Wednesday, February 12, 2025

కడప టిడిపి కార్యాలయం కోసం రూ. 80 కోట్ల ప్రభుత్వ స్థలం సొంతం!

- Advertisement -

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు సమీపిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ కార్యాలయాల పై పడింది కూటమి ప్రభుత్వం. నిబంధనలకు విరుద్ధంగా కార్యాలయాల ఏర్పాటు జరిగిందని చెప్పుకొచ్చింది. కొన్నింటికి నోటీసులు ఇచ్చిందే తడవు కూల్చి వేసింది. అమరావతిలో కూడా పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఇదే విధంగా ధ్వంసం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యాలయాలకు నోటీసులు ఇచ్చింది. అయితే ఈ విషయంలో వైసీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు కొంత ఉపశమనం దక్కింది. అయితే కూటమి ప్రభుత్వం ఇప్పుడు మూడు పార్టీల కార్యాలయాల కోసం ప్రతి జిల్లాలో అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో వైసీపీని తప్పు పట్టిన టిడిపి.. ఇప్పుడు ప్రతి జిల్లాలో కార్యాలయం కట్టుకునేందుకు ప్రభుత్వ భూమిని కైవసం చేసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది.

తాజాగా కడప జిల్లాలో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి తెలుగుదేశం పార్టీ వశమైంది. ఎంతో విలువైన ఆ భూమిని కాపాడుకునేందుకు కడప ప్రజలు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వాస్తవానికి టిడిపి ఆవిర్భవించి నాలుగు దశాబ్దాలు దాటుతోంది. కానీ ఇంతవరకు కడప జిల్లాలో తన మార్కు చూపించలేకపోయింది. తొలిసారిగా ఈ ఎన్నికల్లో పట్టు బిగించింది. అందుకే కడప జిల్లాలో సొంత కార్యాలయం నిర్మించుకోవాలని భావిస్తోంది తెలుగుదేశం పార్టీ. అయితే కోట్లాది రూపాయల విలువ చేసే భూమి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి దక్కడం విశేషం. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చినప్పుడు కడపలో టిడిపికి సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని తలపెట్టారు. అందులో భాగంగా కడప నగరంలోని అక్కయపల్లి పార్కు సమీపంలో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన న్యాక్ కార్యాలయాన్ని తీసుకునేందుకు టిడిపి నేతలు అప్పట్లో ప్రయత్నించారు. కానీ అప్పట్లో ఈ ప్రయత్నం జరగలేదు. వైసిపి తో పాటు మిగతా రాజకీయ పక్షాలు వ్యతిరేకించడంతో అప్పట్లో టిడిపి వెనక్కి తగ్గింది. దీంతో ఆ భూమిని పార్కు కేటాయిస్తూ అప్పటి పాలకమండలి తీర్మానించింది. దీంతో అప్పట్లో టిడిపి వశం కాకుండా ఆ స్థలాన్ని కాపాడుకోగలిగారు.

అయితే తాజా ఎన్నికల్లో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. మళ్లీ పావులు కథపడం ప్రారంభించింది. ప్రభుత్వం తమ చేతుల్లో ఉండడంతో ఆ స్థలాన్ని 99 ఏళ్లకు లీజు ప్రాతిపదికన టిడిపి జిల్లా కేంద్ర కార్యాలయం నిర్మాణానికి కేటాయిస్తూ మంత్రివర్గం సైతం తీర్మానించింది. తాజాగా ఈ కార్యాలయాన్ని కడప తాసిల్దార్ టిడిపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డికి అప్పగించారు. ఎంతో విలువైన స్థలాన్ని ఒక పార్టీ కార్యాలయం కోసం ఇవ్వడం పై కడప నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 99 సంవత్సరాలకు 80 కోట్లకు పైగా విలువైన స్థలాన్ని లీజు ప్రాతిపదికన ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. అయితే దీనిపై న్యాయపోరాటం చేస్తామని వైసిపి నేత, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చెబుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!