AP Politics:వరద విపత్తులోనూ కూటమి ప్రభుత్వం బురద రాజకీయం చేస్తోంది. ఓ వైపు ప్రజలు తమకు సరైన సహాయ సహకారాలు అందడం లేదని ప్రభుత్వాన్ని బాహాటంగానే విమర్శిస్తున్నా.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోంది. మాజీ ఎంపీ, దళిత నాయకుడు నందిగం సురేష్‌ని అక్రమ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలో వరద బాధితుల గోడు పట్టించుకోని చంద్రబాబు ఇలాంటి విపరీత చర్యలకు పాల్పడం ఏంటని వైసీపీ శ్రేణులు నిలదీస్తున్నాయి. వరద విలయ తాండవం చేసిన సింగ్ నగర్‌లో బాధితులకి అండగా నిలబడి సాయపడిన విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త అవుతు శ్రీనివాసరెడ్డిని కూడా అరెస్ట్ చేసి టీడీపీ కూటమి ప్రభుత్వం తన స్వార్థ రాజకీయాలు చేస్తోంది.
అక్రమ కేసులో నందిగం సురేష్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి రాత్రికి రాత్రే గుంటూరుకు తరలించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ వెంట నా భర్త నిలబడినందుకే తమపై ఇలా చంద్రబాబు కక్ష సాధిస్తున్నారని స్వయంగా నందిగం సురేష్ భార్య బేబీలత చెప్పడం గమనార్హం. 2014 నుంచే చంద్రబాబు తమను టార్గెట్ చేశారని అన్నారు. గతంలోనే తన భర్తని ప్రలోభాలకి గురి చేశారని.. లొంగలేదని పోలీస్ స్టేషన్‌లోనే చంద్రబాబు చంపించే ప్రయత్నం చేశారని అసలు నిజాలు బయటపెట్టారు బేబీలత. రాజకీయంగా ఏదైనా ఉంటే అలాగే ఎదుర్కోవాలని.. కానీ ఇలా అక్రమ కేసులు బనాయించడం ఏ మాత్రం సరైనదో చెప్పాలని ప్రశ్నించారు. తన భర్తకు ఏమైనా అయితే చంద్రబాబు మాత్రమే పూర్తి బాధ్యత వహించాలని సురేష్ భార్య అన్నారు. ఇదిలా ఉండగా.. తన స్వార్థ రాజకీయాల కోసం అమాయకులైన దళితులతో ఇలా ఆడుకోవడం ఒక సీఎం హోదాలో ఉన్న మనిషికి తగునా అంటూ వైసీపీ చంద్రబాబుపై ధ్వజమెత్తింది