ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడు. నందమూరి తారక రామారావు పిలుపుమేరకు టిడిపిలో చేరారు. యువకుడు ఆపై తెలివైనవాడు కావడంతో ఎన్టీఆర్ కూడా ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. అలా 1983 ఎన్నికల నుంచి 99 వరకు ఆయన టిడిపి తరఫున గెలుస్తూనే ఉన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే క్యాబినెట్లో తొలి పేరు ఆయనదే. చంద్రబాబు సైతం అదే పరంపరను కొనసాగించారు. కానీ ఈసారి మాత్రం ఆనవాయితీకి బ్రేక్ పడింది. దీంతో ఆ సీనియర్ నేత పడుతున్న బాధ అంతా కాదు. లోలోపల తెగ రగిలిపోతున్నారు. అధినేత చంద్రబాబు తీరును తప్పుపడుతున్నారు. తనను పక్కన పెట్టేయడం పై ఆగ్రహంగా ఉన్నారు. ఇంతకీ ఎవరు ఆ నేత? ఏంటా కథ? అంటే ఈ స్టోరీ చూసేయాల్సిందే.
తెలుగుదేశం పార్టీ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు నారా చంద్రబాబు. ఇప్పుడిప్పుడే లోకేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే చంద్రబాబు తర్వాత ఎవరు అంటే చాలామంది పేర్లు వినిపించేవి. కానీ అందరికంటే ముందు ఉండే పేరు యనమల రామకృష్ణుడు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కూడా. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు ఉన్నతికి కారణం ఆయనే. 1995లో టిడిపి సంక్షోభంలో యనమల స్పీకర్ గా ఉండేవారు. నందమూరి తారక రామారావు నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకునే క్రమంలో చంద్రబాబు వైపు నిలబడ్డారు యనమల. ఆ కృతజ్ఞతతోనే చంద్రబాబు యనమల రామకృష్ణుడు కు ఎనలేని ప్రాధాన్యమిచ్చేవారు. 2014లో ఎమ్మెల్సీగా ఉన్న యనమల రామకృష్ణుడు కు మంత్రి పదవి ఇచ్చారు. ఆయనకు ఇష్టమైన ఆర్థిక శాఖను చేతిలో పెట్టారు.
అయితే ఈ ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తన కుమార్తె దివ్యకు తుని అసెంబ్లీ సీటు ఇప్పించుకున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తారని భావించారు. కనీసం రాజ్యసభకు పంపిస్తారని కూడా ఆశించారు. కానీ అవేవీ జరగడం లేదు. ఇప్పుడు జరుగుతున్న నియామకాలన్నీ లోకేష్ టీం తోనే పూర్తి చేస్తున్నారు. కనీసం యనమల లాంటి సీనియర్లకు ప్రాధాన్యం దక్కడం లేదు. గతం మాదిరిగా చంద్రబాబు తనకు సమయం ఇవ్వడం లేదు. తన సేవలను కూడా వినియోగించుకోవడం లేదు. దీనిని అవమానంగా భావిస్తున్నారు యనమల రామకృష్ణుడు.
మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో యనమల రామకృష్ణుడు ప్రభావం తగ్గుతోంది. ఆయన మాటలను ఖాతరు చేసేవారు కరువవుతున్నారు. అక్కడ అంతా పవన్ కళ్యాణ్ హవా నడుస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం లోకేష్ నాయకత్వాన్ని జై కొడుతుంది. అక్కడ లోకేష్ మనిషి సానా సతీష్ ఎంటర్ అయ్యారు. ఆయన చెప్పిందే జరుగుతోంది. గతం మాదిరిగా యనమల మాట వినేది కూడా ఎవరు లేరు. పార్టీలో కూడా ఆయన ఒంటరి అయ్యారు. ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. మరోవైపు సానా సతీష్ చుట్టూ టిడిపి టీం నడుస్తోంది. సహజంగానే ఇది యనమల రామకృష్ణుడు కు ఇబ్బంది పెడుతోంది. అందుకే ఈ వయసులో పార్టీపై కక్కలేక మింగలేక ఆయన లోలోపల రగిలిపోతున్నారు. తన సన్నిహితుల ద్వారా తన పరిస్థితిని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అటు నుంచి ఎటువంటి సంకేతాలు రాకపోవడంతో తీవ్ర అంతర్మదనంలో ఉన్నారు. మున్ముందు యనమల రామకృష్ణుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.