ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్. కానీ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిన నాటి నుంచి బయటకు కనిపించకుండా మానేశారు. దీంతో హై కమాండ్ ప్రత్యామ్నాయం చూస్తోందన్న వార్తలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు సదరు నేత. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ శ్రేణులతో మమేకమై పనిచేస్తున్నారు. ఇంతకీ ఎవరా నేత? ఏంటా కథ? అని తెలియాలంటే ఈ స్టోరీ చూసేయాల్సిందే.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం. ఇక్కడ రాజకీయాలు హాట్ హాట్ గా ఉంటాయి. గత కొద్ది రోజులుగా ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈ ఎన్నికల్లో మాత్రం దారుణంగా ఓడిపోయారు. అప్పటినుంచి పెద్దగా కనిపించకుండా మానేశారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ ఎన్నికల్లో పోలింగ్ జరుగుతుండగా బూతుల్లోకి దూరిన రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేశారు. పోలింగ్ అనంతరం కూడా మాచర్లలో విధ్వంసం కొనసాగింది. దీంతో ఎన్నికల విధులకు అంతరాయం కలిగించడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై కేసు నమోదయింది. జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది.
చాలా రోజులపాటు జైల్లో ఉండిపోయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే ఇలా వచ్చిన ఆయన మాచర్ల నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. హైదరాబాద్ తో పాటు బెంగళూరులో వ్యక్తిగత పనులపై ఉంటున్నారు. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ వ్యవహారాలు కూడా తగ్గాయి. ఈ తరుణంలో అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రత్యామ్నాయం చూస్తున్నారన్న వార్తలు వచ్చాయి. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ శ్రేణులను తరచూ కలుస్తున్నారు. దీంతో మాచర్ల వైసీపీలో ఒక కొత్త కళ ప్రారంభం అయింది.
మాచర్ల నియోజకవర్గంలో పట్టున్న నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. 1996లో యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2004లో వెల్దుర్తి జడ్పిటిసిగా ఎన్నికయ్యారు. రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతో 2009లో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో కుమారుడు జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేశారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2014లో వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 2019లో గెలిచి వరుసగా నాలుగుసార్లు విజయం సాధించిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. అయితే సమీకరణలో భాగంగా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ప్రభుత్వ విప్ గా ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కానీ ఇటీవల యాక్టివ్ కావడం విశేషం.