Saturday, May 3, 2025

పోసానిని వెంటాడుతున్న కేసులు.. తాజాగా మరో కేసు!

- Advertisement -

పోసాని కృష్ణ మురళి విషయంలో కూటమి ప్రభుత్వం దూకుడుగా ఉంది. ఇప్పట్లో ఆయనను విడిచి పెట్టకూడదని భావిస్తోంది. ఇటీవలే ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. కానీ మరో కేసులో అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధపడుతున్నారు. మొన్నటికి మొన్న వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 19 కేసులు నమోదు చేశారు. ఇప్పుడు ఎన్నికల ఫలితాల తరువాత వ్యాఖ్యలు చేశారంటూ కొత్త కేసులు నమోదు చేస్తున్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పోసాని కృష్ణమురళి ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఉండేవారు. అంతకుముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి అభిమానిగా కొనసాగారు. 2019 ఎన్నికల్లో పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయనకు ఎనలేని ప్రాధాన్యం దక్కింది. అందుకే పోసాని కృష్ణ మురళి జగన్మోహన్ రెడ్డి పై గౌరవభావంతో చూసుకునేవారు. ఆ సమయంలోనే రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తే కౌంటర్ ఇచ్చేవారు. అదే ఇప్పుడు కూటమికి కంటగింపుగా మారింది.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై కేసులు తప్పవని భావించారు పోసాని కృష్ణ మురళి. రాజకీయాలనుంచి కాస్త దూరంగా ఉండాలని భావించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ప్రకటించారు. ఇకనుంచి రాజకీయాల విషయంలో మాట్లాడనని కూడా చెప్పుకొచ్చారు. కానీ కూటమి కనికరించలేదు. పోసాని కృష్ణ మురళి పై ఉక్కు పాదం మోపింది. ఏకంగా 19 కేసులు నమోదు చేసింది.

ఫిబ్రవరి 26న హైదరాబాదులో అరెస్ట్ అయ్యారు పోసాని కృష్ణ మురళి. అది మొదలు 26 రోజులపాటు కస్టడీల మీద కస్టడీలు కొనసాగాయి. రిమాండ్ రోజులు పెరిగాయి. నా ఆరోగ్యం బాగాలేదు మహాప్రభు అంటూ పోసాని కృష్ణ మురళి కన్నీటి పర్యంతం అయిన కనికరించేవారు కరువయ్యారు. ఎలాగోలా సిఐడి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. కానీ ఇప్పుడు మరో కేసుతో పోసాని కృష్ణ మురళిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు పోలీసులు.

టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు నియమితులైన సంగతి తెలిసిందే. అయితే ఆ నియామకాన్ని ఎద్దేవా చేస్తూ మాట్లాడారట పోసాని కృష్ణ మురళి. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారట. దానిపై సూళ్లూరుపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు వచ్చిందట. దీంతో అక్కడ సిఐ మురళీకృష్ణ ఏకంగా నోటీసులు ఇచ్చేశారు. 15న విచారణకు హాజరు కావాల్సిందేనని తేల్చేశారు.

అయితే ఆ సీఐ ఇచ్చిన నోటీసును తప్పు పట్టింది హైకోర్టు. ఈ కేసులో అదనంగా 11 సెక్షన్ తో పాటు మహిళను అసభ్యంగా చిత్రీకరించారని సెక్షన్లు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించింది. కేసు పై తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ముందుకెళ్లొద్దని కోర్టు ఆదేశించింది. అయితే పోసాని విషయంలో ఈ కేసు కాకపోతే ఇంకో కేసు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వ ఆలోచన పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి ప్రతీకార రాజకీయాలు ఎన్నడూ చూడలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!