వచ్చే ఎన్నికల్లో ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదా? మళ్లీ జగన్ అధికారంలోకి రాబోతున్నారా? ఆ సమాచారం టిడిపి వద్ద ఉందా? గత కొద్ది రోజులుగా టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారంలో అసలు వ్యూహం ఏంటి? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతోంది. ఇంకోవైపు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలన్న వ్యూహంలో ప్రభుత్వం ఉంది. అమరావతి రాజధాని నిర్మాణ పనులు మొదలు పెట్టాలని భావిస్తోంది. ఇందుకు భారీగా నిధులు సమకూర్చుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం సైతం బడ్జెట్లో 15000 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రపంచ బ్యాంకుతోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి ఈ మొత్తాన్ని అందించేందుకు నిర్ణయించింది. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సైతం అమరావతిని సందర్శించి తొలి విడతగా 3000 కోట్లు అందించేందుకు అంగీకారం తెలిపారు. మరోవైపు మరో ఆర్థిక సంస్థ హడ్కో 11 వేల కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అమరావతి రాజధాని నిర్మాణం వరకు ఓకే. అయితే ఎటోచ్చి ఏపీలో పరిశ్రమలు పెట్టే యాజమాన్యాల ఆందోళనను సముదాయించలేకపోతోంది కూటమి సర్కార్.
ఇటీవల టిడిపి అనుకూల మీడియాలో ఒక రకమైన ప్రకటనలు ఎక్కువగా వస్తున్నాయి. పరిశ్రమలు పెడతాం సరే.. 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి అని పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తున్నారన్నది ఆ వార్తల సారాంశం. అదే పనిగా టిడిపి అనుకూల మీడియా ప్రాజెక్ట్ చేస్తోంది ఈ అంశాన్ని. అయితే దాని వెనుక వ్యూహం ఉండవచ్చు కానీ.. ఏపీలో 2029 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాలేదని వారికి వారే ఒప్పుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. అమరావతిలో ఒక బడా పారిశ్రామిక సంస్థ.. తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకు వచ్చింది. సీఎం చంద్రబాబు వద్ద తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. అయితే గత అనుభవాల దృష్ట్యా 2029 వరకు సాధ్యమయ్యే పనులను మాత్రమే చేస్తామని.. అంతకుమించి భారీగా పెట్టుబడులు పెట్టలేమని సదరు సంస్థ తేల్చి చెప్పినట్లు సమాచారం. అయితే దీనికి సీఎం చంద్రబాబు గ్యారెంటీ ఇవ్వలేదని.. తామే అధికారంలోకి వస్తామని కచ్చితంగా చెప్పలేకపోయారని అంతర్గతంగా చర్చ నడుస్తోంది. దీంతో తప్పకుండా వారి వద్ద సమాచారం ఉందని.. ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు తిరస్కరించే పరిస్థితి కనిపిస్తోందని టాక్ ప్రారంభం అయింది.
మొన్నటికి మొన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏపీలో పర్యటించారు. ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చిన ఆయన నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్లారు. కీలక చర్చలు జరిపారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి సైతం ఈ భేటీలో పాల్గొన్నారు. అక్కడే రాత్రి భోజనం చేశారు. అయితే వారి మధ్య ఆసక్తికర చర్చ వచ్చినట్లు సమాచారం. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని.. మళ్లీ 2029లో జగన్ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రాకపోయినా.. కేంద్రంలో మాత్రం బిజెపి నాలుగోసారి అధికారంలోకి వస్తుందని చెప్పాలని.. అమరావతి లో పెట్టుబడులకు మాది భరోసా అని పారిశ్రామికవేత్తలకు హామీ ఇవ్వాలని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కేంద్రమంత్రి అమిత్ సాను కోరినట్లు ప్రచారం నడుస్తోంది. అంటే కేంద్రంలో బిజెపి వరకు ఓకే కానీ.. ఏపీలో కూటమి సర్కార్ వచ్చే అవకాశం లేదని వారికి ముందే తెలిసిపోయిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు తెలుగుదేశం మీడియా సైతం అదే పనిగా చెబుతుండడం కూడా కొత్త అనుమానాలకు తావిస్తోంది.