ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది తెలుసుకునేందుకు చాలా సర్వేలు జరుగుతున్నాయి. ప్రతి నెల సర్వేలు చేస్తూ మారుతున్న ఓటర్ల మూడ్‌ను పసిగట్టే ప్రయత్నం చేస్తున్నాయి సర్వే సంస్థలు. ఇందులో భాగంగా ఈ నెల మొదటి వారంలో ఒక ప్రముఖ సర్వే సంస్థ చేసిన సర్వే ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రజల ఆలోచనా సరళి ఏంటి, ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు, టీడీపీ – జనసేన ప్రభావం ఎలా ఉండనుందనే అంశాలను ఈ సర్వే కవర్ చేసింది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి ఓటు వేస్తారని అడిగిన ప్రశ్నకు ప్రాంతాలు, వర్గాలవారీగా ప్రజల అభిప్రాయాల్లో కొంత మార్పు కనిపించింది. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లోని ఏబోవ్ మిడిల్ క్లాస్‌లో ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలుస్తోంది. ప్రభుత్వం అభివృద్ధి కంటే ఎక్కువగా పథకాలకే ప్రాధాన్యత ఇస్తుందనే భావన వీరిలో వ్యక్తమవుతోంది. వీరిలో ఎక్కువ మంది టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ అభిప్రాయం కూడా ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి లాంటి నగరాల్లోనే కనిపిస్తోంది. ఇతర నగరాల్లోని ఏబోవ్ మిడిల్ క్లాస్‌లో ఎక్కువ మంది ప్రభుత్వం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇక, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వానికి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. గ్రామీణ ప్రజలు 60 నుంచి 70 శాతం మంది ప్రభుత్వం పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే గ్రామీణ ప్రాంత ప్రజలు ఏకపక్షంగా వైసీపీ వైపు ఉన్నారు. కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ వైసీపీకే ఆధిక్యత కనిపిస్తున్నా ఇతర జిల్లాల కంటే కొంచెం తక్కువగా ఉన్నట్లు ఈ సర్వే తేల్చింది.
యువతలో మాత్రం భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. యువతలో తెలుగుదేశం పార్టీకి ఆదరణ చాలా తక్కువగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. చదువుకుంటున్న యువత ఎక్కువగా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. యువతలో వైసీపీ తర్వాతి స్థానంలో జనసేన ఉండటం గమనార్హం. టీడీపీ మూడో స్థానానికే పరిమితమైంది. యువత విషయంలో తప్ప జనసేనకు ఇతర వర్గాల్లో పెద్దగా ఆదరణ లేదని ఈ సర్వేలో తేలింది. అది కూడా కోస్తాలోనే యువత కొంత మేర జనసేన వైపు ఉన్నారని, రాయలసీమ జిల్లాల్లో ఏమంత ఆదరణ లేదని తేలింది.
ఇక, ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ వృద్ధుల్లో మాత్రం 80 శాతానికి పైగా మంది వైసీపీ వైపే ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. తమకు సమయానికి ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారనే సదభిప్రాయం వీరిలో ప్రభుత్వం పట్ల ఉంది. ఇక, రైతుల్లోనూ ప్రభుత్వానికి మంచి ఆదరణ కనిపిస్తున్నది. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలతో పాటు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వర్షాలు బాగా కురుస్తున్నాయని, కాలం బాగా అవుతున్నదనే అభిప్రాయం రైతుల్లో కనిపిస్తున్నట్లు ఈ సర్వే తేల్చింది. అయితే, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే లెక్కలు మాత్రం ఈ సర్వే సంస్థ బయట పెట్టడం లేదు.