తెలుగుదేశం పార్టీ సీనియర్లు అగౌరవంగా ఫీల్ అవుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలు అందిస్తే.. తమకు రిక్త హస్తం అందించారని తెగ బాధపడుతున్నారు. చంద్రబాబుతో సమకాలీకులు అయిన నేతలు ఇప్పుడు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. తమకు గౌరవప్రదమైన రిటైర్మెంట్ దక్కుతుందా? లేదా? అని తెగ బాధపడుతున్నారు. కష్టకాలంలో చంద్రబాబుకు అండగా నిలబడితే.. తమకు అండగా ఉండేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిక్కోలు నుంచి అనంతపురం వరకు సీనియర్ల పరిస్థితి అలానే ఉంది. కక్కలేక మింగలేక.. ప్రత్యామ్నాయం లేక లోలోనే మదన పడుతున్నారు. ఇప్పుడు పార్టీలో ఉన్న పదవులను సైతం తొలగిస్తారు అన్న వార్తలతో కలవర పడుతున్నారు. ఇన్నేళ్లు విధేయతగా పనిచేస్తే.. ఇదే నా ఫలితం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కంటే సీనియర్లు ఉన్నారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అక్కడకు తొమ్మిది నెలల్లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కానీ విని ఎరుగని విజయం సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ పిలుపుమేరకు ఎంతమంది తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ నేత. ఇది ముమ్మాటికీ సత్యం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 1983లో జరిగిన తొలి ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి చేతుల్లో ఓడిపోయారు. అటు తరువాత లాభం లేదనుకుని మామ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటికే అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, కిమిడి కళా వెంకట్రావు వంటి వారు టిడిపిలో ఎమ్మెల్యేలు. ఈ లెక్కన చంద్రబాబు కంటే వారు సీనియర్లే కదా. కానీ 1985లో తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు చంద్రబాబు. 1989 వరకు పార్టీ సమస్త గత నిర్మాణ బాధ్యతలను చూసుకొని.. టిడిపి క్యాడర్ పై పూర్తి పట్టు సాధించారు చంద్రబాబు.
ప్రస్తుతం టిడిపిలో ఉన్న చాలామంది సీనియర్ నేతలు.. చంద్రబాబు కంటే మోస్ట్ సీనియర్లు. వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభ్యులు కూడా. అటువంటి నేతలు నారా లోకేష్ పుణ్యమా అని పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి ఎదుర్పడింది. ఒక విధంగా చెప్పాలంటే టిడిపి సీనియర్లు తమంతట తాము తప్పుకునేలా ప్లాన్ రూపొందించారు నారా లోకేష్. ఒక నయా ఫార్ములా ను తెరపైకి తెచ్చారు. పార్టీ పదవుల్లో వరుసగా మూడుసార్లు ఉన్నవారు నాలుగోసారి తప్పుకోవాల్సిందేనని సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారు. అయితే ఈసారి తాను పదవి నుంచి తప్పుకుని సీనియర్లకు గీత గీయనున్నారు. తద్వారా సీనియర్లకు చెక్ చెప్పనున్నారు. అయితే ఇది లోకేష్ ప్లాన్ ఎంత మాత్రం కాదు.. ముమ్మాటికి చంద్రబాబు ప్లాన్ ఇది. తనయుడు లోకేష్ టీం కోసం చేసిన ప్రణాళిక ఇది.
ఈ ఎన్నికల్లో అశోక్ గజపతిరాజుతోపాటు యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్లు తప్పుకున్నారు. తమ వారసులకు ఛాన్స్ ఇచ్చారు. తమకు ఒక గౌరవప్రదమైన పదవి విరమణ వారు కోరుకుంటున్నారు. కానీ చంద్రబాబుతో పాటు లోకేష్ మాత్రం ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. ఇప్పటికే మీ వారసులకు అవకాశం ఇచ్చాం కాబట్టి గౌరవంగా తప్పుకోండి అంటూ సంకేతాలు పంపిస్తున్నారు. పార్టీలో కొత్త రక్తం ఎక్కిస్తామంటున్నారు. అయితే ఇన్నేళ్లపాటు పార్టీకి సర్వీసు అందించామని.. తమ సేవలకు ఇదా ఫలితం అంటూ సీనియర్లు నెట్టూరుస్తున్నారు. మరోవైపు వారి వారసులు ఎమ్మెల్యేలుగా ఉంటున్నారు. పార్టీని అతిక్రమిస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళనతో వారు ఉన్నారు. దీంతో కక్కలేక మింగలేక సీనియర్లు తెగ బాధ పడిపోతున్నారు. చంద్రబాబుతో పాటు లోకేష్ ను నమ్మితే తమకు ఈ పరిస్థితి వచ్చిందని నిట్టూరుస్తున్నారు. బయట పడలేక.. పిల్లల రాజకీయ భవిష్యత్తును ఇబ్బంది పెట్టలేక సైలెంట్ అవుతున్నారు.