ఏపీలో విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. ఒకరిపై ఎత్తుకు పై ఎత్తు అన్నట్టు పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పై చేయి సాధించాల్సిందేనన్న రీతిలో రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. విభజన హామీల్లో ఏపీకి చాలా దక్కాయి. కానీ రకరకాల రాజకీయాలు తెరమీదకు రావడంతో రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ఉనికి చాటుకున్నాయి. వాస్తవానికి రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదన్న వాదన ఉంది. కేవలం తెలంగాణ ప్రజలు తమ స్వరాష్ట్రాన్ని కోరుకున్నారన్న వాదనని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. కానీ సీమాంధ్ర ప్రజల విన్నపాన్ని కనీస పరిగణలోకి తీసుకోలేదు అన్న విమర్శ ఉంది. అయితే ఎలాగోలా రాష్ట్ర విభజన జరిగింది. ఏపీకి అన్యాయం జరిగింది. దానిని పూడ్చాలన్న ఆలోచన గత పది ఏళ్లలో ఒక్క రాజకీయ పార్టీకి కూడా రాలేదు. తెలంగాణ కోసం అక్కడ పార్టీలు కొట్లాడుకున్నాయి. కానీ ఏపీ ప్రయోజనాల కోసం మాత్రం ఇక్కడ ఉన్న రాజకీయ పక్షాలు ఏకం కాలేదు. దీంతో గత పది సంవత్సరాలుగా అన్యాయం జరుగుతూనే ఉంది.
2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అందరి ఆమోదంతో అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఎంపిక చేసింది. అక్కడ నిర్మాణ పనులను కూడా ప్రారంభించింది. అదే సమయంలో రాయలసీమ ప్రయోజనాలను కాపాడాలన్న ఉద్దేశంతోuకు హైకోర్టు బెంచ్ ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఈ విషయంలో త్వరితగతిన బెంచ్ మంజూరులో మాత్రం టిడిపి ప్రభుత్వం వెనుకబడింది. దాని ఫలితంగా రాయలసీమలో ఒక రకమైన అసంతృప్తి కనిపించింది. అదే సమయంలో 2019 ఎన్నికలు సమీపించాయి. అప్పటి టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకత పతాక స్థాయికి చేరింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఫలితంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు నిలిచిపోయింది.
2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. కనివిని ఎరుగని రీతిలో ఆ పార్టీకి గెలుపు సాధ్యమైంది. అంతులేని గెలుపుతో అధికారంలోకి వచ్చిన వైసిపి సరికొత్త ఆలోచన చేసింది. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. అంతకుముందు కర్నూలులో హైకోర్టు డివిజన్ బెంచ్ ఏర్పాటు చేస్తామన్న హామీని.. న్యాయ రాజధానిగా మార్చింది. కర్నూలును న్యాయ రాజధానిగా మార్చుతామని ప్రకటించింది. కానీ దానిని కూడా అమలు చేయలేకపోయింది వైసీపీ ప్రభుత్వం.
తాజాగా కూటమి ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు డివిజన్ బెంజ్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకుగాను న్యాయమూర్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. హైకోర్టు నుంచి కర్నూలు జిల్లా యంత్రాంగానికి ఒక లేఖ పంపింది. కర్నూలులో డివిజన్ బెంచ్ ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆ లేఖలో స్పష్టం చేసింది. ప్రస్తుతం కర్నూలు జిల్లా యంత్రాంగం హైకోర్టు డివిజన్ బెంచ్ కు అవసరమైన భవనాల అన్వేషణలో పడింది. ఈ మేరకు భవనాలను పరిశీలించిన జిల్లా యంత్రాంగం హైకోర్టు కమిటీకి నివేదిక పంపింది. దీంతో హైకోర్టు కమిటీ త్వరలో కర్నూలులో భవనాలను పరిశీలించనుంది. హైకోర్టు కమిటీ ఓకే చెబితే డివిజినల్ బెంచ్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడతాయి. ఇది నిజంగా రాయలసీమ ప్రజలకు శుభపరిణామమే. కానీ గతం మాదిరిగా శుభం కార్డు పడుతుందా? నిజంగా డివిజనల్ బెంచ్ ఏర్పాటు అవుతుందా అన్నది చూడాలి.