ఎక్కడైనా ఓటమిల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. వైఫల్యాలను అధిగమించాలి. అప్పుడే అనుకున్నది సాధించగలం. టార్గెట్ కు చేరువ కాగలం. అయితే ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిలో మాత్రం మార్పు రావడం లేదన్న ఆవేదన పార్టీ శ్రేణుల్లో ఉంది. ఆయన వరకు ఓకే కానీ.. పార్టీలో కొన్ని రకాల అనవసర పదవులు ఉన్నాయని.. వాటిని తొలగించాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. ఈ విషయంలో అధినేత పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
జగన్మోహన్ రెడ్డిలో ఒక స్పష్టమైన మార్పు మాత్రం కనిపిస్తోంది. ఆయన ఇటీవల అయితే ఓ కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇకనుంచి మరో ఎత్తు అన్నట్టు ఉంటుంది పరిస్థితి అని తేల్చి చెప్పారు. జగన్ 1.0 ప్రజల కోసమని.. జగన్ 2.0 కార్యకర్తల కోసమేనని స్పష్టం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డిలో ఈ తరహా మార్పును పార్టీ శ్రేణులు ఆహ్వానిస్తున్నాయి. కానీ కార్యకర్తలకు అధినేతకు మధ్య ఉన్న అడ్డుగోడలు తొలగించాలని కోరుతున్నాయి. ముఖ్యంగా కోటరీ వ్యవస్థ ఉండకూడదని చెబుతున్నాయి. రీజినల్ కోఆర్డినేటర్లు, సలహాదారులు వంటివి పార్టీని మరింత ఇబ్బందుల్లో పెడుతున్నాయి అన్నది మెజారిటీ శ్రేణుల అభిప్రాయం. ఈ విషయంలో అధినేత తీరులో మార్పు రావాలని కోరుకుంటున్నాయి.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రాంతీయ సమన్వయకర్తల పదవులను తొలగించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. దానివల్ల ప్రయోజనం కంటే నష్టం అధికమైన విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఏ పార్టీలో లేని విధంగా రీజనల్ కోఆర్డినేటర్ వ్యవస్థను తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. అత్యంత విధేయులకు ఆ పదవి కట్టబెట్టి బాధ్యతలు అప్పగించారు. అయితే కొంతవరకు వారి ద్వారా పార్టీ బలోపేతం అయింది. కానీ ఎక్కువ శాతం కోఆర్డినేటర్ల ద్వారా నష్టం జరిగిందనే వాదన ఉంది. పార్టీ బలోపేతం కోసం కోఆర్డినేటర్లు కష్టపడటం లేదన్న విమర్శ ఉంది. కొన్ని రకాల నివేదికలు, సర్వేలు మార్పు చేసి చెప్పడం ద్వారానే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని ఎక్కువమంది వాదిస్తున్నారు. అయితే మరి కొందరు కోఆర్డినేటర్లు సామంత రాజులుగా వ్యవహరించారని.. వారే షాడో సీఎంలు గా ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే అటువంటి వ్యవస్థను తీసివేస్తే మంచిదన్న అభిప్రాయం ఉంది.
జగన్మోహన్ రెడ్డిలో తాజాగా మార్పు వచ్చింది కానీ.. ఇంకా అడ్డుగోడలుగా కోఆర్డినేటర్లు, సలహాదారులు కొనసాగడాన్ని మాత్రం ఎక్కువ మంది తప్పు పడుతున్నారు. ఉగాది నుంచి ప్రజల్లోకి వస్తాననుకుంటున్న జగన్మోహన్ రెడ్డి.. అంతకంటే ముందే తాను మారానన్న సంకేతాలు పార్టీ శ్రేణులకు పంపించాల్సిన అవసరం ఉంది. గత ఎన్నికలకు ముందు 80 మంది అభ్యర్థులను మార్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ ప్రయోగం విఫలమయ్యింది. అందుకే ఆ పాత నేతలనంత తిరిగి నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించాలని డిమాండ్ వినిపిస్తోంది. పార్టీ క్యాడర్ కూడా అదే కోరుకుంటుంది. ప్రయోగాలు విఫలమైనప్పుడు మళ్లీ యధా స్థానానికి ఆ నేతలను చేర్చడం ప్రధాన విధి. కానీ జగన్మోహన్ రెడ్డి కేవలం కొద్ది మందిని మాత్రమే ఆ విధంగా మార్చారు. ఇంకా చాలామంది నేతలు ఉన్నారు. వారందరినీ మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి జిల్లాల వారీగా స్థానిక ప్రజాప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతున్నారు. పార్టీ నిర్మాణం విషయంలో వారి అభిప్రాయాలను తీసుకొని.. వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అధినేత జగన్మోహన్ రెడ్డి పై ఉంది.