కొడాలి నాని.. వైసీపీ ఫైర్ బ్రాండ్.. ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు. అంతగా పాపులర్ అయ్యారు కొడాలి నాని. తెలుగుదేశం పార్టీలో రాజకీయ ఓనమాలు దిద్దుకుని.. వైసీపీ లోకి ఎంట్రీ ఇచ్చారు. తన హవాను కొనసాగించారు. చంద్రబాబుతో పాటు లోకేష్ లపై విరుచుకు పడడంలో ముందుండే వారు నాని. జగన్ పై పల్లెత్తు మాట కూడా పడకుండా అడ్డంగా నిలబడి పోయేవారు. చంద్రబాబు అండ్ కోను విమర్శించాలంటే వైసిపి ప్రయోగించే మొదటి అస్త్రం నాని. కానీ వైసీపీ ఓడిపోయిన తర్వాత కొడాలి నాని సైలెంట్ అయ్యారు. ఎక్కడా కనిపించడం లేదు. కొడాలి నాని రాజకీయ సన్యాసం చేశారని ప్రచారం ప్రారంభమైంది. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని టాక్ నడుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో ఆయన విషయంలో మరో అప్డేట్ వచ్చింది. త్వరలో పొలిటికల్ గా యాక్టివ్ కావాలని కొడాలి నాని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
గుడివాడ అంటే కొడాలి నాని.. కొడాలి నాని అంటే గుడివాడ అన్న పరిస్థితి ఉండేది. కానీ ఈ ఎన్నికల్లో అంతా తారు మారయింది. అసలు ఓటమి అన్న మాట ఎరుగని కొడాలి నాని దారుణంగా ఓడిపోయారు. 50 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. 2004 నుంచి 2019 వరకు గుడివాడలో జైత్రయాత్ర కొనసాగించారు కొడాలి నాని. నందమూరి తారక రామారావు తర్వాత గుడివాడ పై అంతలా ముద్ర చాటుకున్నారు. టిడిపి నుంచి రెండుసార్లు, వైసీపీ నుంచి రెండుసార్లు విజయం సాధించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, ఆపై వాయిస్ ఉండడంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు జగన్. దీంతో కొడాలి నాని పాపులారెడ్డి ఒక్కసారిగా పెరిగిపోయింది. తెలుగుదేశం పార్టీపై విరుచుకు పడడంలో ముందుండేవారు. మూడు రాజధానుల విషయంలో సాహసంగా తన మద్దతు ప్రకటించారు కొడాలి నాని. సొంత ప్రాంతానికి వ్యతిరేకం అవుతున్న వెనక్కి తగ్గలేదు. జగన్ విషయంలో అంతలా ఉండేవారు కొడాలి నాని.
అయితే గుడివాడలో కొడాలి నాని ఓడిపోవడం, వైసిపి అధికారం కోల్పోవడంతో కొడాలి నాని సైలెంట్ అయ్యారు. గుడివాడలో అడుగుపెట్టడం మానేశారు. ఈ ఆరు నెలల్లో రెండు మూడు సార్లు మాత్రమే నాని గుడివాడ వచ్చారు. అయితే అప్పుడు కూడా కార్యకర్తలకు కలవలేదు. నాని ఎక్కువగా హైదరాబాదులోనే గడుపుతున్నారు. ఆ మధ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు అనే వార్తలు హల్చల్ చేశాయి. దీంతో కొడాలి నాని ఇక ఆక్టివ్ పాలిటిక్స్ చేయకపోవచ్చునే టాక్ నడిచింది. ఒకటి రెండు సార్లు మాత్రమే అధినేత జగన్ ను కలిశారు. పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు. అటు తరువాత కలిసిన దాఖలాలు లేవు. కనీసం గుడివాడలో పార్టీ కార్యకలాపాలు కూడా జరగడం లేదు.
అయితే కొడాలి నాని ఫిబ్రవరి నుంచి పార్టీలో యాక్టివ్ అవుతారని తెలుస్తోంది. వైసిపి అధినేత జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వారానికి రెండు రోజులపాటు గడపాలని జగన్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గ ఇన్చార్జి తో పాటు క్రియాశీలక నాయకులకు కలుస్తారు జగన్. పార్టీ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని గన్నవరం, గుడివాడ, మైలవరం తదితర నియోజకవర్గాల ఇన్చార్జి లకు ప్రత్యేకంగా సమాచారం పంపారు. అందులో భాగంగా కొడాలి నాని కి సైతం సమాచారం అందించారు. అయితే తాను ఫిబ్రవరి నుంచి యాక్టివ్ అవుతానని.. సిద్ధంగా ఉన్నానని కొడాలి నాని సంకేతాలు పంపినట్లు సమాచారం. ఈ విషయం గుడివాడ వైసీపీ శ్రేణుల్లో ప్రచారం జరిగింది. వారిలో కొత్త ఉత్సాహం నెలకొంది. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాముపై అప్పుడే వ్యతిరేకత ప్రారంభమైన నేపథ్యంలో కొడాలి నాని సూపర్ ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది.
కొడాలి నాని సేవలను కృష్ణాజిల్లాలో పార్టీకి వినియోగించుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో కృష్ణాజిల్లాలో పట్టు బిగించాలని జగన్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి వైసిపిని అజేయమైన శక్తిగా మార్చాలని చూస్తున్నారు. అందుకు సంబంధించి బాధ్యతలను కొడాలి నానికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే కొడాలి నాని వైసీపీలో యాక్టివ్ కావడం ఖాయమని తేలిపోయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, వైసీపీ శ్రేణులు తెగ ఆనందంతో ఉన్నాయి.