ఎమ్మెల్సీగా మాజీమంత్రి ఆలపాటి రాజా గెలుపు అంత ఈజీ కాదా? తెలుగుదేశం పార్టీ నేతలు సహాయ నిరాకరణ చేస్తున్నారా? కనీసం సహకరించడం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను బరిలోకి దించింది తెలుగుదేశం పార్టీ. కానీ ఆ రెండు జిల్లాల్లో ఆలపాటి రాజాకు కూటమి పార్టీ శ్రేణులు అంతగా సహకరించడం లేదు. సొంత పార్టీ తెలుగుదేశంలో కూడా ఆయన అభ్యర్థిత్వం పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ దూకుడు ఆయనకు ఇప్పుడు మైనస్ గా మారింది.
పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర ఆలపాటి రాజాను వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు సహకరించేది లేదని తేల్చి చెబుతున్నారు. సంగం డైరీ విషయంలో తనకు వ్యతిరేకంగా ఆలపాటి రాజా పావులు కదిపారని.. తన వ్యక్తిగత జోలికి కూడా వచ్చారని.. అందుకే ఆయనకు సహకరించనని బాహటంగానే చెబుతున్నారు నరేంద్ర. దీంతో హై కమాండ్ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ను ప్రయోగించింది. ఆయన ధూళిపాళ్ల నరేంద్ర తో చర్చలు జరిపారు కూడా. అయితే ఈ విషయంలో చంద్రబాబు వద్ద తేల్చుకుంటానని ధూళిపాళ్ల నరేంద్ర చెప్పినట్లు సమాచారం.
మరోవైపు మంత్రి నాదెండ్ల మనోహర్ సైతం పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. తెనాలి నియోజకవర్గంలో సుదీర్ఘకాలం ప్రత్యర్థిగా ఉన్నారు ఆలపాటి రాజా. గతంలో నాదెండ్ల మనోహర్ కు చాలా రకాల ఇబ్బందులు పెట్టారు. ఈ ఎన్నికల్లో సైతం తనకే టిక్కెట్ వస్తుందని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో సైతం నాదెండ్ల మనోహర్ కు పెద్దగా సహకారం అందించలేదు. అందుకే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ సహాయ నిరాకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఆలపాటి రాజా జనసేన క్యాడర్ అంటే నిర్లక్ష్యంగా చూస్తూ వచ్చినట్లు సమాచారం. అందుకే ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించకూడదని జనసేన శ్రేణులు తీర్మానించుకున్నట్లు ప్రచారం నడుస్తోంది.
మరోవైపు గుంటూరు నగరంలోని రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సైతం పెద్దగా మొగ్గు చూపడం లేదు. ఇప్పటికే గుంటూరు నగర రాజకీయాల్లో ఆలపాటి రాజా తలదూర్చారు. ఆయన కానీ ఎమ్మెల్సీగా ఎన్నికైతే గుంటూరు నగరంలో ప్రవేశిస్తారని వారిలో ఒక రకమైన ఆందోళన ఉంది. కనీసం ఆ రెండు జిల్లాల్లో కూటమి పార్టీల ఎమ్మెల్యేలు కూడా పెద్దగా రియాక్ట్ కావడం లేదు. ఆలపాటి ఉమా ప్రచారానికి సైతం చాలా మంది దూరంగా ఉంటున్నారు. అయితే ఈ విషయంలో టిడిపి హై కమాండ్ స్పందించకుంటే మాత్రం ఆలపాటి రాజా గెలుపు పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బరిలో లేకపోవడంతో ఒక రకమైన ఉపశమనం. అయితే ప్రజాసంఘాల మద్దతుతో అభ్యర్థి ముందుకు వెళ్తున్నారు. ఒకవేళ కూటమి ఎమ్మెల్యేల సహాయ నిరాకరణ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు సదరు అభ్యర్థికి దొరికితే మాత్రం ఆలపాటి రాజాకు ఇబ్బందికరమే