పవన్ కళ్యాణ్ చేసే ప్రకటనలకు.. చేస్తుంటే పనికి పొంతన ఉండదు. అప్పట్లో చేగువేరా అంటూ అభ్యుదయ భావాలను ప్రకటించారు. ఇప్పుడేమో సనాతన ధర్మ పరిరక్షణ అంటూ హిందూ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడినా తప్పులేదు గాని.. రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం ఊసరవెల్లిలా మారిపోతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు వామపక్షా నేతలు. చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ తీరుపైనే వారు ఎక్కువగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల జనసేన ప్లీనరీలో ఆయన మాటలను తీవ్రంగా తప్పుపడుతున్నారు వామపక్ష నేతలు. జాతీయ వాదంతో పాటు హిందీ, సంస్కృతం బాష విషయాల్లో తమిళ నేతల తీరును తప్పుపట్టారు పవన్ కళ్యాణ్. గతంలో హిందీని రుద్దడాన్ని పవన్ కళ్యాణ్ తప్పు పట్టారు. ఇప్పుడు తన మాటలను వక్రీకరించ వద్దంటూ.. త్రిభాషా సూత్రాలను గౌరవించాలంటున్నారు. పవన్ కళ్యాణ్ లో ఈ వేరియేషన్స్ ఏంటి అని వామపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ పోషించినట్టుగా.. రాజకీయాల్లో కూడా వేరియేషన్స్ చూపిస్తూ ఉంటారు. వామపక్ష పార్టీలతో ఆయన అనుబంధం పెట్టుకున్నప్పుడు.. లెఫ్ట్ ఐడియాలజీని ఎంతగానో పొగిడేవారు. ఒక దశలో తాను నక్సలైట్లు చేరాలని అనుకున్నానని చెప్పుకున్నారు. మాయావతి తో పొత్తు పెట్టుకున్నప్పుడు బీభత్సమైన దళిత ప్రేమను వలకబోశారు. ప్రస్తుతం బిజెపితో పొత్తు నడుస్తుండడంతో సనాతన ధర్మ పిపాసిగా మారారు.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. సనాతన ధర్మాన్ని ఉద్ధరించాలని మాట్లాడుతూ కాషాయం పట్టుకొని తిరుగుతున్న పవన్.. పంచాయతీరాజ్ శాఖ కంటే దేవాదాయ శాఖ ఇస్తే బెటర్ అని సలహా ఇచ్చారు. పాలనను గాలికి వదిలేసి కాషాయ బట్టలతో గుడులు తిరుగుతుండడాన్ని తప్పుపట్టారు.
సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అయితే పవన్ కళ్యాణ్ ను పిచ్చోడితో పోల్చారు. పిచ్చాసుపత్రికి తరలించాలని సూచించారు. రోజుకో మాటతో మాటలు మార్చుకున్న పవన్ కళ్యాణ్ కు అంతకంటే మార్గం లేదన్నారు. ఒకసారి చేగువేరా, మరోసారి సావర్కర్, ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నారని ఎద్దేవా చేశారు.
అయితే నారాయణ అంతటితో ఆగలేదు. సనాతన ధర్మంలో సతీసహగమనం ఉండేదని.. అదే ఫార్ములాను పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారా.. మూడు పెళ్లిళ్ల పవన్ కళ్యాణ్ అంటూ ఘాటుగానే మాట్లాడారు నారాయణ. అంతలా పవన్ వైఖరితో చిరాకు పడుతున్నారు నారాయణ. మొత్తానికి అయితే వామపక్షాల నేతలు పవన్ కళ్యాణ్ ను గట్టిగానే తగులుకున్నారు.