YSRCP: రాష్ట్రంలో వైఎస్సార్సీపీని మళ్లీ రాజకీయంగా బలోపేతం చేయడానికి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో సంస్థాగత మార్పుల్లో భాగంగా ఇప్పటికే కీలక పదవుల భర్తీలో భాగంగా నియామకాలు జరిగాయి. గ్రామ స్థాయి నుంచి వైసీపీ బలోపేతానికి జిల్లాలకు పార్టీ అధ్యక్షుల నియామకం చేపడుతోంది వైసీపీ. ఈ క్రమంలోనే నిన్న కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నేతలతో తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మరికొన్ని జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. వైఎస్ జగన్ ఆదేశాలతో పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబు, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పేర్ని నాని, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దేవినేని అవినాష్, రాష్ట్ర అధికార ప్రతినిధిగా కైలే అనిల్ కుమార్.. గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులుగా మోదుగుల వేణుగోపాలరెడ్డి, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దొంతిరెడ్డి శంకర్‌రెడ్డి నియమితులయ్యారు. కాగా, వైసీపీ నేతలతో జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తూ తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు ఇందులో భాగంగానే వైసీపీని మరింత పటిష్టం చేయడానికి పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.