Monday, February 10, 2025

జమ్మలమడుగు పంచాయితీ.. సీఎం రమేష్ వర్సెస్ ఆదినారాయణ రెడ్డి

- Advertisement -

ఏపీ బీజేపీలో సీఎం రమేష్ పాత్ర అమాంతం పెరిగింది. ఈ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు రమేష్. కానీ ఏపీ బీజేపీకి తానే చీఫ్ అన్న రేంజ్ లో వ్యవహారాలను నడుపుతున్నారు. ఎక్కడో రాయలసీమ జిల్లాకు చెందిన ఆయన ఉత్తరాంధ్రలో ప్రవేశించారు. ఎంపీగా కూడా గెలిచారు. ఒక విధంగా చెప్పాలంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో సీఎం రమేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బిజెపి ఎంపీ అయినా.. ఆయన మాట చెల్లుబాటు అవుతోంది. టిడిపి ఎమ్మెల్యేలు సైతం తమ సొంత పార్టీ ఎంపీగా భావిస్తున్నారు. పైగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావడంతో సీఎం రమేష్ కు ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. అయితే అందుకే సీఎం రమేష్ అక్కడ ఇక్కడ అన్న తేడా లేకుండా.. ఏపీవ్యాప్తంగా తన హవా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే తాజాగా జమ్మలమడుగు నియోజకవర్గంలో వేలు పెట్టారు. ఏకంగా ఓ బిజెపి నేతపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా ఎస్పీకి సైతం నేరుగా లేఖ రాశారు. సదరు బిజెపి నేత ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రధాన అనుచరుడు. దీంతో ఇది హాట్ టాపిక్ అవుతోంది. ఒకే పార్టీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా పరిస్థితి మారింది. కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీగా గెలిచారు. జమ్మలమడుగు నుంచి బిజెపి నుంచి బరిలో దిగి గెలిచారు ఆదినారాయణ రెడ్డి. కానీ పరిస్థితి చూస్తుంటే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్సెస్ ఎంపీ సీఎం రమేష్ అన్నట్టు సీన్ క్రియేట్ అవుతోంది. దీని వెనుక ప్రధాన కారణం సీఎం రమేష్ కు చెందిన కంపెనీ పనులు ప్రస్తుతం జమ్మలమడుగు లో జరుగుతున్నాయి. ఈ కంపెనీలో పనులకు సంబంధించి కాంట్రాక్టు తమకు ఇవ్వాలని ఆదినారాయణ రెడ్డి అనుచరులు కోరుతున్నారు. అందుకు సీఎం రమేష్ అంగీకరించలేదు. దీంతో కంపెనీ ప్రతినిధులతో పాటు కార్యాలయంపై ఆదినారాయణ రెడ్డి అనుచరులు దాడులు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అక్కడ నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి మధ్య నువ్వా నేనా అన్నట్టు ఉందని తెలుస్తోంది. అందులో భాగంగానే సీఎం రమేష్ ఏకంగా ఓ బిజెపి నేతపై జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

జమ్మలమడుగు క్లబ్లో దేవగుడి నాగేశ్వరరెడ్డి అనే బిజెపి నేత జూద శిబిరాలు నిర్వహిస్తున్నాడని ఎంపీ సీఎం రమేష్ ఆరోపిస్తున్నారు. 12 టేబుళ్ల పై.. టేబుల్ కు 9 మంది చొప్పున 25 వేల రూపాయలు, 50 వేల రూపాయలు, లక్ష రూపాయల వరకు జూదం బెట్టింగ్ గా నిర్వహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మట్కా, లిక్కర్ బందా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కడప ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం కొత్త చర్చకు దారితీస్తోంది.

వాస్తవానికి సీఎం రమేష్ తో పాటు ఆదినారాయణ రెడ్డి అవసరాల కోసం బిజెపిలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించడంతో వీరు ఆందోళనకు గురయ్యారు. అప్పటివరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన ఈ ఇద్దరు నేతలు బిజెపి గూటికి వెళ్లారు. తెలుగుదేశం పార్టీతో బిజెపి జత కట్టడానికి కారణమయ్యారు. ఇప్పుడు ఆధిపత్యం కోసం ఇద్దరు నేతలు ప్రయత్నిస్తుండడం బిజెపిలో ఆందోళనకు కారణం అవుతోంది. ఇటువంటి అద్దె నాయకులతో పార్టీ వీధిన పడుతోందని వారు బాధపడుతున్నారు. హై కమాండ్ ఈ విషయంలో కట్టడి చేయాలని కోరుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!