ఆంధ్రప్రదేశ్లో కులాల చుట్టూ రాజకీయాలు తిరుగుతాయి. అది కాదనలేని సత్యం కూడా. ఒక్కో కులం ఒక్కో పార్టీకి మద్దతుగా నిలుస్తుంటాయి. తెలుగుదేశం పార్టీకి కమ్మ సామాజిక వర్గం.. కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చాయి. వైసిపి ఆవిర్భావం తర్వాత రెడ్డి సామాజిక వర్గం ఆ పార్టీకి మద్దతుగా నిలిచింది. అయితే కాపుల అభిప్రాయం మాత్రం ప్రతి ఎన్నికకు మారుతూ వస్తోంది. కాపులు మద్దతు తెలిపిన వారికి రాజ్యాధికారం దక్కుతూ వచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీకి రెడ్డి సామాజిక వర్గం ఆశించిన స్థాయిలో పనిచేయలేదు. కానీ కూటమి పార్టీలకు మాత్రం కమ్మ సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గం ఏకపక్షంగా మద్దతు తెలిపింది. కూటమి అంతులేని విజయానికి అదే కారణంగా మారింది.
అయితే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గంలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. తమది అనుకున్న వైసీపీని గెలిపించుకోలేకపోయారు. తమ విషయంలో ఇప్పుడు కూటమి పార్టీలపై పెరుగుతున్న ఒత్తిడి వారిలో ఒక రకమైన ఆందోళనకు కారణం అవుతోంది. వాస్తవానికి రెడ్డి సామాజిక వర్గం విషయంలో తాను చేసిన తప్పిదాలను గుర్తు చేసుకుంటున్నారు జగన్. మళ్లీ వారిని అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అదే సమయంలో రెడ్డి సామాజిక వర్గం పై నోరు పారేసుకుంటున్నారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. రెడ్డి సామాజిక వర్గం ఒకేసారి రావడానికి కారణం అవుతున్నారు. వైసిపి హయాంలో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఇబ్బంది పడిన మాట వాస్తవమే. అయితే ఆయన తాజాగా చేసిన కామెంట్స్ జగన్కు ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో జగన్ను మరోసారి సీఎం కాకుండా అడ్డుకోవడానికి కమ్మవారంతా పనిచేయాలని ఆయన పిలుపునివ్వడం గమనార్హం. ఇటీవల కమ్మ సామాజిక వర్గానికి చెందిన సంఘాల సమావేశాల్లో వెంకటేశ్వరరావు మాట్లాడారు. జగన్ పై నోరు పారేసుకున్నారు. జగన్ వరకు తిడితే పర్వాలేదు.. దానిని రాజకీయ కోణంలో చూడవచ్చు కానీ.. ఏకంగా కమ్మ ప్రస్తావన తీసుకొచ్చారు. తద్వారా మనకెందుకు ఆస్పృహ ఉండకూడదు అని రెడ్డి సామాజిక వర్గంలో సరికొత్త ఆలోచనను తీసుకొచ్చారు. ఇప్పుడు వెంకటేశ్వరరావు మాటలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగుల్లో ఆగ్రహానికి కారణమవుతున్నాయి. కేవలం ఉద్యోగులకు అన్యాయం చేశారన్న ఒకే ఒక్క కారణంతో జగన్ ను వద్దనుకున్నామని.. కానీ పెద్ద తప్పు చేశామని ఆ సామాజిక వర్గం ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జగన్ ను ఓడించడంలో రెడ్డి సామాజిక వర్గం కూడా ఉంది. ఆ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులు ఉపాధ్యాయులు సైతం కూటమికి జై కొట్టారు. పైగా రెడ్డి సామాజిక వర్గం నేతలు 2019 ఎన్నికలు మాదిరిగా పని చేయలేదు. అయితే కూటమికి జై కొట్టిన.. తమ కులాన్ని కమ్మ సామాజిక వర్గం దూషించడం ఏంటి అని వారంతా బాధపడుతున్నారు. అనవసరంగా జగన్ ను దూరం చేసుకున్నామన్న బాధ వారిలో వ్యక్తం అవుతోంది. అదే సమయంలో జగన్ నుంచి సైతం అదే ఆవేదన వ్యక్తం కావడంతో.. రెడ్డి సామాజిక వర్గమంతా ఇప్పుడు సంఘటితం అవుతోంది. జగన్ పట్ల రెడ్డి సామాజిక వర్గం ఉద్యోగులు, ఉపాధ్యాయులు సైతం సాఫ్ట్ అవుతున్నారు. తాము తమ సొంత పార్టీగా భావించే వైసీపీని వ్యతిరేకించి కూటమికి జై కొడితే.. తమ సామాజిక వర్గాన్ని కించపరుస్తారా అంటూ వారు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. మరోవైపు రాయలసీమలో సైతం క్షేత్రస్థాయిలో కూటమి పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. మొత్తానికి అయితే కమ్మ సామాజిక వర్గం జేజేతుల జగన్కు ఆయుధాన్ని ఇస్తున్నట్లు అయ్యింది.