Monday, February 10, 2025

త్వరలో జగన్ తో రాహుల్ గాంధీ భేటీ.. కాంగ్రెస్ పెద్దల రాయబారం!

- Advertisement -

వైసీపీ అధినేత జగన్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు రాహుల్ గాంధీ చేస్తున్నారా? త్వరలో సమావేశానికి ప్లాన్ చేస్తున్నారా? జాతీయ అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయానికి వచ్చారా? కాంగ్రెస్ పెద్దలు జగన్ ను సంప్రదించారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఈ గాసిప్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని విభేదించారు జగన్. సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకుని ఏపీలో అధికారంలోకి రాగలిగారు. కానీ ఎన్నికల్లో సీన్ మారింది. వైసిపి అధికారాన్ని కోల్పోయింది. అయితే 40% ఓటు బ్యాంకుతో పటిష్ట స్థితిలో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో అధికారంలోకి వస్తాం అన్న ధీమా కనిపిస్తోంది. ప్రజల్లో కూడా ఆ పార్టీపై అభిమానం చెక్కుచెదరలేదు. కూటమి పార్టీల్లో కలవరపాటుకు అదే కారణం.

అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ.. ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోంది. ఇటువంటి తరుణంలో 2029 ఎన్నికలకు భారీగా ప్లాన్ చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో పట్టు బిగించాలని చూస్తోంది. నమ్మదగిన మిత్రుల కోసం అన్వేషిస్తుంది. ఈ తరుణంలో రాహుల్ గాంధీ చూపు జగన్ పై పడినట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో నమ్మించి మోసం చేశారు చంద్రబాబు. భావి ప్రధాని నువ్వే అంటూ రాహుల్ గాంధీని నమ్మించారు. తీరా ఆ ఎన్నికల్లో ఓడిపోయేసరికి కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా మారి కాంగ్రెస్ పార్టీ పైనే తన ప్రతాపం చూపుతున్నారు. చంద్రబాబు విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు రాహుల్ గాంధీ. అందుకే జగన్ ను కలుపు కెళ్లే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా అతి త్వరలో జగన్ తో భేటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది.

గాంధీ కుటుంబం పట్ల వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఎంతో అభిమానం ఉండేది. ఆ రెండు కుటుంబాల మధ్య అనుబంధం కొనసాగేది. అందుకే 2004లో సుదీర్ఘకాలం పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం తెచ్చారు రాజశేఖర్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడమే కాదు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమయ్యారు దివంగత మహానేత. అందుకే కాంగ్రెస్ పార్టీ సైతం రాజశేఖర్ రెడ్డికి ఎనలేని ప్రాధాన్యమిచ్చింది. వరుసగా రెండుసార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసింది. గాంధీ కుటుంబం పై ఉన్న అభిమానంతో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నది రాజశేఖర్ రెడ్డి లక్ష్యం. ఆ లక్ష్యానికి పాటుపడుతున్న క్రమంలోనే ఆయన అనుకోని ప్రమాదంలో మృతి చెందారు. అటు తర్వాతే జరిగిన రాజకీయ పరిణామాలతో జగన్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. అయితే తండ్రికి తగ్గ తనయుడిగా సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి అధికారంలోకి రాగలిగారు. కాంగ్రెస్ పార్టీని కకవికలాం చేయగలిగారు. అయితే ఇప్పుడు ఆ రెండు పార్టీలు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో రాహుల్ గాంధీ ఒకప్పటి తన కుటుంబ సన్నిహితుడు జగన్ రెడ్డి సాయం కోరుతున్నట్లు సమాచారం. జగన్తో ఒక్కసారి భేటీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పెద్దలకు సూచించినట్లు సమాచారం. అన్ని సవ్యంగా జరిగితే త్వరలో రాహుల్ గాంధీ జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడం ఖాయమని ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత నిజం ఉందో తెలియాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!