తెలుగుదేశం పార్టీకి పట్టున్న జిల్లాలో కృష్ణా ఒకటి. ఎంతో విపత్కర పరిస్థితుల్లో తప్ప.. ఆ జిల్లాలో ప్రతి ఎన్నికల్లోను తెలుగుదేశం పార్టీ హవా చాటుకుంటూ వస్తోంది. 2024 ఎన్నికల్లో మాత్రం క్లీన్ స్లీప్ చేసింది. అయితే దానికి కారణం లేకపోలేదు. కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న జిల్లా కావడమే అందుకు కారణం. 2024 ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గమంతా ఏకతాటిపైకి వచ్చింది. దాని ఫలితమే తెలుగుదేశం పార్టీకి ఏకపక్ష విజయం.
అయితే కృష్ణాజిల్లాలో విపరీతమైన ప్రభావం చూపారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. మొన్నటి ఎన్నికల్లో పార్టీ కోసం తన టిక్కెట్ నే త్యాగం చేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ ఛాన్స్ దక్కడం లేదు. నిన్నటికి నిన్న 3 ఎమ్మెల్సీ పదవుల్లో కూడా ఆయనకు అవకాశం లేకుండా పోయింది. అయితే ఇందుకు కృష్ణ జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు కారణమని ప్రచారం జరుగుతోంది.
నిన్న మొన్నటి వరకు కృష్ణాజిల్లా అంటే దేవినేని ఉమా అన్నట్టు ఉండేది పరిస్థితి. 1999 ఎన్నికల నుంచి 2019 ఎన్నికల ముందు వరకు కృష్ణ టిడిపి అంటే దేవినేని ఉమామహేశ్వరరావు పేరు ప్రముఖంగా వినిపించేది. చంద్రబాబు సైతం ఉమామహేశ్వరరావు మాటకు కట్టుబడి ఉండేవారు.
దేవినేని ఉమామహేశ్వరరావు తీరుతోనే కొడాలి నాని, కేసినేని నాని, దాసరి బలవర్ధన్ రావు, వల్లభనేని వంశీ మోహన్ వంటి కమ్మ నేతలు టిడిపికి దూరమయ్యారన్న ప్రచారం ఉంది. చంద్రబాబుతో పాటు లోకేష్ వద్ద పలుకుబడి సాధించి నేతలకు చెక్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
1999 ఎన్నికల్లో నందిగామ నుంచి గెలిచారు దేవినేని ఉమామహేశ్వరరావు. 2004 ఎన్నికల్లో సైతం అదే నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2009లో మైలవరం నియోజకవర్గానికి మారి తన సత్తా చాటారు. మూడోసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2014లో మైలవరంలో రెండోసారి పోటీ చేసి గెలిచిన ఆయనను క్యాబినెట్ లోకి తీసుకున్నారు చంద్రబాబు. ఏకంగా సాగునీటి శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. కానీ 2014లో మైలవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఉమా. అప్పటినుంచి ఆయన ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది.
2024 ఎన్నికల్లో తన చిరకాల ప్రత్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ టిడిపిలోకి రావడంతో మైలవరం టికెట్ త్యాగం చేశారు దేవినేని ఉమ. అయితే ఎమ్మెల్సీ పదవి హామీ తోనే ఆయన పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం సాగింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని ప్రచారం జరిగింది. కానీ ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు.
ఇటీవల 3 ఎమ్మెల్సీ పదవుల భర్తీ జరిగిన సంగతి తెలిసిందే. కమ్మ సామాజిక వర్గానికి ఒక పదవి ఇవ్వాలని చంద్రబాబు భావించినట్లు సమాచారం. అయితే దేవినేని ఉమామహేశ్వరరావు అభ్యర్థిత్వానికి ఖరారు చేశారు. కానీ చివరి నిమిషంలో తప్పించారు. అందుకు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కారణమని ప్రచారం సాగుతోంది. దేవినేని ఉమా ఎమ్మెల్సీగా ఎన్నికైతే మైలవరం, జగ్గంపేట, నందిగామ నియోజకవర్గాల్లో మరో అధికారిక కేంద్రంగా మారుతారని ఆ ఇద్దరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. అందుకే ఉమామహేశ్వరరావు ఎంపిక నిలిచిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.