Monday, February 10, 2025

టిడిపిలో సీనియర్ల శకం ముగిస్తున్న లోకేష్

- Advertisement -

తెలుగుదేశం పార్టీలో ఒక శకం ముగిసినట్టే. సీనియర్ లీడర్లు, సూపర్ సీనియర్ లీడర్లు పక్కకు తప్పుకునే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా లోకేష్ టీం తెరపైకి వస్తోంది. లోకేష్ ను దృష్టిలో పెట్టుకొని పార్టీలో సమూల ప్రక్షాళనకు దిగుతున్నారు చంద్రబాబు. త్వరలో పోలీట్ బ్యూరో ను సైతం మార్చేస్తారని ప్రచారం నడుస్తోంది. పార్టీలో చాలామంది నేతలు ఎన్టీఆర్ సన్నిహితులు ఉన్నారు. చంద్రబాబుకు సమకాలీకులు ఉన్నారు. కొందరు ఈ ఎన్నికల్లో పక్కకు తప్పుకున్నారు. మరికొందరిని పక్కకు తప్పించారు. అయితే ఇదంతా లోకేష్ కోసమేనని సీనియర్లు భావిస్తున్నారు. అయితే కొంతమందిని పొమ్మనలేక పొగ పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో సీనియర్లను బయటకు పంపించి ఆ స్థానంలో తన మనషులను పెట్టుకోవాలని లోకేష్ భావిస్తున్నారు.

పార్టీలో అత్యున్నత విభాగంగా భావించే పొలిట్ బ్యూరోతోపాటు జాతీయ, రాష్ట్ర కమిటీ లో ఉన్న సీనియర్ నేతలకు త్వరలో ఉద్వాసన పలుకుతారని పార్టీలో ప్రచారం నడుస్తోంది. కేవలం సీనియర్ నేతల కుమారులకు, తన సామాజిక వర్గం సొంత నేతలను పెట్టుకునేందుకు లోకేష్ ఆలోచన చేస్తున్నారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, గంటి హరీష్ మాధుర్, దీపక్ రెడ్డి వంటి వారికి లోకేష్ టీం లో అత్యంత ప్రాధాన్యం దక్కుతోంది. వాస్తవానికి పార్టీలో సీనియర్ల హవా తగ్గింది. వారి మాట చెల్లుబాటు కూడా కావడం లేదు. లోకేష్ అండదండలు ఉన్న నేతలు, ఆయనకు నచ్చిన వారికి పార్టీలో అవకాశాలు దక్కుతున్నాయి. చంద్రబాబు కూడా కుమారుడి మాట కాదనలేని పరిస్థితి. దీంతో పార్టీ సీనియర్లలో అసహనం వ్యక్తం అవుతోంది. గత ఎన్నికల్లో సీట్ల కేటాయింపు కూడా చాలా వరకు లోకేష్ ఇష్టప్రకారమే జరిగింది. అప్పట్లో డబ్బులు వసూలు చేసి టిక్కెట్లు కేటాయించారన్న విమర్శలు కూడా వచ్చాయి. మంత్రివర్గ కూర్పులో కూడా లోకేష్ మాటే చెల్లుబాటు అయ్యింది.

ఇప్పుడు తాజాగా పార్టీ కార్యవర్గ నియామకాల్లో సైతం లోకేష్ తనవారికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారట. పోలిట్ బ్యూరోను తన చెప్పు చేతల్లోకి తీసుకోవడానికి లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పొలిట్ బ్యూరోలో సీనియర్ నాయకులుగా ఉన్న అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నేతలు ఉన్నారు. వీరికి ప్రభుత్వంలో ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. యనమల రామకృష్ణుడికి ఇటీవల పార్టీలో ఆదరణ తగ్గింది. చాలామంది ప్రాధాన్యత తగ్గడం వెనుక లోకేష్ ఉన్నారన్నది ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ఏకంగా పార్టీలో సీనియర్లను పక్కనపెట్టి జూనియర్లను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని లోకేష్ పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే చాలా జిల్లాల్లో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది.

ఇప్పుడు సీనియర్లుగా ఉన్న చాలామంది మంత్రుల్లో సైతం అసంతృప్తి ఉందట. వారి మాట అస్సలు చెల్లుబాటు కావడం లేదట. పేరుకే మంత్రులం కానీ కనీస అధికారాలు లేవని వారంతా బాధపడుతున్నారట. కేవలం కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం సీనియర్లను చంద్రబాబు పట్టించుకోవడం లేదట. ఇదే మాదిరిగా ముందుకు సాగితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీలోనే ప్రచారం నడుస్తోంది. మున్ముందు టిడిపిలో చాలా రకాల పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!