నారా భువనేశ్వరి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనన్నారా? ప్రత్యక్ష రాజకీయాలకు దిగనున్నారా? వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్ ఇదే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆమె మాజీ ముఖ్యమంత్రి కుమార్తె. ప్రస్తుత ముఖ్యమంత్రి సతీమణి. పైగా మంత్రి లోకేష్ కు స్వయాన మాతృమూర్తి. అయితే ఆమె ఇటీవల పొలిటికల్ వేదికల్లో పాలుపంచుకుంటున్నారు. రాజకీయ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆమెకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉందని ప్రచారం ప్రారంభం అయింది. ఇటీవల తరచూ తన భర్త ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పార్టీ శ్రేణులతో మమేకమై పని చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే నారా భువనేశ్వరి వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతారని టాక్ నడుస్తోంది.
భర్త స్థాపించిన హెరిటేజ్ డైరీ వ్యాపార కార్యకలాపాల్లో ముందంజలో ఉండేవారు నారా భువనేశ్వరి. భర్త రాజకీయాల్లో బిజీగా మారడంతో ఆ బాధ్యతలు తానే స్వయంగా చూసుకున్నారు. కానీ కో డలిగా బ్రాహ్మణి అడుగు పెట్టిన తర్వాత క్రమేపి హెరిటేజ్ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్నారు భువనేశ్వరి. ప్రస్తుతం హెరిటేజ్ బాధ్యతలంతా బ్రాహ్మణి చూసుకుంటున్నారు. గత ఏడాది చంద్రబాబు అరెస్టు సమయంలో బయటకు వచ్చారు భువనేశ్వరి. తన భర్త పై అక్రమ కేసులు పెట్టారంటూ ఆరోపిస్తూ ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేశారు. అయితే ప్రసంగాలలో ఆమె తడబడుతూ ఉంటారు. తెలుగు అనుకున్న స్థాయిలో రాదు. అయినా సరే తన వంతు ప్రయత్నం చేస్తూ వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేశారు. చంద్రబాబు అరెస్టులకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి.. నాటి వైసిపి సర్కార్ తీరుపై గళం ఎత్తారు.
2019 ఎన్నికల్లో చంద్రబాబు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దారుణంగా దెబ్బతింది. 23 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది వైసిపి. చంద్రబాబు మెజారిటీ తగ్గడంతో 2024 ఎన్నికల్లో ఎలాగైనా ఓడిస్తామని శపధం చేసింది. అందుకు ప్రత్యేక కార్యాచరణ తో ముందుకు సాగారు అప్పటి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. దాదాపు చంద్రబాబును ఓడించేందుకు సర్వశక్తులు వడ్డారు. కానీ చంద్రబాబుకు అండగా నిలబడ్డారు కుప్పం నియోజకవర్గ ప్రజలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షం విజయం సాధించగా.. సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి సీన్ మారింది. ఏకంగా చంద్రబాబు భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే 2019 నుంచి 2024 మధ్య మాత్రం కుప్పం విషయంలో చంద్రబాబుకు నిద్ర లేకుండా రోజులు గడిపేలా చేసింది వైసిపి. అందుకే మరోసారి ఆ పరిస్థితి రాకుండా కుప్పం నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.
ప్రస్తుతం కుప్పంలో చంద్రబాబు స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం సొంత ఇంటి నిర్మాణం చురుగ్గా సాగుతోంది. మరోవైపు భువనేశ్వరి ప్రతినెల కుప్పంను సందర్శించి ఇంటి నిర్మాణ పనులను చూస్తున్నారు. ఇంకోవైపు పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పరామర్శల పేరిట వారిని కలుస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి పునర్విభజన జరిగే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీకి ఆ ఎన్నికలు ప్రతిష్టాత్మక కూడా. అందుకే చంద్రబాబు నారా భువనేశ్వరి తో పోటీ చేయించేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. అందులో భాగంగానే భువనేశ్వరి పొలిటికల్ కామెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె రాజకీయ ప్రవేశం జరిగితే మాత్రం సరికొత్త రికార్డు. మరి ఏం జరుగుతుందో చూడాలి.