Wednesday, February 12, 2025

వైసిపి జాతీయ వ్యవహారాలు.. ఇకనుంచి మిథున్ రెడ్డి చేతిలో

- Advertisement -

వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి పార్టీకి దూరమయ్యారు. రాజకీయాలనుంచి శాశ్వతంగా పక్కకు తప్పుకున్నట్లు ప్రకటించారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన నిర్ణయం జగన్మోహన్ రెడ్డికి లోటు. వైసీపీ శ్రేణుల్లో సైతం ఒక రకమైన ఆందోళనకు కారణమవుతోంది ఈ పరిణామం. తన వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయసాయిరెడ్డి చెబుతున్నారు. కానీ దీని వెనుక బిజెపి హస్తం ఉందన్నది బహిరంగ రహస్యం. జగన్మోహన్ రెడ్డిని అచేతనం చేసేందుకు చంద్రబాబు ఆడిన గేమ్. అయితే వైసీపీ నుంచి గౌరవంగానే తప్పుకున్నారు విజయసాయిరెడ్డి. కానీ వైసీపీకి తీరని లోటే. ఆ లోటును మరో నేత ద్వారా భర్తీ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ఓ కీలక నేతకు విజయసాయిరెడ్డి బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే ఆ నేత ఢిల్లీ వేదికగా రంగంలోకి దిగారు. వైసిపి పరంగా అన్ని పనులను చక్కబెడుతున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరు? అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.

c ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి గెలిచారు మిథున్ రెడ్డి. ఆది నుంచి అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడు. జగన్మోహన్ రెడ్డికి సమకాలీకుడు కావడంతో పార్టీలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ వచ్చారు మిథున్ రెడ్డి. పైగా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడుగా కూడా సుపరిచితం. 2014 నుంచి రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ గెలుస్తూ వస్తున్నారు మిధున్ రెడ్డి. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ కొట్టారు. రాజంపేట నుంచి మిథున్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని భావించిన చంద్రబాబు.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని రంగంలోకి దించారు. పెద్దిరెడ్డి కుటుంబానికి చెక్ చెప్పాలని భావించిన ఇద్దరు ప్రత్యర్థులు.. చేతులు కలిపారు కూడా. కానీ మిథున్ రెడ్డి విజయాన్ని మాత్రం ఆపలేకపోయారు. కూటమి ప్రభంజనంలో మొత్తం ఓటమి చవిచూసినా.. చిత్తూరు జిల్లాలో మాత్రం పెద్దిరెడ్డి కుటుంబం తన హవాను చాటుకుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు.

ప్రస్తుతం లోక్సభలో వైసిపి శాసనసభాపక్ష నేతగా మిథున్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. రాజ్యసభలో వైసిపి పక్ష నేతగా విజయసాయిరెడ్డి ఉండేవారు. వైవి సుబ్బారెడ్డి పార్లమెంటరీ వైసీపీ పక్ష నేతగా వ్యవహరించేవారు. అంతకుముందు ఇదే పదవిలో విజయసాయిరెడ్డి ఉండేవారు. పార్టీలో జరిగిన పరిణామాలతో విజయసాయిరెడ్డిని రాజ్యసభ వరకే పరిమితం చేశారు. ఆయన అసంతృప్తికి గురికావడానికి ఇది ఒక ప్రధాన కారణంగా ప్రచారం జరుగుతోంది. అయితే విజయసాయిరెడ్డి నిష్క్రమణతో జాతీయస్థాయిలో వైసీపీ వ్యవహారాలు ఎవరు చూస్తారా అన్నది చర్చ ప్రారంభమైంది. అప్పటి పరిణామాలతో వైవి సుబ్బారెడ్డిని పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించారే కానీ.. ఆయనకు అక్కడికి వ్యవహారాలు తెలియని పార్టీలోనే ఒక ప్రచారం ఉంది. అందుకే ఇప్పుడు మిధున్ రెడ్డిని జగన్ రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

గత పది సంవత్సరాలుగా ఢిల్లీ రాజకీయాల్లో మిధున్ రెడ్డి ఆరితేరిపోయారు. మొన్నటి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను కూడా జగన్మోహన్ రెడ్డి మిధున్ రెడ్డికి అప్పగించారు. అంటే ఆయనపై ఏ స్థాయి నమ్మకం ఉందో అర్థమవుతోంది. మొన్నటికి మొన్న పార్లమెంట్ సమావేశాలకు ముందు ఆల్ పార్టీస్ మీటింగు నిర్వహించారు. సమావేశానికి వైసీపీ తరఫున మిధున్ రెడ్డి హాజరయ్యారు. తద్వారా వైసీపీలో విజయసాయిరెడ్డి తరువాత తన పాత్ర ఏంటో సంకేతాలు పంపారు. జాతీయస్థాయిలో వైసీపీ వ్యవహారాలన్నీ ఇకనుంచి మిధున్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతాయని తెలుస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!