నారా లోకేష్ ను ప్రశాంత్ కిషోర్ కలిశారా? ఎందుకు కలిసుంటారు? వారి మధ్య జరిగిన చర్చలేంటి? ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు నారా లోకేష్. కేంద్ర మంత్రులను వరుసగా కలుస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టులు, అవసరాలపై చర్చిస్తున్నారు. అయితే ఇంతలో రాజకీయాల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నారా లోకేష్ ను కలిసినట్లు తెలుస్తోంది. వారి మధ్య చాలా అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఎన్నికలకు ముందు నుంచి తెలుగుదేశం పార్టీ విషయంలో సానుకూలంగా ప్రకటనలు చేశారు ప్రశాంత్ కిషోర్. ఏపీలో జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని కూడా తేల్చి చెప్పారు. వైసీపీకి సీట్లు కూడా తగ్గిపోతాయని చెప్పారు. అయితే ప్రశాంత్ కిషోర్ టీం ఎన్నికలకు ముందు ఆరు నెలల కిందట నుంచి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కానీ బయటకు మాత్రం రాబిన్ శర్మ టీమ్ మాత్రమే పని చేసినట్లు ప్రచారం నడిచింది. కానీ ప్రశాంత్ కిషోర్ నేరుగా రంగంలోకి దిగింది తక్కువ. ఆ టీం ఏపీలో పని చేసింది ఎక్కువ.
దేశంలో ఒక పదిమంది వరకు ముఖ్యమంత్రులకు ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. మమతా బెనర్జీ, స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, కెసిఆర్, జగన్మోహన్ రెడ్డి.. ఇలా చాలామంది పవర్ లోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే కారణం. అయితే బీహార్లో జన సూరజ్ అనే పార్టీని స్థాపించారు ప్రశాంత్ కిషోర్. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ పోటీ చేయనుంది. ఇప్పటికే బీహార్లో ఆర్జెడి, జెడియు, బిజెపి, కాంగ్రెస్ బలమైన పార్టీలుగా ఉన్నాయి. వాటిని ఢీ కొట్టాలంటే ప్రశాంత్ కిషోర్ కు చిన్న విషయం కాదు. తాను ఇతర పార్టీలను గెలిపించవచ్చు కానీ.. తాను సొంతంగా గెలవాలంటే కుదిరే పని కాదు. పైగా ఎన్నికలను ఎదుర్కోవాలంటే భారీగా డబ్బులు అవసరం. వాటి కోసమే ఆయన అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే నారా లోకేష్ తో భేటీ అయినట్లు సమాచారం.
ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన అన్ని పార్టీల నుంచి ఫండింగ్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. తనకు ఇతర ఆదాయ మార్గాలు ఏవీ లేవని.. కేవలం రాజకీయ వ్యూహకర్తగా మాత్రమే వచ్చే ఆదాయంతోనే పార్టీని నడుపుతానని బీహార్లో పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు ప్రశాంత్ కిషోర్. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పార్టీకి టిడిపి ఫండింగ్ చేయడం ఏమిటని బిజెపి ప్రశ్నిస్తోంది. ఇది ముమ్మాటికి మిత్ర ధర్మాన్ని విస్మరించడమేనని వ్యాఖ్యానిస్తోంది. ఈ పరిణామంతో తప్పకుండా కూటమిలో అభిప్రాయ బేధాలు రావడం ఖాయమని తెలుస్తోంది. లోకేష్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారన్న వార్త హస్తిన వర్గాల్లో సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. సంబంధాలు ఉండి ఉండవచ్చు కానీ.. ఇలా నేరుగా భేటీలు కావడం ఏంటని.. అది కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట లోకేష్ లాంటి నేత పీకే ను కలిస్తే పరోక్ష సంకేతాలు వెళ్తాయని బిజెపి నేతలు అభిప్రాయపడుతున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి అన్నట్టు ఉంది. ప్రశాంత్ కిషోర్ న్యూట్రల్ గా వెళ్తున్నారు. ఒంటరి పోరాటానికి మొగ్గు చూపుతున్నారు. గతంలో ఆయన జేడీయూలో పనిచేశారు. కానీ నితీష్ కుమార్ పెద్దగా ఆయన పట్ల ఆసక్తి చూపలేదు. నితీష్ కుమార్ తో బేధాభిప్రాయాలు ఏర్పడడంతో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూశారు. కానీ కాంగ్రెస్ నుంచి ఆశించిన స్థాయిలో అనుకూలత రాలేదు. దీంతో సొంతంగానే పార్టీ ఏర్పాటు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే గతంలో చాలా పార్టీలకు ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. కానీ వారు ఎవరితోనూ భేటీ జరగలేదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట లోకేష్ ను ప్రశాంత్ కిషోర్ నేరుగా కలవడం వెనుక ఎలక్షన్ ఫండింగ్ అడిగేందుకు అని టాక్ నడుస్తోంది. బిజెపి దీనిపై ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.