Monday, February 10, 2025

డిప్యూటీ సీఎం కు నో పవర్స్.. అయినా లోకేష్ ఆరాటం ఎందుకు?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఏడు నెలలు అవుతోంది. సీఎం చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణం చేశారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టారు. అయితే గతంలో చాలామంది డిప్యూటీ సీఎంలుగా పని చేశారు. 2014 నుంచి 2019 మధ్య ఇద్దరూ టిడిపి మంత్రులకు డిప్యూటీ హోదా దక్కింది. 2019 నుంచి 24 వరకు అయితే ఏకంగా ఐదుగురికి డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టారు జగన్. కానీ వారు సాధారణ మంత్రులే. పేరుకే డిప్యూటీ సీఎం కానీ.. అదనంగా ఉండే ప్రయోజనాలు ఏవి ఉండవు. కానీ ఇప్పుడు అదే డిప్యూటీ సీఎం పదవి చుట్టూ కూటమి రాజకీయాలు నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మాదిరిగా లోకేష్ కు సైతం డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాల్సిందేనని టిడిపి నేతలు పట్టుబడుతున్నారు. అయితే ఈ రాష్ట్రానికి సీఎంగా పవన్ కళ్యాణ్ కావాలని తమకు ఉందని జనసైనికులు తేల్చి చెబుతున్నారు. లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా రావాలన్నట్టే.. తాము సైతం పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి హోదాలో చూడాలని ఉందని చెప్పడంతో వివాదం మరింత ముదిరింది. ముందుగా టిడిపి హై కమాండ్ ప్రకటన చేసింది. డిప్యూటీ సీఎం విషయంలో ఎవరూ మాట్లాడవద్దని సూచించింది. అయితే అదే సమయంలో జనసేన సైతం ప్రత్యేక ప్రకటన ఇచ్చింది. దీంతో ఈ అంశానికి ఫుల్ స్టాప్ పడింది. కానీ దాని పర్యవసానాలు మాత్రం ఇరు పార్టీల్లో కొనసాగుతున్నాయి.

వాస్తవానికి గతంలో డిప్యూటీ సీఎం హోదా అనేది చాలా చిన్న అంశం. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో డిప్యూటీ సీఎం హోదాకు స్థాయి పెరిగింది. రాజకీయంగా ఒక స్థాయిని పెంచేందుకు దోహదపడుతోంది. ముఖ్యంగా ఏపీలో పవన్ కళ్యాణ్ తన హోదాకు మరింత స్థాయిని తీసుకొచ్చారు. గౌరవ మర్యాదలు పొందుతున్నారు. కేంద్ర నాయకత్వం వద్ద ప్రత్యేక మన్ననలు అందుకుంటున్నారు. అందుకే ఇప్పుడు పవన్ మాదిరిగా లోకేష్కు సైతం డిప్యూటీ హోదా ఇవ్వాల్సిందేనని టిడిపి శ్రేణులు పట్టుబడుతున్నారు. వాస్తవానికి మంత్రిగా సుప్రీం పవర్ అనుభవిస్తున్నారు లోకేష్. అయితే అది అనధికారికంగా మాత్రమే. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కుమారుడిగా, క్యాబినెట్లో కీలక మంత్రిగా, కోటి సభ్యత్వం ఉన్న రాజకీయ పార్టీకి వారసుడిగా… ఇలా అన్ని రకాలుగా గుర్తింపు పొందారు లోకేష్. కానీ ఒక కూటమిలో పెద్ద పార్టీగా ఉంటూ.. అదే కూటమిలో చిన్న పార్టీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వడం… లోకేష్ కు ఇవ్వకపోవడం ఏంటనేది సగటు టిడిపి శ్రేణుల ప్రశ్న. అదే ఇంతటి వివాదానికి కారణం.

భారత రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే ప్రస్తావన ఎక్కడ ఉండదు. ఒక రాష్ట్ర గవర్నర్ తన విధుల నిర్వహణలో సహాయం చేయడానికి, లేకుంటే సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక మంత్రి మండలి ఉంటుంది. అంతకుమించి డిప్యూటీ సీఎం అనే హోదా ప్రస్తావన ఎక్కడ ఉండదు. అందుకే డిప్యూటీ సీఎం పదవితో పాటు వివిధ శాఖలను కేటాయించి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారు. తద్వారా ఆయనకు ప్రత్యేక ప్రోటోకాల్, భద్రత కల్పిస్తారు. అంతకుమించి హక్కులు గాని.. నిధులు కానీ డిప్యూటీ సీఎంకు ఉండవు. క్యాబినెట్ మంత్రులు మాదిరిగానే డిప్యూటీ సీఎం జీతం, ఇతర అలవెన్సులు పొందుతారు. అవసరమైతే కొన్ని ప్రత్యేకమైన భద్రతను కేటాయించవచ్చు. గౌరవ వేతనం మంత్రిత్వ సమానంగా ఉంటుంది. డిప్యూటీ సీఎంకు నిర్దిష్టమైన ఆర్థిక, పరిపాలన అధికారాలు ఉండవు.

అయితే ఎటువంటి ప్రత్యేక అధికారాలు, ప్రయోజనాలు లేని డిప్యూటీ సీఎం హోదా కోసం టిడిపి నేతలు పట్టుబడుతుండడం వెనుక కేవలం భవిష్యత్తు రాజకీయాలు అనేవి ముడిపడి ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అంత స్థాయి కలిగిన నేత లోకేష్ కాదని జనసైనికుల అభిప్రాయం. కానీ పవన్ కంటే పవర్ఫుల్ నాయకుడు లోకేష్ అని టిడిపి నేతలు అభిప్రాయం. ఈ రెండు అభిప్రాయాల మధ్య ఏర్పడుతున్న సంఘర్షణ ఇది. ప్రస్తుతానికి ఈ వివాదానికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడిన.. భవిష్యత్తులో ఇద్దరు నేతలు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కూటమిలో అతిపెద్ద పార్టీగా.. ఆ పార్టీకి చిన్నబాస్ గా లోకేష్ పై ఇప్పుడు భారమంతా ఉంది. ఎమ్మెల్యే అయ్యారు.. మంత్రి బాధ్యతలు తీసుకున్నారు.. రేపు మాపో టిడిపికి వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారు. కానీ డిప్యూటీ సీఎం అనే పదవి వద్దకు వచ్చేసరికి మాత్రం సమాధానం దొరకడం లేదు. మరి భవిష్యత్తులోనైనా అవ్వగలరా? జనసేన అభ్యంతరాలను దాటగలరా? అన్నది భవిష్యత్తులో తేలుతుంది. అప్పటివరకు లోకేష్ తో పాటు తెలుగుదేశం పార్టీకి అది లోటే.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!