టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండోసారి గెలవాలని టీమిండియా ఫాన్స్ దాదాపు 15 యేళ్ళుగా ఎదురు చూస్తున్నారు. తొలి ఎడిషన్ లో విజేతగా నిలిచిన తర్వాత మళ్లీ ట్రోఫీ భారత్ గెలవలేక పోయింది.గతేడాది అయితే తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. దీంతో ఈసారి ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ గెలిచి తమ నిరీక్షణకు తెరదించుతారని ఫాన్స్ నమ్మకంగా ఉన్నారు. అయితే ఈసారి జరగబోతున్న వరల్డ్‌కప్‌పై మాత్రం భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో టీ20ల్లో ఇండియా ఆటతీరు చాలా మెరుగైంది. అయితే ట్రోఫీ గెలవాలంటే చాలా చేయాలని కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వరల్డ్‌కప్ గెలవక చాలా రోజులు అవుతోందనీ, ఈ సారి సాధిస్తామని, దాని కోసం కొన్ని విషయాలలో మెరుగవ్వాల్సిన అవసరం ఉందన్నాడు.
ఇప్పుడే మరీ ఎక్కువగా
సెమీఫైనల్, ఫైనల్స్ గురించి ఆలోచించకూడదన్నాడు.. తలపడబోయే ఒక్కో టీమ్‌పై దృష్టి సారించాలనీ, దానికోసం అత్యుత్తమంగా సిద్ధం కావడానికి ప్రయత్నించాలన్నాడు.. ఒక్కో టీమ్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధం కావడంపైనే దృష్టిసారిస్తామనీ చెప్పుకొచ్చాడు. ఆటగాళ్లు అందరూ ప్రశాంతంగా గేమ్ పై దృష్టి పెట్టాలని సూచించాడు. ఇక
జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం గొప్ప గౌరవమనీ చెప్పాడు. కెప్టెన్‌గా తన తొలి ప్రపంచకప్ కాబట్టి పరిస్థితులు సవాలుగా ఉంటాయన్నాడు.
ఇక తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఆడనుండడం సవాల్ గా చెప్పుకొచ్చాడు. అయితే రిలాక్స్ గా బరిలోకి దిగితేనే ఫలితం పాజిటివ్ గా వస్తుందన్నాడు.రోహిత్ సారథ్యంలో టీమిండియా. శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై సిరీస్‌లు గెలిచింది. ఆసియా కప్‌లో చేదు అనుభవం ఎదురైనా.. తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలను చిత్తు చేసి కాన్ఫిడెంట్‌గా వరల్డ్‌కప్ రేసులో దిగబోతోంది. ఈ మెగాటోర్నీలో అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడబోతోంది.