రాజకీయాల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు ఎప్పుడూ తన కాళ్ల మీద తాను నిలబడాలని, గెలివాలని కోరుకోరు. అవతలి వారి భుజం మీద ఎక్కి ఊరేగాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే, ఆయన పొత్తు లేనిదే పోటీకి దిగరు. పొత్తుల విషయంలో చంద్రబాబుకు సిద్ధాంతాలు, రాద్ధాంతాలు అంటూ ఏమీ ఉండవు. ఎప్పుడు ఎవరితో పొత్తు తమకు కలిసి వస్తుందని భావిస్తే వారితో కలుస్తుంటారు. అవసరం తీరిందనో, ఉపయోగం లేదనో తెలిస్తే నిర్దాక్షిణ్యంగా వదిలేసి చేతులు దులుపుకుంటారు.
ఉదాహరణకు.. గత ఎన్నికల్లో చంద్రబాబు టీడీపీ తరపున ప్రచారం కోసం జమ్ము కశ్మీర్ నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లాను తీసుకొచ్చుకున్నారు. ఆయన వచ్చి జగన్‌ను తిట్టి, చంద్రబాబు ఇంద్రుడు, చంద్రుడు అని కీర్తించారు. ఇది జరిగిన ఆరు నెలల్లోనే ఆర్టికల్ 370 రద్దు సమయంలో ఫరూఖ్ అబ్దుల్లాను కేంద్ర బలగాలు గృహ నిర్బంధంలో ఉంచాయి. కానీ, చంద్రబాబు కనీసం ఫరూఖ్ అబ్దుల్లాకు ఫోన్ చేసి కూడా మాట్లాడలేదు. చంద్రబాబు ఎంత అవకాశవాదో స్వయంగా ఫరూఖ్ అబ్దుల్లా కొడుకు ఓమర్ అబ్దుల్లానే చెప్పారు. మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌ను కూడా చంద్రబాబు ప్రచారానికి తెచ్చుకున్నారు. వారికి కష్టాలు వచ్చినప్పుడు మాత్రం పెదవి విప్పలేదు.
2014 ఎన్నికల్లో మోదీ హవా నడుస్తుందని గుర్తించిన బాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2019 ఎన్నికల నాటికి మోదీ ప్రాభవం తగ్గిందని, ఏపీలో తనపై ఉన్న వ్యతిరేకతను మోదీపైకి మళ్లిస్తే తాను సేఫ్ కావచ్చని స్కెచ్ వేశారు. వెంటనే మోదీని తిడుతూ కాంగ్రెస్ చంక ఎక్కారు. కాంగ్రెస్‌తో కలిసి పని చేశారు. ఇది బెడిసి కొట్టడంతో వెంటనే మళ్లీ మోదీ భజన మొదలు పెట్టారు. అయినా కొంతకాలం వరకు చంద్రబాబును బీజేపీ పెద్దలు నమ్మలేదు. మళ్లీ కలిసేందుకు ఇష్టపడలేదు. దీంతో సుజనా చౌదరి, సీఎం రమేశ్ వంటి వారితో చాలా ప్రయత్నించినా చంద్రబాబుతో కలవడానికి బీజేపీ అంగీకరించలేదు.
దీంతో ఇటీవల పవన్ కళ్యాణ్‌ను రంగంలోకి దించారు. తన ధూతగా బీజేపీతో పొత్తును సెట్ చేసేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ను పంపించారనే ప్రచారం జరుగుతున్నది. దీంతో ఇటీవల మూడు పార్టీల మధ్య పొత్తు కుదరనున్న వాతావరణం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఇటీవల ప్రకటించారు. ఇంతలోనే కర్ణాటక ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ ఓడిపోయింది. కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో దేశంలో మళ్లీ కాంగ్రెస్‌కు ఊపిరి పోసినట్లయ్యింది.
దీంతో చంద్రబాబు మళ్లీ ప్లేట్ ఫిరాయించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు బీజేపీ కంటే కాంగ్రెస్‌తో కలిస్తేనే మేలు అని ఆయన భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. బీజేపీకి దక్షిణాదిలో బలం తగ్గిపోతున్నదని, వ్యతిరేకత పెరుగుతున్నదని కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత చంద్రబాబు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌కు ఆదరణ పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీతో పొత్తు కంటే కూడా కాంగ్రెస్‌తో కలిస్తే బాగుంటుందని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
బీజేపీతో బలవంతంగా పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఉంది. కనీసం 30 సీట్లు అడగవచ్చు. ఇన్ని సీట్లు ఇవ్వడం చంద్రబాబుకు కుదరదు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే మహా అయితే ఐదు సీట్లకు మించి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మోదీని, బీజేపీని వ్యతిరేకిస్తున్న సెక్యులర్‌వాదులు, ముస్లిం మైనారిటీలు, క్రిష్టియన్లు తమవైపు వస్తారని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే, బీజేపీని పక్కన పెట్టి కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో తెలిసిన బీజేపీ నేతలు మరోసారి చంద్రబాబును నమ్మి మోసపోయేవాళ్లమే కదా, ఇప్పటికైనా పొత్తు కుదుర్చుకోకుండా మంచి పని చేశాం అని ఊరట చెందుతున్నారు.
అయితే, 2024 ఎన్నికలకు ముందే రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీసగఢ్, తెలంగాణ అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ గెలిస్తే చంద్రబాబు మళ్లీ ప్లేట్ ఫిరాయించి బీజేపీ వైపు చూసే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడుకు ఏ మాత్రం మొహమాటం ఉండదు. ఎవరి గాలి వీస్తే వారి వైపు కొట్టుకు వెళ్లేందుకు చంద్రబాబు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారనేది ఆయన రాజకీయ చాణక్యం తెలిసిన వారందరికీ తెలుసు.