశీ పర్యటన ముగిసినట్లు సమాచారం. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన ఈరోజు లండన్ నుంచి బెంగళూరు చేరుకున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో జగన్కు యలహంక ప్యాలెస్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కుటుంబంతో అక్కడ జగన్మోహన్ రెడ్డి సేదతీరుతున్నారు. ఫిబ్రవరి 3న ఆయన తాడేపల్లి కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురయింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఆ కారణం చూపుతోనే అసెంబ్లీకి హాజరు కావడం లేదు జగన్. అదే సమయంలో శాసనమండలి సభ్యులు మాత్రం సెషన్స్కు హాజరవుతున్నారు. శాసనమండలిలో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. పైగా శాసనమండలి వైసిపి పక్ష నేతగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఎంపికయ్యారు. అప్పటినుంచి శాసనమండలిలో బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. అదే సమయంలో శాసనసభకు హాజరైన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం గైర్ హాజరవుతూ వస్తున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదన్న కారణంతోనే అసెంబ్లీకి గైర్హాజరవుతూ వచ్చారు. ఈనెల 14న జగన్ తన భార్య భారతితో కలిసి లండన్ వెళ్లారు. చిన్న కుమార్తె వర్షా రెడ్డి డిగ్రీ ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత పక్షం రోజులుగా వీరు లండన్ లోనే గడుపుతున్నారు.
జగన్ విదేశీ పర్యటనలో ఉండగా వైసీపీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైసీపీలో నెంబర్ 2 స్థాయికి ఎదిగిన విజయసాయిరెడ్డి ఏకంగా పార్టీకి రాజీనామా చేశారు. మూడేళ్ల రాజ్యసభ పదవిని సైతం వదులుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది వైసీపీకి తీరని లోటు. పార్టీ ఆవిర్భావానికి ముందే జగన్ వెంట అడుగులు వేశారు విజయసాయిరెడ్డి. ఆయనతో పాటు అవినీతి కేసులను కూడా ఎదుర్కొన్నారు. 16 నెలల పాటు జైలు జీవితం కూడా అనుభవించారు. వైసిపి ఆవిర్భావంలో క్రియాశీలక పాత్ర పోషించారు విజయసాయిరెడ్డి. అటు పార్టీ అభివృద్ధి తో పాటు పార్టీని విజయపథంలో తీసుకురావడంలో విజయసాయి రెడ్డి పాత్ర చాలా ఉంది. కానీ ఈ ఎన్నికల్లో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విజయసాయిరెడ్డి వైసీపీకి దూరమయ్యారు. జగన్ విదేశీ పర్యటనలో ఉండగా నాటకీయ పరిణామాల నడుమ ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు. కానీ ఇప్పటివరకు సాయి రెడ్డి రాజీనామా వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ఈరోజు విదేశీ పర్యటన నుంచి నేరుగా జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో బెంగళూరు చేరుకున్నారు. అదే సమయంలో వైసీపీ నేతలంతా బెంగళూరులోని జగన్ పాలస్కు చేరుకోవడం ఆసక్తికరంగా మారింది.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. పార్టీ నుంచి ఒక్కొ కీలక నేత దూరమవుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పునరాలోచనలో పడ్డారు. విజయసాయి రెడ్డి ఎందుకు పార్టీకి దూరమైంది? దాని వెనుక జరిగిన పరిణామాలు గురించి పార్టీ కీలక నేతలతో జగన్మోహన్ రెడ్డి చర్చించినట్లు సమాచారం. అందుబాటులో ఉన్న వైసీపీ కీలక నేతలంతా బెంగళూరు బాట పట్టారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఇకనుంచి తనతో ఉండే వారితో రాజకీయం చేస్తానని వారితో చెప్పినట్లు తెలుస్తోంది. వైసిపి టార్గెట్గా ఏపీలో పొలిటికల్ గేమ్ జరుగుతోందని.. తాను మాత్రం వెనక్కి తగ్గేది లేదని.. తన వెంట ఉండే వారితోనే రాజకీయాలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు అవసరమైతే బడ్జెట్ సెషన్స్ కు హాజరవుతానని.. అక్కడ నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడతానని పార్టీ శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికైతే లండన్ నుంచి దేశానికి చేరుకున్న జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ముందు ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో చూడాలి