Monday, February 10, 2025

టిడిపి పై అసంతృప్తితో రగిలిపోతున్న ఆ సీనియర్ నేత

- Advertisement -

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అసంతృప్తితో ఉన్నారా? అనవసరంగా టిడిపిలో చేరానని భావిస్తున్నారా? కమ్మ సామాజిక వర్గం తనను అడ్డగించడం పై ఆగ్రహంతో ఉన్నారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఈ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు లక్ష్మీనారాయణ. మంత్రి పదవి ఆశించారు. కానీ రాజకీయ సమీకరణలో భాగంగా పదవి దక్కకుండా పోయింది. అయితే తనకు పదవి రాకపోవడం వెనుక కమ్మ సామాజిక వర్గం నేతలు ఉన్నారన్నది కన్నా లక్ష్మీనారాయణ లో అనుమానం. ముఖ్యంగా గుంటూరు జిల్లాకు చెందిన ఇతర నేతలతో ఆయనకు అంతగా పొసగడం లేదు. పైగా తన కుమారుడి విషయంలో లేనిపోని ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదనతో ఉన్నారు. అందుకే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రచారం నడుస్తోంది.

స్వశక్తితోనే కన్నా లక్ష్మీనారాయణ రాజకీయంగా ఎదిగారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలు ప్రారంభించారు. 1973లో గుంటూరు జిల్లా స్టూడెంట్ లీడర్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. యువజన కాంగ్రెస్లో క్రియాశీలకంగా ఎదిగారు. 1989 లో గుంటూరు జిల్లా పెద్దకూరపాడు నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అటు తరువాత 2004 వరకు అదే నియోజకవర్గ నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచి రికార్డు సృష్టించారు. 2009లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. మొత్తం ఐదు సార్లు గెలిచిన కన్నా లక్ష్మీనారాయణ మంత్రిగా సుదీర్ఘకాలం పని చేశారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వాల్లో కీలక పోర్టు పోలియో శాఖలను దక్కించుకున్నారు. 1994లో ఎన్టీఆర్ ప్రభంజనంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయింది. కేవలం 26 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. అయితే అందులో కన్నా లక్ష్మీనారాయణ ఒకరు కావడం విశేషం. 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కన్నా లక్ష్మీనారాయణ కీలక మంత్రిత్వ శాఖను దక్కించుకున్నారు. అటు తరువాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో సైతం మంత్రిగా పనిచేశారు.

అయితే రాజకీయాలకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకునే కన్నా లక్ష్మీనారాయణ 2014లో మాత్రం రాంగ్ స్టెప్ వేశారు. జగన్ వైసీపీలోకి రావాలన్న పిలుపును లెక్క చేయలేదు. నాడే ఆయన వైసీపీలో చేరి ఉంటే పార్టీలో నెంబర్ 2 గా ఎదగడం ఖాయం. కానీ ఆయన బిజెపిలో చేరారు. ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. 2019లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష స్థానానికి రాజీనామా చేశారు. ఈ ఎన్నికలకు ముందు బిజెపికి రాజీనామా చేసి టిడిపిలో చేరారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కానీ ఆయనకు మంత్రి పదవి లభించలేదు. పైగా దివంగత కోడెల శివప్రసాదరావు కుమారుడు నుంచి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

కమ్మ సామాజిక వర్గం చేస్తున్న రాజకీయాలతో తీవ్ర మనస్తాపంతో ఉన్నారు కన్నా లక్ష్మీనారాయణ. పార్టీ కార్యకలపాలకు సైతం దూరంగా ఉంటున్నారు. తన కుమారుడిపై అవినీతి ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన సీనియారిటీ కి తగిన పదవి ఇవ్వకుండా అవమానించడంతోపాటు.. తన కుటుంబాన్ని వీధిన పాలు చేస్తున్నారన్న బాధ కన్నా లో ఉంది. అందుకే పార్టీలో అసంతృప్తిగానే కొనసాగుతున్నట్లు అనుచరులు చెబుతున్నారు. తన విషయంలో చంద్రబాబు చాలా అన్యాయం చేశారని వాపోతున్నారు. సముచిత స్థానం ఇస్తామని చెప్పి.. పార్టీలో చేరిన తర్వాత పక్కన పెట్టారన్న ఆక్రోషంతో ఉన్నారు. మున్ముందు ఆయన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!