జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా 71 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో ఏడు పాయింట్లతో టీమ్ ఇండియా గ్రూప్ 2లో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. భారత్ ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ హైలెట్‌గా చెప్పాలి. తన సూపర్ ఫామ్‌ను కొనసాగించిన వేళ స్కై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అసలు భారత్ 150 స్కోర్ చేస్తుందనుకున్న దశలో సూర్యకుమార్ విధ్వంసకర బ్యాటింగ్‌తో రెచ్చిపోయాడు. ఆరంభంలో రోహిత్ నిరాశ పరిచినా.. రాహుల్, కోహ్లీ కీలక పార్టనర్‌షిప్‌తో భారత్ కోలుకుంది. మధ్యలో వరుస వికెట్లు కోల్పోవడంతో స్కోర్ వేగం తగ్గింది. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ టాప్ గేర్‌తో అమాంతం స్కోర్ పెంచేశాడు. విధ్వంకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. సూర్య కుమార్ జోరుకు చివరి 5 ఓవర్లలో భారత్ 56 పరుగులు చేసింది. స్కై కేవలం 25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
భారీ టార్గెట్‌తో బరిలో దిగిన జింబాబ్వేను ఆరంభంలోనే భువనేశ్వర్, అర్షదీప్ దెబ్బకొట్టారు. మెద్వేర్, చబాకా పరుగులు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు.
సీన్ విలియమ్సన్, ఇర్విన్ కూడా తక్కువ పరుగులకే ఔట్ కావడంతో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి జింబాబ్వే కష్టాల్లో పడింది. సికిందర్ రజా 34 , రయాన్ బర్ల్ 35 రన్స్ చేయడంతో జింబాబ్వే వంద పరుగులు దాటింది. వారిద్దరూ ఔట్ కావడంతో మిగిలిన వికెట్లను వేగంగా కోల్పోయింది.భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. చివరికి ఆ జట్టు 115 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 3 , పాండ్యా 2, షమీ 2 , అర్షదీప్, భువనేశ్వర్, అర్షదీప్‌సింగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో గ్రూప్ 2లో 8 పాయింట్లు సాధించిన భారత్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. బుధవారం తొలి సెమీఫైనల్లో పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడనుండగా.. గురువారం జరిగే రెండో సెమీస్‌లో భారత్, ఇంగ్లాండ్ తలపడతాయి.