వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది మహిళా నేతలు క్రియాశీలక పాత్ర పోషించారు. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట అడుగులు వేశారు. జగన్ సైతం వారికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. కీలక పదవులు కట్టబెట్టారు. రాజకీయంగా వారికి ఒక లైఫ్ ఇచ్చారు. అటువంటి నేతలంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. వైసిపి ప్రతిపక్షంలోకి చేరడంతో ఇక తమ lకు ఆ పార్టీతో సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. వారు వీరు అన్న తేడా లేకుండా అందరూ మహిళా నేతలు అదేవిధంగా వ్యవహరిస్తున్నారు. కొందరు మహిళా నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉండగా.. మరికొందరు పార్టీలో ఉన్నా స్పందించడం లేదు. కనీసం జగన్ తమకు పదవులు ఇచ్చారన్న విషయాన్ని కూడా వారు గ్రహించడం లేదు.
* రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మకు జగన్ ఝాన్సీ ఇచ్చారు. ఎక్కడో ప్రజారాజ్యం పార్టీలో ఎంట్రీ ఇచ్చి అవకాశాల కోసం వేచి చూసేవారు వాసిరెడ్డి పద్మ. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి చట్టసభల్లో అడుగు పెట్టాలన్నది వాసిరెడ్డి పద్మ ఆశ. కానీ 2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ప్రజారాజ్యం పార్టీలో ఆమెకు అవకాశం దక్కలేదు. కేవలం అధికార ప్రతినిధి అన్న హోదాలో ఆమె నిలిచిపోయారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి ఓటమి ఎదురైంది. కాంగ్రెస్ పార్టీలో పిఆర్పి విలీనం కావడంతో వాసిరెడ్డి పద్మా లాంటి నేతలకు కనీస గుర్తింపు లేకుండా పోయింది. అటువంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపి ఆమెకు అండగా నిలిచింది. ప్రజారాజ్యం పార్టీ మాదిరిగానే ఆమెకు అధికార ప్రతినిధి హోదాను కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఆమెను ఆర్థికంగా ఆదుకున్నారన్న ప్రచారం కూడా ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆమెకు క్యాబినెట్ హోదాతో సమానమైన మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి కట్టబెట్టారు. ఐదేళ్లపాటు ఆ పదవిలో దర్పాన్ని ప్రదర్శించిన వాసిరెడ్డి పద్మ ఇప్పుడు.. వైసీపీకి ఓటమి ఎదురయ్యేసరికి.. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. పదవి ఇచ్చారన్న విషయాన్ని మరచిపోయి పార్టీకి గుడ్ బై చెప్పారు. కూటమి పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.
* జగన్మోహన్ రెడ్డి వైసీపీలో అరుదైన అవకాశం ఇచ్చిన మహిళ నేతల్లో మేకతోటి సుచరిత ఒకరు. దివంగత రాజశేఖరరెడ్డి ప్రోత్సహించి ద్వితీయ శ్రేణి నాయకురాలిగా ఉన్న సుచరితను ఎమ్మెల్యే చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఈ రాష్ట్రానికి హోం మంత్రిని చేశారు. కానీ సమీకరణాల నేపథ్యంలో మంత్రి పదవిని పక్కన పెట్టారన్న ఒకే ఒక్క కారణంతో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించారు సుచరిత. అయినా సరే మహిళా నేతకు కావడంతో ఈ ఎన్నికల్లో ఛాన్స్ ఇచ్చారు జగన్. కానీ దారుణ పరాజయం చవిచూశారు సుచరిత. ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు.
* మరో మహిళ దానేటి వనితకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు జగన్. ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. రాజకీయంగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న ఆమెను జగన్మోహన్ రెడ్డి ఆదరించారు. ఏకంగా మంత్రిని చేశారు. మిగతా నేతలను విస్తరణలో పదవి నుంచి తీసేసిన.. వనితను మాత్రం ఐదేళ్లపాటు కొనసాగించారు. కనీసం ఆ కృతజ్ఞతను కూడా ఆమె చూపలేదు. తన దారి తాను చూసేందుకు దానేటి వనిత సిద్ధపడ్డారు.
* మాజీ మంత్రి ఆర్కే రోజా జగన్మోహన్ రెడ్డికి అత్యంత విదేయనేత. ఎవరు అభ్యంతరం వ్యక్తం చేసిన జగన్ వినలేదు. విస్తరణలో రోజాకు మంత్రి పదవి ఇచ్చారు . పదోన్నతి కల్పించారు. ఆమెపై అనేక ఫిర్యాదులు ఉన్న ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. ఆమె ఓడిపోతుందని తెలిసినా విధేయతకు పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన ఆమెకు అధికార ప్రతినిధి హోదా కల్పించారు. కానీ ఆమె తన పదవికి గౌరవం ఇవ్వడం లేదన్న టాక్ వైసిపి లో వినిపిస్తోంది. అధినేత జగన్ తన పై నమ్మకం ఉంచితే ఆమె మాత్రం పార్టీ విషయంలో పొడిపొడిగా మాట్లాడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలా వైసీపీలో మహిళా నేతలు జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేశారన్న టాక్ వినిపిస్తోంది.