మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన నేతగా ఉన్నారు. ఆ పార్టీలో కీలక నాయకుడిగా ఎదగాలని భావించారు. పవన్ కళ్యాణ్, నాదేండ్ల మనోహర్ తర్వాత తానే నాయకుడు అవుతానని అంచనా వేసుకున్నారు. జనసేనలో చేరికను రిచ్ గా ప్లాన్ వేసుకున్నారు. కానీ అడుగడుగునా ఆయనకు అడ్డంకులు ఎదురయ్యాయి. ఒక సాధారణ నేతగా ఆయన జనసేనలోకి ఎంట్రీ ఇచ్చారు. అది మొదలు ఆయనకు ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. అటు ఆయన చేరికను కూటమి పార్టీల శ్రేణులు వ్యతిరేకించాయి. ప్రకాశం జిల్లా జనసేన నేతలు సైతం పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో బాలినేని పరిస్థితి రోజురోజుకు ఇబ్బందికరంగా మారుతోంది జనసేనలో.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కూడా ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. 2014 ఎన్నికల్లో బాలినేని ఓడిపోయారు. అయినా సరే 2019లో టిక్కెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. గెలిచిన వెంటనే తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆయన చేతుల్లో పెట్టారు. కానీ కేవలం విస్తరణలో మంత్రి పదవిని తప్పించారు అన్న ఒకే ఒక్క కారణంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఒక రకమైన భావనను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయేసరికి ఏకంగా పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దక్కిన గౌరవాన్ని గుర్తించకుండా జనసేనలో చేరారు. కానీ అక్కడ కూడా సరైన గౌరవం లేదు. దీంతో వెనక్కి రాలేక జనసేనలో కొనసాగలేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు.
జనసేన లో బలం పెంచుకునేందుకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారు. తన వెంట వైసిపి తాజా మాజీ లను జనసేన లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందించారు. అయితే ఇప్పటికే జనసేనలో చేరిన బాలినేని పరిస్థితిని చూసిన వైసీపీ నేతలు ఆయన వెంట నడిచేందుకు ముందుకు రాలేదు. తాజాగా ఒంగోలుకు చెందిన కొంతమంది కార్పొరేటర్ లను జనసేన లో కి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేశారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. తద్వారా తన బలాన్ని చూపించేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. కార్పొరేషన్ పాలకవర్గాల గడువు మరో ఏడాది ఉంది. అందుకే కార్పొరేటర్ల జనసేన చేరికను పవన్ అడ్డుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అవకాశం ఇస్తే ప్రకాశం జిల్లాలో కీలక నేతగా ఎదిగిపోతారని కూటమి నేతల్లో ఒక రకమైన ఆందోళన ఉంది. అందుకే బాలినేనిని అడుగడుగునా అడ్డుకుంటున్నారు. జనసేనలో కనీస ప్రాధాన్యం లేకుండా చేయాలని చూస్తున్నారు. పార్టీలోకి వస్తే ప్రాధాన్యం ఇస్తామని చెప్పిన నాగబాబు, పవన్ కళ్యాణ్ లు ఇప్పుడు పట్టించుకోవడం లేదు. అటు ప్రకాశం జిల్లాలో జనసేన నేతలు సైతం ఆయన వెంట కలిసి రావడం లేదు. కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు సైతం వేదిక పంచుకునేందుకు ఇష్టపడడం లేదు. దీంతో బాలినేనికి అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. జనసేనలో తన బలం చూపించడానికి చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. అందుకే కొద్ది రోజులుగా ఆయన సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది